రేవంత్ యూఎస్ టూర్ లో భారీ విజయం..భారీ విస్తరణకు కాగ్నిజెంట్ ఓకే
కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్.. కంపెనీఇతర ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ సందర్భంలో ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబడుల్ని ఆకర్షించటమే లక్ష్యంగా అమెరికా.. సౌత్ కొరియా దేశాల్లో పర్యటించేందుకు వీలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విదేశీ ప్రయాణం ఉత్తమ ఫలితాల్ని ఇస్తోంది. ఐటీ సేవల్ని అందించే దిగ్గజ కంపెనీల్లో ఒకటైన కాగ్నిజెంట్ భారీ విస్తరణ ప్లాన్ ను రేవంత్ సమక్షంలో ప్రకటించింది. దాదాపు 15 లక్షల చదరపు అడుగుల్లో 15 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే కొత్త క్యాంపస్ ను ఏర్పాటు చేసేందుకు ఓకే చెప్పింది.
కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్.. కంపెనీఇతర ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ సందర్భంలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య చర్చలు జరిగాయి. అనంతరం కాగ్నిజెంట్ విస్తరణ ప్లాన్ పై కొత్త ఒప్పందం జరిగింది. ఈ విజయం పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖాతాలో పడుతుందని చెప్పాలి. ఎందుకుంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఆయన చేసిన తొలి విదేశీ పర్యటన దావోస్ కు వెళ్లటం. ఆ సందర్భంగా ఈ ఒప్పందానికి పునాదులు పడ్డాయి.
కొత్త ఆవిష్కరణలు.. టెక్నాలజీలను డెవలప్ చేసే సెంటర్ ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్న కాగ్నిజెంట్ అందుకు అనువైన ప్రాంతాల్ని వెతికే క్రమంలో హైదరాబాద్ ను ఎంపిక చేసుకుంది. తాజాగా చేసుకున్న ఒప్పందంపై ముఖ్యమంత్రి రేవంత్ స్పందిస్తూ.. ఐటీ రంగానికి మరింత అనుకూలమైన వాతావరణాన్ని హైదరాబాద్ లో కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కాగ్నిజెంట్ సంస్థ ఏర్పాటు చేస్తున్న కొత్త సెంటర్ తో ప్రపంచ టెక్నాలజీ సంస్థలన్ని హైదరాబాద్ ను తమ ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకుంటాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
హైదరాబాద్ లో ఏర్పాటు చేసే కొత్త సెంటర్ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ క్లయింట్లకు మెరుగైన సేవల్ని అందించేందుకు ఉపయోగపడుతుందన్నారు కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్. అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్.. మెషిన్ లెర్నింగ్.. డిజిటల్ ఇంజనీరింగ్.. క్లౌడ్ సొల్యూషన్స్ సహా వివిధ ఆదునాతన సాంకేతికతలపై కొత్త సెంటర్ ప్రత్యేకంగా ఫోకస్ చేస్తుందని.. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని టైర్ 2 నగరాల్లోనూ ఐీ సేవల్ని విస్తరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. మొత్తంగా తన విదేశీ పర్యటనలో కీలకమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవటంలో రేవంత్ సక్సెస్ అయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.