నెహ్రూ పటేల్ మధ్యలో బీజేపీ ... కాంగ్రెస్ సరైన కౌంటర్ !
ఈ దేశంలో అతి పురాతనమైన పార్టీగా కాంగ్రెస్ ఉంది. అదే ఆ పార్టీ నేతలు గర్వంగా చెప్పుకుంటారు.;

అదేంటి నెహ్రూ పాలించిన కాలం వేరు. ఇక వల్లభాయ్ పటేల్ స్వాతంత్రం వచ్చిన తరువాత అతి కొద్ది కాలం కేంద్ర మంత్రిగా పనిచేసి తనువు చాలించారు. అపుడు బీజేపీ ఎక్కడ ఉంది అన్న ప్రశ్నలు తలెత్తవచ్చు. కానీ ఈ మూడింటినీ కలిపింది మాత్రం కాంగ్రెస్.
ఈ దేశంలో అతి పురాతనమైన పార్టీగా కాంగ్రెస్ ఉంది. అదే ఆ పార్టీ నేతలు గర్వంగా చెప్పుకుంటారు. ఇక గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఏఐసీసీ కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలలో మాట్లాడిన కాంగ్రెస్ అఖిల భారత అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బీజేపీ మీద నిప్పులు చెరిగారు.
బీజేపీకి ఏమి తెలుసు అని మాట్లాడారు, చరిత్ర అంటే మాది అని కూడా అన్నారు. 140 ఏళ్ళ వయసు కలిగిన కాంగ్రెస్ ని దెబ్బ తీయాలని బీజేపీ చూస్తోందని దాని కోసం అభూత కల్పనలు ప్రచారం చేస్తోందని ఖర్గే హాట్ కామెంట్స్ చేశారు. ఈ దేశం స్వాతంత్ర్యం కోసం పాలుపంచుకున్నది పాటు పడింది కాంగ్రెస్ అయితే బీజేపీకి ఆ చరిత్ర ఎక్కడిది అని ఖర్గే ప్రశ్నించారు.
నెహ్రూ తొలి ప్రధాని పటేల్ తొలి హోం మంత్రి ఈ ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉండేవారని, వారి సాన్నిహిత్యం గొప్పదని ఖర్గే అన్నారు. ఎన్నో సార్లు పటేల్ ఇంటికి స్వయంగా నెహ్రూ వెళ్ళి కలిసేవారని వారి మధ్య అనుబంధం తప్ప ఆధిపత్యం లేనే లేదని ఆయన చెప్పారు. పైగా ఇద్దరూ ఒకే భావజాలంతో పనిచేశారని అన్నారు
పటేల్ నుంచి నెహ్రూ ఎన్నో సలహాలు సూచనలు తీసుకునేవారు అని గుర్తు చేశారు. ఏకంగా సీడబ్లూసీ సమావేశాలు పటేల్ ఇంట్లో నిర్వహించి పార్టీలో ఆయన స్థానం ఏమిటో నెహ్రూ చాటిచెప్పారని అన్నారు. అటువంటి ఈ ఇద్దరి మధ్య విభేదాలు సృష్టిస్తారా అని మండిపడ్డారు.
అలాగే ఈ ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని బీజేపీ ప్రచారం చేయడం దారుణమని ఖర్గే ఫైర్ అయ్యారు. ఆఖరికి జాతీయ నాయకుల మీద బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తున్నాయని ఆయన నిందించారు. పటేల్ భావజాలం వేరు అని ఆర్ఎస్ఎస్ భావజాలం వేరు అని ఆయన అన్నారు అయినా ఆయన వారసులమని ఎలా చెప్పుకుంటారని నిలదీశారు.
ఈ దేశం కోసం పనిచేయని వారు కాంగ్రెస్ ని లేకుండా చేద్దామని అనుకుంటున్నారని ఖర్గే విమర్శించారు. నెహ్రూ పటేల్ మీద బీజేపీ ఆర్ఎస్ఎస్ దుష్ప్రచారం చేస్తున్నాయని ఖర్గే అన్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్ళకు సరైన కౌంటర్ వేసింది అని అంటున్నారు.
ఇంతకాలం ఈ తరహా ప్రచారం సాగుతున్నా కాంగ్రెస్ కనీసంగా ఖండించకపోవడం వల్లనే ఇలా జరుగుతోందని అనే కాంగ్రెస్ వాదులూ ఉన్నారు మేధావులూ ఉన్నారు. అయినా చరిత్రలో ఎన్నో ఉంటాయి. వాటిని తవ్వి తీయడం ఎవరికైనా తగని పని. ఈ రోజున ప్రజలకు ఏమి చేశామన్నది చెప్పుకోవాలి. ఆ విధంగా బీజేపీ చేయడం లేదని కాంగ్రెస్ అంటోంది.
అంతే కాదు చాలా కాలానికి కాంగ్రెస్ తన మూల సిద్ధాంతం బలాన్ని గుర్తు చేసుకుని మరీ బీజేపీ మీద ఆర్ఎస్ఎస్ మీద పదునైన విమర్శలు చేస్తోంది. మరి అది గుజరాతి గడ్డ ఇచ్చిన స్థాన బలమేమో అని అంటున్నారు. గాంధీ పటేల్ పుట్టిన గడ్డ మీద ఏఐసీసీ మీటింగ్స్ పెట్టిన కాంగ్రెస్ అదే గడ్డ మీద నుంచి ఢిల్లీ స్థాయికి ఎదిగి దేశాన్ని ఏలుతున్న మోడీని నిలువరించడానికి కొత్త శక్తిని కూడగట్టుకోవాలని చూస్తోంది. మరి కాంగ్రెస్ రెండు రోజుల మీటింగ్స్ సారాంశం తీర్మానాలు ఏమిటో చూస్తేనే ఆ పార్టీ యాక్షన్ ప్లాన్ తెలుస్తుంది.