మరక పడకుండా రేవంత్ వ్యూహాత్మక జాగ్రత్తలు!

ఆలస్యం లేదు. అధికారం చేతికి అందిన వెంటనే జెట్ స్పీడ్ తో తన పని మొదలు పెట్టేశారు రేవంత్ రెడ్డి

Update: 2023-12-08 07:00 GMT

ఆలస్యం లేదు. అధికారం చేతికి అందిన వెంటనే జెట్ స్పీడ్ తో తన పని మొదలు పెట్టేశారు రేవంత్ రెడ్డి. ఏ కరెంటు పేరు చెప్పి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పలు చెప్పుకున్నారో.. ఆ మాటల్లో నిజాలు లేకపోగా.. అన్ని అబద్ధాలే అన్న విషయాన్ని నిరూపించేందుకు పని షురూ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యుత్ శాఖ మీద కేసీఆర్ ఇంతకాలం చెప్పిన గొప్పల వెనుక చేదు నిజాలు.. షాకింగ్ అంశాలతో పాటు.. భారీ అప్పును బయటకు రాకుండా మేనేజ్ చేసిన వైనంపై రేవంత్ సర్కారు సీరియస్ గా ఉంది. అలా అని తాను నేరుగా రంగంలోకి దిగకుండా.. ఏ అధికారుల చేత కేసీఆర్ పనులు చేయించారో.. అదే అధికారుల చేత గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని ప్రజలకు వివరించేలా చేయనున్నారు.

ఇందులో భాగంగా విద్యుత్ శాఖ గడిచిన పదేళ్లలో రూ.85 వేల కోట్ల అప్పుల్ని చేసిందన్న కఠిన వాస్తవాన్ని తాను చెప్పకుండా.. అలాంటి పరిస్థితిని తమ చేతలతో తీసుకొచ్చిన అధికారుల్ని ప్రజల ముందుకు తీసుకొచ్చి.. వారి చేతే కేసీఆర్ సర్కారు తీసుకున్న నిర్ణయాల్ని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా చెప్పాలి. రాజకీయ వైరంతో టార్గెట్ చేశారన్న మరక తమ ప్రభుత్వం మీద పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న రేవంత్.. అదే సమయంలో.. గత పాలకులకు చెమటలు పట్టేలా తొలి రోజునే తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

అంతేకాదు.. 2014 నుంచి 2023 డిసెంబరు 7 వరకు ఏ శాఖలో ఎన్ని నిధులు ఖర్చు పెట్టారు? దేనికి ఖర్చు చేశారు? వాటి ప్రయోజనాలు ప్రజలకు ఎంత మేర చేరువ అయ్యాయి? లాంటి కీలక అంశాల్ని శ్వేతపత్రం రూపంలో విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తెలంగాణ ప్రజలకు తెలియజేసేలా అన్ని వివరాల్ని తెలియజేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా అన్ని శాఖలు తమకు వివరాలు అందజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాలు జారీ చేశారు.

ఇందులో భాగంగా తొలి బాణం.. కీలకమైన విద్యుత్ శాఖ మీద సంధించారు. విద్యుత్ విషయంలో తమ సర్కారు అద్భుత విజయాల్ని సాధించిందని చెప్పే కేసీఆర్ మాటల్లో నిజం ఎంతన్న విషయం ప్రజలకు అర్థమయ్యేలా చేయాలని భావిస్తున్నారు. ఎందుకంటే.. రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా కోసం కొన్ని సందర్బాల్లో యూనిట్ రూ.32 చొప్పున కూడా కొనుగోలు చేసినట్లుగా చెబుతున్నారు. ఇందులో నిజం ఎంత ఉంది? అంత భారీ ధరకు ఎవరి వద్ద కొనుగోలు చేశారు? దాని వెనుక ఉన్న లెక్కలేంటి? లాంటి అంశాలతో పాటు పదేళ్ల వ్యవధిలో రూ.86వేల కోట్ల భారీ అప్పు తెలంగాణ విద్యుత్ శాఖ మెడకు చుట్టుకుందన్న విషయాన్ని ఆ శాఖకు చెందిన కీలక అధికారుల చేతే ప్రజలకు వివరించేలా చేయటమే రేవంత్ లక్ష్యమన్నట్లుగా చెబుతున్నారు.ఈ వేగం చూస్తే.. కొద్ది రోజుల్లోనే మరిన్ని సంచలనాల దిశగా పరుగులు తీస్తుందని చెప్పాలి.

Tags:    

Similar News