ఏపీ ఓటరుకు అగ్ని పరీక్ష !
చదువు కున్న వారు అయినా లేని వారు అయినా అపర కుబేరులు అయినా కడు బీద అయినా అందరికీ ఒక్కటే ఓటూ.
ఒక్క రోజు ప్రభువుగా ఏపీ ఓటరు మారుతున్నాడు. ఓటరు ముందు ఎంతటి వారు అయినా ఇపుడు చేతులు చాచాల్సిందే. ఎంతటి బలమైన నాయకుడు అయినా అధినేత అయినా ఓటరు నిర్ణయం కోసం ఎదురు చూడాల్సిందే. చదువు కున్న వారు అయినా లేని వారు అయినా అపర కుబేరులు అయినా కడు బీద అయినా అందరికీ ఒక్కటే ఓటూ. అదే భారతీయ ప్రజాస్వామ్యం గొప్పదనం.
ఆ ఓటు అనే ఆయుధంతో నేతల జాతకాలను మార్చేసే శక్తి అతి సామాన్యుడికి ఉంది. ఓటుతో అధినేత నుదుటి తలరాతను సైతం కొత్తగా రాసే అధికారం ఓటరు చేతిలో చేతలో ఉంది. ఓటరు ప్రభువు ఎవరిని కరుణిస్తే వారే రేపటి మారాజు అవుతాడు. వారే ఓటరు ప్రభువు తరఫున కొత్త ప్రతినిధిగా జనం ముందుకు వస్తారు.
భారతీయ ప్రజాస్వామ్యం గొప్పదనం ఏమిటి అంటే ఎంతో బలంగా ఉన్నాం అనుకున్న వారు కూడా ఓటమి పాలు అయ్యారు. తమకు తిరుగులేదు అనుకున్న వారిని సైతం ఇంటికి పంపించేసే శక్తి ఓటర్లకు పుష్కలంగా ఉంది. చదువు సంగతి పక్కన పెడితే భారతీయ ఓటరు ఆలోచన వివేచన ముందు ఎవరూ పనికి రారు అన్నది అక్షర సత్యం.
వారు ఎపుడూ తప్పు చేయరు. ఓటు వేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి మాత్రమే వేస్తారు. అది తమకు రానున్న అయిదేళ్ల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకునే వేస్తారు. తాయిలాలు ఇచ్చారనో లేక తమకు సన్నిహితులు దగ్గర వారు అనో ఎలాంటి వివక్ష తీర్పులో ఎక్కడా చూపించరు.
అందుకే ఎప్పటికపుడు విలక్షమైన సలక్షణమైన తీర్పులు వెలువడుతూ ఉంటాయి. ఇదిలా ఉంటే విభజన ఏపీలో రెండు ఎన్నికలను చూసిన ఏపీ ఓటర్లు ముచ్చటగా మూడవ ఎన్నిక చూస్తున్నారు. మూడవసారి తీర్పు ఇచ్చేందుకు వారు సంసిద్ధమవుతున్నారు. ఏపీలో ఈసారి ఎవరికి గద్దెను అప్పగించాలి అన్నది వారు ఎన్నో ఆలోచించి నిర్ణయం తీసుకోబోతున్నారు.
పోలింగ్ కి గంటల వ్యవధి వచ్చేసింది. ఆదివారం ఆగితే చాలు. ఏపీలో పోలింగ్ స్టార్ట్ అయిపోతుంది. సోమవారం ఉదయం ఏడు నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. సాయంత్రం ఆరు వరకూ సాగుతుంది. అంటే ఏకంగా 11 గంటల సుదీర్ఘ సమయం అన్న మాట. అంతటితో కాదు. ఆరు గంటలకు పోలింగ్ బూత్ కి వచ్చినా కూడా క్యూలో ఉన్న వారిని అందరినీ ఓటు వేయిస్తారు. అలా రాత్రి ఎంత వేళ అయినా చివరి ఓటరు ఓటు వేసేవరకూ పోలింగ్ సాగుతుంది.
మొత్తం మీద చూస్తే ఏపీలో ఓటర్లకు ఇపుడు అగ్ని పరీక్ష ఉంది. ఒకటి అధికారంలో ఉన్న పార్టీ. రెండవది అధికారంలోకి వస్తామమి అంటున్న పార్టీ ఈ రెండు పార్టీలను ఏపీ ప్రజలు చూసారు. రెండు ప్రభుత్వాలను చూశారు. ఇపుడు వారికి ఈ రెండు ప్రభుత్వాలలో దేనిని మళ్ళీ కొనసాగించాలన్నదే ముందున్న ప్రశ్న. దానికి ధీటైన జవాబు ఓటు రూపంలో జనాలు ఇవ్వబోతున్నారు
ఏపీలో ఎంపీతో పాటు ఎమ్మెల్యే సీట్లకూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎంతో చైతన్యవంతమైన రాష్ట్రంగా ఏపీకి పేరు ఉంది. రాజకీయంగా ఓటర్లు ఎంతో అవగాహన ఉన్న వారు కావడం విశేషం. ఏపీలో ఏ రకమైన తీర్పు ఇస్తారు అన్నది దేశమంతా చూస్తోంది. మొత్తం మీద చూస్తే కనుక ఏపీలో ఓటర్ల చేతిలో బంది ఉంది. అన్ని రాజకీయ పార్టీలు తమ విన్నపాలను ముందుంచాయి.
ప్రతీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్ధులు తమ అర్జీలను ఓటర్ల ముందు ఉంచారు. ఒక పెద్ద మాస్టారుగా పార్టీలకు అభ్యర్ధులకు మార్కులు వేయాలి. ఎవరు సమర్ధులో ఎవరికి అందలం అందించాలో కూడా ఓటర్లు ఇపుడు తీర్పు చెప్పాలి. మొత్తానికి అందరి చూపూ ఏపీ ఓటర్ల మీద ఉంది. చూడాలి మరి ఏ విలక్షణ తీర్పు వస్తుందో.