కాలం కలిసొస్తే.. 'సీఎం రమేష్' కు రాజభోగమే.. !
రాజకీయాల్లో కాలం కలిసి రావడం అనే మాట తరచుగా వినిపిస్తుంది. ఎంతో శ్రమించినా.. ఒక్కొక్కసారి విజయం అందుకోవడం చాలా కష్టం.
రాజకీయాల్లో కాలం కలిసి రావడం అనే మాట తరచుగా వినిపిస్తుంది. ఎంతో శ్రమించినా.. ఒక్కొక్కసారి విజయం అందుకోవడం చాలా కష్టం. కానీ, కాలం కలిసి వస్తే.. మూలనున్న ముసలమ్మ కూడా ఎన్నికల గోదాలో గెలుపు గుర్రం ఎక్కడం గత ఏడాది జరిగిన ఎన్నికల్లో స్పష్టంగా మనకు కనిపించింది. ఇలానే ప్రస్తుత బీజేపీ నాయకుడు, టీడీపీ మాజీ నేత సీఎం రమేష్ విషయంలోనూ జరుగుతోంది. ఎక్కడో కడప నుంచి ఇంకెక్కడో ఉన్న అనకాపల్లికి వచ్చి రాజకీయాలు చేయడం విజయం దక్కించుకోవడం.. కాలం కలిసి రావడమే కదా!
నిజానికి రమేష్‌కు టికెట్ దక్కుతుందని ఊహించినా.. అనకాపల్లి నుంచి దక్కుతుందని ఎవరూ ఊహించి ఉండరు. ఇక, టికెట్ దక్కినా.. గెలుపు గుర్రం ఎక్కుతారని కూడా ఎవరూ అనుకుని ఉండరు. కానీ, ఆయన కు టైం కలిసి వచ్చేసింది. విజయం ఇచ్చేసింది. కట్ చేస్తే.. ప్రస్తుతం బీజేపీలోనూ ఆయన కేంద్ర పెద్దల కనుసన్నల్లో కీలక నాయకుడిగా ఉన్నారు. ఇటీవల ప్రధాని మోడీ విశాఖకు వస్తే.. ఆసాంతం సీఎం రమేషే అన్నీ అయి వ్యవహరించారు.
ముందు-చివర కూడా.. ప్రధాని మోడీ అభివాదం చేసే స్థాయికి చేరుకున్నారు. ఇక, సభలో తొలి ప్రసంగం చేసే అవకాశం ఎలానూ ప్రోటోకాల్ ప్రకారం దక్కింది. ఇక, ప్రస్తుతం రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గానే కాకుండా.. జమిలి ఎన్నికల బోర్డులోనూ సీఎం రమేష్‌కు ప్రాధాన్యం లభించింది. మరోవైపు.. కేంద్రంలోని పెద్దలతోనూ ఆయన సఖ్యత కొనసాగిస్తున్నారు. ఈ పరిణామాలతో మరింతగా కాలం కనుక కలిసివస్తే.. బీజేపీ ఆయనకు వీరతాడు వేసే అవకాశం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.
త్వరలోనే ఏపీ బీజేపీకి చీఫ్‌ను ఎంపిక చేయాల్సి ఉంది. ప్రస్తుతం చీఫ్‌గా ఉన్న పురందేశ్వరి సమయం ఆసన్నమైంది. రెండేళ్ల పరిమితికి మించి కొనసాగించలేరు. కాబట్టి ఈ పోస్టును కాలం కలిసి వస్తే.. సీఎం రమేష్‌కు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే.. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో పురందేశ్వరి నేతృత్వంలో బీజేపీ వీర విజయం దక్కించుకున్న నేపథ్యంలో ఆమెనే కొనసాగించినా ఆశ్చర్యం లేదన్న టాక్ కూడా వినిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.