తెరపైకి రాహుల్ బ్రిటన్ పౌరసత్వం...కేంద్రం ఏం చేయనుంది ?
ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ భారత పౌరసత్వం రద్దు చేయాలని బీజేపీ నేత ఒకరు దాఖలు చేసిన పిటిషన్ మీద అలహాబాద్ హైకోర్టు కేంద్రం స్పందన కోరింది.
దేశంలో కాంగ్రెస్ వంటి పురాతన పార్టీకి వారసుడిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన రాహుల్ గాంధీ 2024 సార్వత్రిక ఎన్నికల తరువాత లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయ్యారు. కేబినెట్ హోదాతో ఆయన ఇపుడు ఉన్నారు. మోడీకి ఎదురుగా ఆయన లోక్ సభలో ఆసీనులు అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన తనదైన తీరులో అనేక ప్రశ్నలతో ఇబ్బంది పెడుతున్నారు.
ఒక విధంగా పార్లమెంట్ లో రాహుల్ గాంధీ అధికార పక్షం మీద శరసంధానం చేస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో బంపర్ విక్టరీని కొట్టిన తరువాత రెట్టించిన ఉత్సాహంలో బీజేపీ పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు హాజరవుతోంది.
అయితే ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా ఇండియా కూటమి అధికార ఎన్డీయేని ప్రజా సమస్యల మీద నిలదీయాలని చూస్తోంది. రాజీలేని పోరాటమే అన్నట్లుగా చెబుతోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ భారత పౌరసత్వం రద్దు చేయాలని బీజేపీ నేత ఒకరు దాఖలు చేసిన పిటిషన్ మీద అలహాబాద్ హైకోర్టు కేంద్రం స్పందన కోరింది.
దానికి కేంద్రం రాహుల్ పౌరసత్వం అంశాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించడం విశేషం. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీకి బ్రిటన్ పౌరసత్వం ఉందని అయన ఆ దేశ పౌరుడు కాబట్టి భారత పౌరసత్వం రద్దు చేయాలని బీజేపీ నేత, లాయర్ అయిన విఘ్నేష్ శిశిర్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసు విచారణ నేపథ్యంలో కోర్టు కేంద్రం స్పందనను కోరింది. దానికి కేంద్రం బదులిస్తూ బ్రిటన్ పౌరుడు రాహుల్ అని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అన్నీ పరిశీలిస్తున్నామని చెప్పడం చూస్తూంటే ఏమి జరుగుతుంది అన్న చర్చకు తెర లేస్తోంది.
మరో వైపు రాహుల్ గాంధీ పౌరసత్వం మీద సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ నేత కోర్టుకు విన్నవించారు. రాహుల్ గాంధీకి భారత్ తో పాటు యూకేలో కూడా పౌరసత్వం ఉంది అని దానికి ఆధారాలు కూడా ఉన్నాయని అంటున్నారు.
ఆ ఆధారాలను అన్నింటినీ కోర్టుకు సమర్పించామని ఆయన చెప్పారు భారత చట్టాల ప్రకారం చూస్తే ఒక దేశం పౌరుడికి మరో దేశంలో పౌరసత్వం ఉండకూడదని గుర్తు చేశారు. అలా ఉంటే కనుక భారత్ పౌరసత్వం రద్దు అవుతుందని విఘ్నేష్ శిశిర్ అంటున్నారు.
అందువల్ల సీబీఐ విచారణ జరిపించి రాహుల్ భారత్ పౌర సత్వం రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ విధంగా కేంద్రం చేస్తుందని భావిస్తున్నామని అన్నారు. ఇక ఈ కేసు తరువాత విచారణ డిసెంబర్ 19కి వాయిదా పడింది. దాంతో రాహుల్ పౌరసత్వం విషయంలో కేంద్రం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది.
గతంలో రాహుల్ ఎంపీ సభ్యత్వం రద్దు అయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత సుప్రీంకోర్టులో ఊరట తరువాత తిరిగి పునరుద్ధరించారు. మరి ఇపుడు పౌరసత్వం రద్దు చేస్తారా అలా చేయగలరా చేస్తే పరిణామాలు రాజకీయంగా ఎలా ఉంటాయి అన్నది కూడా చర్చగా సాగుతోంది.