ఖర్గేకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన లేఖ.. అధిష్టానం ఏం చేయబోతోంది..?

రెండు మూడు రోజులుగా తెలంగాణలోని కాంగ్రెస్‌లో ఫిరాయింపుల అంశం హాట్ టాపిక్ అయింది.

Update: 2024-10-24 09:20 GMT

రెండు మూడు రోజులుగా తెలంగాణలోని కాంగ్రెస్‌లో ఫిరాయింపుల అంశం హాట్ టాపిక్ అయింది. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో కొంత మంది ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే.. వారంతా అధికారికంగా చేరకపోయినప్పటికీ కాంగ్రెస్‌తోనే ఉండిపోయారు. దాంతో అప్పటి నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్య ఫిరాయింపుల వ్యవహారం రగులుతూనే ఉంది.

ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోరాడుతూనే ఉన్నారు. స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే హైకోర్టు వరకూ వెళ్లారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. అయితే.. ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీ గూటికి చేరిన ఎమ్మెల్యేల, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య పెద్ద వివాదమే జరిగింది.

తాజాగా..ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ సొంత పార్టీ ఎమ్మెల్సీ, సీనియర్ నేత నుంచే డిమాండ్ రావడంతో కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ విషయంలో ఆ నేత అస్సలు వెనక్కి తగ్గడం లేదు.

రెండు రోజుల క్రితం జగిత్యాల జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్యఅనుచరుడు హత్యకు గురయ్యాడు. అయితే.. పార్టీ ఫిరాయింపుదారుల వల్లే తన అనుచరుడు చనిపోయాడని జీవన్ రెడ్డి ఆరోపించారు. వారి ప్రోత్సాహం వల్లే ఓ కార్యకర్తను కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా రహదారిపై అనుచరులతో కలిసి రాస్తారోకో చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ అక్కడికి చేరుకోగా.. జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ.. ఆయన మాత్రం మీకో దండం.. మీ పార్టీకో దండం అని చెప్పి నిరసన కొనసాగించారు. తాను ఇక పార్టీలో కొనసాగలేనంటూ చెప్పుకొచ్చారు.

అయితే.. ఇదే అంశంపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా స్పందించారు. చాలా చోట్ల కొత్త, పాత వివాదం నడుస్తున్నట్లుగా స్వయంగా చెప్పారు. అయితే.. పార్టీ నిర్ణయం మేరకే వారిని చేర్చుకున్నామని క్లారిటీ ఇచ్చారు. అధిష్టానం సూచనల మేరకే వారు పార్టీలోకి వచ్చారని తెలిపారు. జీవన్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అంటూ కామెంట్స్ చేశారు.

ఈ పరిణామాల మధ్య ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తాజాగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. తన భవిష్యత్ కార్యాచరణపై పార్టీనే మార్గదర్శనం చేయాలని కోరారు. పదేళ్ల తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ పార్టీలాగే వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. అదే స్థాయిలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నానని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ లేఖతో దేశ, రాష్ట్ర నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోందన్న ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News