సనాతన ధర్మంపై వ్యాఖ్యలు.. మంత్రిని తలంటిన సుప్రీంకోర్టు!

డీఎంకే మిత్రపక్షం కాంగ్రెస్‌ పార్టీ సైతం ఉదయనిధి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని.. కూటమికి ఏం సంబంధం లేదని తేల్చిచెప్పింది.

Update: 2024-03-04 10:38 GMT

సనాతన ధర్మం చికెన్‌ గున్యా, మలేరియా, డెంగ్యూ కంటే ప్రమాదకరమైందని.. దాన్ని నిర్మూలించాలంటూ గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్‌ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఉదయనిధి వ్యాఖ్యలపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. బీజేపీ నేతలు ఆయనపై మండిపడ్డారు. డీఎంకే మిత్రపక్షం కాంగ్రెస్‌ పార్టీ సైతం ఉదయనిధి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని.. కూటమికి ఏం సంబంధం లేదని తేల్చిచెప్పింది.

తనపై వివిధ రాష్ట్రాల్లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ లు అన్నింటినీ కలిపి విచారించాలంటూ ఉదయనిధి స్టాలిన్‌ సుప్రీంకోర్టు తలుపుతట్టిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ పై తాజాగా సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలను అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది.

మంత్రిగా ఉండి ఇవేం వ్యాఖ్యలని సుప్రీంకోర్టు మండిపడింది. ఎలాంటి వ్యాఖ్యలు చేయాలో, ఏ వ్యాఖ్యలు చేయకూడదో మంత్రిగా ఉన్నారు.. ఆ మాత్రం తెలియదా అని నిలదీసింది. వాక్‌ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ, మత స్వేచ్ఛ కింద ఉన్న హక్కులను ఉదయనిధి దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది కాక ఇప్పుడు రక్షణ కోసం ఉదయనిధే సుప్రీంకోర్టుకు వచ్చారని కోర్టు ఆక్షేపించింది.

మంత్రిగా ఉన్న ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో తెలియదా? ఆయనేం సామాన్య పౌరుడు కాదని.. ఓ మంత్రి పదవిలో ఉన్నారంటూ ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం తదుపరి విచారణను మార్చి 15వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజున తదుపరి విచారణను చేపడతామని వెల్లడించింది.

కాగా అప్పట్లో సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్‌ వాటిని సమర్థించుకున్నారు. తాను చెప్పిన దాంట్లో ఏ తప్పూ లేదన్నారు. క్షమాపణ చెప్పబోనని భీష్మించారు.

అంతేకాకుండా పార్లమెంటు ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ... రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించలేదన్నారు. ఆమె వితంతు మహిళ, గిరిజన స్త్రీ కావడమే ఇందుకు కారణమన్నారు. ఇలా వివక్ష చూపుతూ సనాతన ధర్మమంటే ఎవరు నమ్ముతారని ఉదయనిధి స్టాలిన్‌ మండిపడ్డారు. కాగా ఉదయనిధి స్టాలిన్‌ తన తండ్రి స్టాలిన్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Tags:    

Similar News