సైకిల్ గుర్తుపై కాంగ్రెస్ అభ్యర్థులు... ఇండియా కూటమి ఇంట్రస్టింగ్ స్టెప్!

ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్ లోనూ ఉప ఎన్నిక జరగనుంది ఈ సమయంలో ఇండియా కూటమి ఆసక్తికర నిర్ణయం తీసుకుంది.

Update: 2024-10-24 10:36 GMT

సార్వత్రిక ఎన్నికల అనంతరం హర్యానా, జమ్మూకశ్మీర్ ఎన్నికలు పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు ఉప ఎన్నికల సీజన్ మొదలైంది. ఇందులో భాగంగా కేరళ లోని వయనాడ్ లోక్ సభ స్థానానికి నవంబర్ 13న ఉప ఎన్నిక జరగనుంది. ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్ లోనూ ఉప ఎన్నిక జరగనుంది. ఈ సమయంలో ఇండియా కూటమి ఆసక్తికర నిర్ణయం తీసుకుంది.

అవును... దేశంలో ఇప్పుడు ఉప ఎన్నికల సీజన్ స్టార్ట్ అయ్యింది. ఇందులో భాగంగా... ఉత్తర ప్రదేశ్ లో తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక నవంబర్ 13న జరగనుంది. ఈ సమయంలో ఇండియా కూటమి అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా సమాజ్ వాదీ పార్టీ "సైకిల్" గుర్తు మీద పోటీ చేయనున్నారు. ఈ మేరకు రాహుల్ గాంధీతో చర్చించిన పిమ్మట అఖిలేష్ యాదవ్ వెల్లడించారు.

ఈ క్రమంలో... 9 అసెంబ్లీ స్థానాల్లోనూ 7 నియోజకవర్గాల్లో సమాజ్ వాదీ పార్టీ, 2 చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సైకిల్ గుర్తుపైనే పోటీ చేయనున్నారు. ఈ సందర్భంగా స్పందించిన అఖిలేష్ యాదవ్... మేము రాజ్యాంగాన్ని, రిజర్వేషన్, సామరస్యాన్ని కాపాడాలని నిర్ణయించుకున్నాము.. బాపూ - బాబా సాహెబ్ - లోహియా కలల దేశాన్ని నిర్మించాలి" అని ఎక్స్ లోని పోస్ట్ లో పేర్కొన్నారు.

ఇదే సమయంలో ఇండియా కూటమి అభ్యర్థులంతా సైకిల్ గుర్తుపైనే పోటీ చేస్తారనే విషయంపై స్పందిస్తూ... సీట్ల పంపకాల కంటే గెలుపే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లాడించారు. ఈ ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి విజయంతో కొత్త అధ్యాయాన్ని లిఖించనుందని అన్నారు. ఇదే సమయంలో.. గుర్తును ఎన్నుకోవడం కంటే, బీజేపీని ఓడించడమే కూటమి లక్ష్యమని కాంగ్రెస్ నేత సురేంద్ర రాజ్ పుత్ తెలిపారు.

ఇక.. యూపీ ఉప ఎన్నికలకు మంగళవారం 15 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో.. బుధవారం వరకూ మొత్తం దాఖలైన నామినేషన్ల సంఖ్య 34కి చేరింది. అక్టోబర్ 25 - శుక్రవారం వరకూ ఈ 9 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. నవంబర్ 13న పోలింగ్ కాగా.. 23న కౌంటింగ్ జరగనుంది!

Tags:    

Similar News