సముద్రుడు రాసిన మరణ శాసనం... 47 ఏళ్లైనా మరిచిపోలేని ఘోరం!
ఈ ఉప్పెన దాటికి తీర ప్రాంత గ్రామాలైన మూలపాలెం, దిండి, సొర్లగొంది, సంగమేస్వరం లాంటీ గ్రామాలు నామరూపాల్లేకుండా పోయాయి.
అది నవంబర్ 19 - 1977. ఇది చరిత్రలో ఒక తేదీ మాత్రమే కాదు.. దివిసీమపై సముద్రుడు విరుచుకుపడిన రోజు. జల ఖడ్గం దూస్తూ రాకాసి అలల రూపంలో సముద్రుడు ఊళ్లపై విరుచుకుపడిన రోజు. భారతదేశ చరిత్రలో అతంత ఘోరమైన విషాదాన్ని మిగిల్చిన రోజు. ఈ సముద్రుడు రాసిన మరణ శాసనానికి నేటితో 47 ఏళ్లు.
అవును... ప్రశాంతంగా నిద్రిస్తున్న అమాయక ప్రజలపై సముద్రుడు ఒక్కసారిగా విరుచుకుపడిన రోజు 1977 - నవంబర్ 19. సరిగ్గా నేటికి 47 ఏళ్లు. ఈ మహా ప్రళయం దాడికి ఏకంగా 14,000 మందికిపైగా మృత్యువాత పడ్డారు. అనధికారికంగా వీరి సంఖ్య 50వేలు పైమాటే అని అంటారు. ఇక మూగ జీవాల సంఖ్య లక్షల్లో ఉంటుందని చెబుతారు.
ఈ ఉప్పెన దాటికి తీర ప్రాంత గ్రామాలైన మూలపాలెం, దిండి, సొర్లగొంది, సంగమేస్వరం లాంటీ గ్రామాలు నామరూపాల్లేకుండా పోయాయి. ఇక ఈ విధ్వంసానికి కొట్టుకు వచ్చిన మృతదేహాల గుట్టలు ఎక్కడ పడితే అక్కడ కనిపించేవని చెబుతారు. ఈ ప్రాంతాల్లో శవం కనిపించని చోటు లేదని చెబుతారు.
సుమారు కొన్ని నెలల పాటు ఏదో ఒక మూల శవాలు కనిపిస్తూ ఉండేవంటే నాటి ప్రళయం ఏ స్థాయిలో జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో... ఏటా నవంబర్ 19 వచ్చిందంటే చాలు ఆయా గ్రామాల ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతారంట. ఎన్ని ఏళ్లు గడిచినా.. సుమారు అర్ధశతాబ్ధం కావొస్తున్నా ఇంకా దాని తాలూకు భయాలు మాత్రం వీడలేదని చెబుతుంటారు.
అసలేం జరిగింది?:
నవంబర్ 18 - 1977న అండమాన్ నికోబర్ దీవుల వద్ద అల్పపీడనం ఏర్పడింది. ఇది సముద్ర తీరానికి సుమారు 520 కి.మీ.ల వద్ద ఏర్పడి.. తర్వాత తుఫానుగా రూపాంతరం చెందింది. ఈ సమయంలో గంటకు సుమారు 170 కి.మీ.ల వేగంతో దిశలు మార్చుకుంటు ఈ తుఫాను ప్రయాణించింది. ఈ సమయంలో ఏపీలోని సముద్ర తీరానికి 140 కి.మీ. దూరంలో ఉండగా... వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఈ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని నొక్కి చెప్పింది. అయితే.. అప్పటికి ఇంకా సమాచార, సాంకేతిక రంగం అభివృద్ధి చెందకపోవడంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదు! దీంతో కనీవినీ ఎరుగని అపార నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది. కృష్ణాజిల్లా సమీపంలోని సముద్రం అల్లకల్లోలంగా మారింది.
దీంతో ఆ మర్నాడు (నవంబర్ 19)న కోడూరు, నాగాయలంక ప్రాంతంలో తీరం దాటిన తుఫాను బీభత్సం సృష్టించింది. గ్రామాల్లోని ప్రజలంతా గాఢనిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా విరుచుకుపడింది. రెండు మూడు తాటిచెట్లంత ఎత్తులో సముద్ర కెరటాలు ఎగసి పడుతూ ప్రళయం సృష్టించాయి! దీంతో.. పెను విషాదం మిగిలింది!