ఎమ్మెల్సీ పదవి కోసం రెడ్డి నేతల కుస్తీ
పార్టీ కేటాయిస్తామన్న ఏకైక సీటు కోసం ఏకంగా అరడజను మంది నేతలు పోటీపడుతున్నారు. దీంతో గాంధీభవన్ పాలిటిక్స్ ఆసక్తి రేపుతున్నాయి.
తెలంగాణ కాంగ్రెసులో శాసనమండలి సభ్యత్వం రేసు మొదలైంది. త్వరలో నాలుగు ఎమ్మెల్సీలకు ఎన్నిక జరగనుంది. ఇందులో సామాజికవర్గాల వారీగా నేతలకు పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. మొత్తం నాలుగు ఖాళీలు అయితే ఇందులో రెండు బీసీలకు ఒకటి ఎస్సీలకి మరొకటి రెడ్డి సామాజికవర్గం నేతకు ఇవ్వాలని హైకమాండ్ ఆలోచిస్తోంది. అయితే ఈ పదవుల కోసం రెడ్డి సామాజికవర్గంలోనే ఎక్కువ పోటీ కనిపిస్తోంది. పార్టీ కేటాయిస్తామన్న ఏకైక సీటు కోసం ఏకంగా అరడజను మంది నేతలు పోటీపడుతున్నారు. దీంతో గాంధీభవన్ పాలిటిక్స్ ఆసక్తి రేపుతున్నాయి.
పార్టీ కోసం కష్టపడ్డాం, పోటీ చేసే ఉద్దేశం ఉన్నా, అధిష్ఠానం సూచనలతో సీటును త్యాగం చేశాం. పవర్‌లోకి వచ్చాక ఏడాది నుంచి వెయిట్ చేశాం. ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి తమను మండలికి పంపాలని నేతలు పైరవీలు చేస్తుండటంతో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట. అందరూ పెద్ద నేతలు కావడంతో ఎవరికి ఏం చెప్పాలో తేల్చుకోలేక సీఎం రేవంత్ రెడ్డి, అగ్ర నేత రాహుల్ పైనే భారం వేస్తున్నారని అంటున్నారు.
త్వరలో తెలంగాణలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు రాబోతున్నాయి. సంఖ్యాపరంగా ఇందులో నాలుగు స్థానాలను కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉంది. దీంతో గత ఎన్నికల్లో ఓడిన వారు, సీటు దక్కక పక్కకు తప్పుకున్న వారు ఎమ్మెల్సీ పదవుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఆరుగురు నేతలు ఎమ్మెల్సీ గిరీ కోసం పెద్ద ఎత్తున లాబీయింగ్ చేయడం చర్చకు దారితీస్తోంది.
సీనియర్ నేత జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ కోసం పట్టుబడుతున్నారట. ప్రస్తుతం గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి పదవీ కాలం మార్చితో ముగియనుంది. ఈసారి గ్రాడ్యుయేట్ స్ధానం నుంచి పోటీ చేయబోనని ఇప్పటికే స్పష్టం చేసిన ఆయన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారని సమాచారం. జగిత్యాలలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ను కాంగ్రెస్‌లోకి తీసుకోవడంపై ఆయన తీవ్ర అభ్యంతరం చేస్తున్నారు. తన అసంతృప్తిని పార్టీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో తనకు గౌరవం ఇవ్వాలనుకుంటే ఎమ్మెల్సీని చేయాలని జీవన్‌రెడ్డి మెలికపెడుతున్నారు.
ఇక మరో సీనియర్ నేత జగ్గారెడ్డి కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. పైకి బయట పడకపోయినా పార్టీ ముందు తన ప్రతిపాదనను ఉంచారని తెలుస్తోంది. అగ్రనేత రాహుల్ గాంధీకి సన్నిహితంగా ఉండే జగ్గారెడ్డి విషయంలో సీఎం రేవంత్ కూడా పాజిటివ్‌గానే ఉన్నారనే టాక్ వినిస్తోంది. మరోవైపు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కూడా తన పేరును పరిశీలించాలని కోరుతున్నారు. అదేవిధంగా యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి కూడా ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. ఆయనకు నామినేటెడ్ పదవి ఇవ్వడంతో ఎమ్మెల్సీ అవకాశం లేనట్లేనని గాంధీభవన్ సమాచారం. కానీ, శివసేనారెడ్డి మాత్రం తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు.
మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన పారిజాత నర్సింహారెడ్డి కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మహిళా కోటాతో తన పేరు పరిశీలించాలని ఆమె అభ్యర్థిస్తున్నారు. పారిజాత నర్సింహారెడ్డి రంగారెడ్డి జిల్లాకు చెందిన కీలక నాయకురాలు, ఆర్థికంగా బలంగా ఉండటంతో పార్టీ భవిష్యత్ అవసరాలకు ఆమె ఉపయోగపడుతుందని చర్చ జరుగుతోంది. అయితే బీసీ, ఎస్సీ వర్గాల్లో మహిళలకు అవకాశమిస్తే పారిజాతకు చాన్స్ లభించకపోవచ్చనంటున్నారు. అదేవిధంగా మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత దేప భాస్కర్ రెడ్డి కూడా దరఖాస్తు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే టికెట్ దక్కని మరో నేత మేడ్చల్- మల్కాజ్‌గిరి జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి కూడా ఎమ్మెల్సీ పదవి అడుగుతున్నారు. తనకు ఎమ్మెల్యే టికెట్ దక్కనప్పుడు తర్వాత వచ్చే అవకాశాల్లో మొదటి ప్రాధాన్యం ఉంటుందని ఇచ్చిన హామీని ఆయన ప్రస్తావిస్తున్నారట. ఇలా ఒకే సీటు కోసం ఆరుగురు పోటీపడటంపై విస్తృత చర్చ జరుగుతోంది. వీరిలో ఎవరికి అవకాశం వస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది.