హుషారు తెప్పించే సర్వే.. కొలువులకు కంపెనీలు రెఢీ

సుమారు 3150 కంపెనీల ప్రతినిధుల నుంచి సేకరించిన వివరాలతో తాము రిపోర్టును సిద్ధం చేసినట్లుగా మ్యాన్ పవర్ సంస్థ వెల్లడించింది.

Update: 2024-03-13 03:52 GMT

అంగ్ల సంవత్సరం జనవరి 1న మొదలై డిసెంబరు 31న ముగియటం తెలిసిందే. అదే ఆర్థిక సంవత్సరానికి వస్తే మార్చి 31తో పూర్తై.. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం షురూ కావటం తెలిసిందే. అగ్రరాజ్యంతో పాటు పలు దేశాల్లో నెలకొన్న ఆర్థిక పరిస్థితుల కారణంగా కొలువుల ప్రకటనలకు సంబంధించి వాతావరణం నిరాశాజనకంగా ఉండటం తెలిసిందే. అయితే.. ఈ ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో కంపెనీలు పెద్ద ఎత్తున కొలువుల ప్రకటనలకు ముందుకు రానున్న విషయాన్ని తాజాగా విడుదలైన ఒక రిపోర్టు స్పష్టం చేస్తోంది. కొలువులపై నిరాశాపూరిత వాతావరణానికి చెక్ పెట్టి.. కొత్త ఉత్సాహానికి తెర తీసేలా ఉన్న ఈ రిపోర్టు ఆసక్తికరంగా మారింది.

మ్యాన్ పవర్ సంస్థ తాజా రిపోర్టు ప్రకారం ఏప్రిల్ - జూన్ మధ్యలో భారతీయ కంపెనీలు కొలువులకు నోటిఫికేషన్లు విడుదల చేయటం ఖాయమని పేర్కొన్నారు. ఈ అంశంపై కంపెనీలు సానుకూలంగా ఉన్నట్లుగా వెల్లడించింది. రాబోయే మూడునెలల్లో మరింత సిబ్బందిని నియమించుకోవటానికి 36 శాతం దేశీయ కంపెనీలు సిద్ధంగా ఉన్నట్లుగా సదరు రిపోర్టు వెల్లడించింది.

సుమారు 3150 కంపెనీల ప్రతినిధుల నుంచి సేకరించిన వివరాలతో తాము రిపోర్టును సిద్ధం చేసినట్లుగా మ్యాన్ పవర్ సంస్థ వెల్లడించింది. కొలువులకు భారత్ లోనే అత్యంత సానుకూల వైఖరి వెల్లడైనట్లుగా రిపోర్టు పేర్కొంది. 80 శాతం మందికి నైపుణ్యాల కొరత ఉన్నందున.. నియామకాల ప్రణాళికను ముందుకు తీసుకెళ్లటంలో కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయని.. అయినప్పటికీ 36 శాతం కంపెనీలు నియామకాలపై సానుకూలతతో ఉన్నట్లుగా పేర్కొన్నారు.

కొత్త కొలువుల విషయంలో భారతదేశం ప్రపంచంలోనే ముందు ఉందన్న విషయాన్ని ప్రస్తావించటం గమనార్హం. అంతేకాదు.. కొత్త ఆర్థిక సంవత్సరంలో వేతనాల పెంపునకు 50 శాతం యాజమాన్యాలు అంచనాల్ని సిద్ధం చేసుకుంటున్నాయి.. వేతనాలు తగ్గొచ్చని 14 శాతం కంపెనీలు వెల్లడించగా.. 33 శాతం కంపెనీలు మాత్రం ఎలాంటి మార్పులు ఉండవన్న విషయాన్ని తమకు చెప్పినట్లుగా వెల్లడించారు. దీంతో.. మొత్తం కంపెనీల్లో 36 శాతం కంపెనీలు వేతనాల పెంపు ఉండటం ఖాయమని చెప్పినట్లైంది. గత ఏప్రిల్ - జూన్ తో పోలిస్తే ఈ ఏడాది అదే సమయంలో నియామకాల్ని పెంచుకోవాలని భావిస్తున్న కంపెనీలు సంఖ్య 6 శాతం పెరిగింది.

ఏప్రిల్ - జూన్ కాలంలో కొత్త కొలువుల విషయంలో సానుకూలతతో ఉన్న దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉండగా.. పెద్దన్న అమెరికా సైతం ఆ తర్వాతి స్థానంలో ఉంది. చైనా మూడో స్థానంలో నిలిచింది.అంతర్జాతీయంగా కొత్త కొలువుల సరాసరి 22 శాతం ఉండగా భారత్ 36 శాతం.. అమెరికా 34 శాతం.. చైనా 32 శాతం ఉన్నట్లుగా రిపోర్టు పేర్కొంది. నియామకాల విషయంలో రొమేనియా జాబితాలో చివరి స్థానంలో నిలిచింది. ఇక.. జపాన్.. తైవాన్ కంపెనీలు మాత్రం అత్యంత జాగ్రత్తతో నిర్ణయాలు తీసుకునే వీలుందని రిపోర్టు వెల్లడించింది.

ఇక.. నియామకాలు ఏయే రంగాల్లో ఎక్కువగా ఉంటాయన్న విషయానికి వస్తే.. హెల్త్.. లైఫ్ సైనైస్ లో అత్యధిక నియామకాలు ఉండొచ్చని.. ఆ విభాగంలో నికరంగా 44 శాతం కంపెనీలు నియామకాల్ని పెంచుకునే యోచనలో ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఆ తర్వాతి స్థానంలో కమ్యూనికేషన్ల రంగం.. ఐటీ రంగాలు నిలిచాయి. విద్యుత్.. యులిటిలీ విభాగం చివరి స్థానంలో ఉంది. ఇక.. నియామకాలు భారత్ లో ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయన్న విషయానికి వస్తే.. నార్త్ కు చెందిన అత్యధిక కంపెనీలు మొగ్గు చూపుతుండగా.. తర్వాతి వెస్ట్ ప్రాంతంలోని కంపెనీలు రెండో స్థానంలో సౌత్ కు చెందిన కంపెనీలు మూడో స్థానంలో నిలిచాయి. ఈస్ట్ ప్రాంతానికి చెందిన కంపెనీలు చివరి స్థానంలో నిలిచాయి.

Tags:    

Similar News