లైంగిక వేధింపులు తాళలేక లేక విద్యార్థిని సూసైడ్!
ఇటువంటి నేపథ్యంలోనే తాజాగా విశాఖలోని ఓ పాలిటెక్నిక్ కాలేజీలో విద్యార్థిని ఇటువంటి బ్లాక్మెయిల్ వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.
ఈ హైటెక్ జమానాలో సెల్ ఫోన్ వాడకం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే టెక్నాలజీని కొందరు ఆకతాయిలు దుర్వినియోగం చేస్తున్నారు. ప్రేమ పేరుతో అమ్మాయిలను లోబరుచుకొని వారితో సన్నిహితంగా ఉన్న వీడియోలను రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ లకు పాల్పడుతున్నారు. ఇటువంటి లైంగిక వేధింపులకు గురైన కొంతమంది యువతులు, మహిళలు ధైర్యంగా తమ కుటుంబ సభ్యుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసి నిందితులను కటకటాల వెనక్కి నెట్టిస్తున్నారు. మరికొందరు యువతులు, మహిళలు తమ పరువు, తమ కుటుంబ పరువు పోతుందన్న ఉద్దేశంతో క్షణికావేశంలో బలవన్మమరణాలకు పాల్పడుతున్నారు.
ఇటువంటి నేపథ్యంలోనే తాజాగా విశాఖలోని ఓ పాలిటెక్నిక్ కాలేజీలో విద్యార్థిని ఇటువంటి బ్లాక్మెయిల్ వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. తాను లైంగిక వేధింపులకు గురయ్యానని, తన ఫోటోలు వారి దగ్గర ఉన్నాయని కుటుంబ సభ్యులకు ఆ విద్యార్థిని చివరగా రాత్రి ఒంటిగంట సమయంలో మెసేజ్ చేసింది.
ఆ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పెడతామంటూ తనను వారు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, వేరే గత్యంతరం లేకనే ఆత్మహత్యకు పాల్పడుతున్నానని తల్లిదండ్రులకు మెసేజ్ పెట్టింది.
తనను చాలా బాగా పెంచారని, ఇలా హఠాత్తుగా ఈ లోకం వదిలి వెళ్లిపోతున్నందుకు క్షమించాలని తల్లిదండ్రులను విద్యార్థిని కోరింది.
‘‘మీరు కంగారు పడొద్దు. నేను చెప్పేది వినండి. నేను ఎందుకు వెళ్లిపోతున్నానో మీకు చెప్పలేను. నేను చెప్పినా మీకు అర్థంకాదు. నన్ను మర్చిపోండి. క్షమించండి. అమ్మా.. నాన్నా.. నన్ను పెంచి పెద్దచేసినందుకు ధన్యవాదాలు. నా అధ్యాయం ముగిసిపోయింది’’ అని ఆ విద్యార్థిని చెప్పిన మాటలు కంటతడి పెట్టిస్తున్నాయి.
తనలా ఇతరుల ప్రభావానికి లోను కావద్దని గర్భిణి అయిన తన అక్కకు బాధిత విద్యార్థిని మెసేజ్ పెట్టింది. కాలేజీలో లైంగిక వేధింపులకు గురికావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తన తండ్రికి చెప్పింది. తనతోపాటు మరి కొందరు అమ్మాయిలు కూడా ఈ వేధింపుల బారిన పడ్డారని, వారిని కాపాడాలని కోరింది. పోలీసులకు గాని, కాలేజీ యాజమాన్యానికి గాని వారి గురించి ఫిర్యాదు చేస్తే తమ ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ చేస్తామంటూ బెదిరిస్తున్నారని వాపోయింది. తాను ఇప్పుడు చనిపోతే తన కుటుంబ సభ్యులు కొద్దిరోజులు మాత్రమే బాధపడి మర్చిపోతారని, బతికుంటే ప్రతిరోజు బాధపడతారని ఆవేదన వ్యక్తం చేసింది.
తన కూతురు ఎందుకు చనిపోయిందో తెలుసు కోవాలని, అల్లారు ముద్దుగా పెంచుకున్న తన బిడ్డ చావుకు కారకులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని బాధితురాలు తండ్రి పోలీసులకు కోరారు. అయితే, తమ కాలేజీలో పురుషులెవరికీ అనుమతి లేదని కాలేజీ ప్రిన్సిపాల్ అన్నారు. గర్ల్స్ హాస్టల్‌లోకి పురుషులను అనుమతించబోమని అన్నారు. అక్కడ అందరూ మహిళా వార్డెన్లు ఉన్నారని, వేధింపులకు అవకాశమే లేదని చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించి అధ్యాపకులను, ఇతర స్టూడెంట్లను ప్రశ్నిస్తున్నామని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.