ఇండియా కూటమి నాయకత్వం కాంగ్రెస్ వదులుకుంటుందా ?

ఇండియా కూటమి రెండేళ్ళ క్రితం ఏర్పాటు అయింది. దేశంలోని బలమైన ప్రాంతీయ పార్టీలతో పాటు కమ్యూనిస్టులు కలసి ఉన్న ఈ కూటమికి కాంగ్రెస్ నాయకత్వం వహిస్తోంది

Update: 2024-12-24 03:53 GMT

ఇండియా కూటమి రెండేళ్ళ క్రితం ఏర్పాటు అయింది. దేశంలోని బలమైన ప్రాంతీయ పార్టీలతో పాటు కమ్యూనిస్టులు కలసి ఉన్న ఈ కూటమికి కాంగ్రెస్ నాయకత్వం వహిస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ శతాధిక వృద్ధ పార్టీ. ఈ రోజుకీ బలమైన జాతీయ పార్టీ కాబట్టి సహజంగానే లీడ్ చేసే చాన్స్ కాంగ్రెస్ కే దక్కుతోంది.

అయితే ఇటీవల వరసగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలు కావడం, దాని కంటే ముందు గెలుస్తామని అనుకున్న చోట లోక్ సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు దక్కకపోవడంతో ఇండియా కూటమిలోని ప్రధానమైన పార్టీలు కాంగ్రెస్ తీరుని తప్పు పడుతున్నాయి. హర్యానా మహారాష్ట్రలో బీజేపీ విజయాల వెనక కాంగ్రెస్ వ్యూహాల వైఫల్యం ఉందని కూడా ఆరోపిస్తున్నాయి.

మరీ ముఖ్యంగా కేంద్రంలోని మోడీ అమిత్ షాల వ్యూహాలకు ధీటైన వ్యూహాలను ఇండియా కూటమి రచించలేకపోవడానికి కూడా కాంగ్రెస్ నాయకత్వ తీరు కారణం అంటున్నాయి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అయితే ఇండియా కూటమికి తాను నాయకత్వం వహించేందుకు ఉత్సాహపడుతున్నారు.

ఆమెకు శరద్ పవార్ తో పాటు లాలూ ప్రసాద్ యాదవ్, అఖిలేష్ యాదవ్ లాంటి వారు మద్దతు ఇస్తున్నారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పెద్దల మీద ఒత్తిడి పెరుగుతోంది. ఇవన్నీ ఇలా ఉంటే లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మీదనే సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇండియా కూటమికి నాయకత్వం వహించే బాధ్యతల నుంచి కాంగ్రెస్ తప్పుకోవాలని ఆయన కోరడం విశేషం. అందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉండాలని కూడా ఆయన సూచించారు. ఇండియా కూటమికి వేరే పార్టీలు నాయకత్వం వహించడమే మంచి నిర్ణయం అన్నారు. సమర్ధులైన పార్టీ నాయకులు మిత్ర పక్షాలు ఇండియా కూటమిలో ఉన్నాయని కూడా ఆయన చెప్పుకొచ్చారు.

మరో వైపు చూస్తే కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీకి ఏ పదవీ బాధ్యతలు లేకపోయినా ప్రజలలో ఎంతో ఇమేజ్ ఉందని అది ఆయనకు ఎపుడూ గౌరవాన్ని ఇస్తూనే ఉంటుందని అన్నారు. ఇక ఇండియా కూటమికి మమతా బెనర్జీ అయినా వేరు ఎవరు అయినా నాయకత్వం వహించే సత్తా కలిగి ఉన్న వారేనని మణిశంకర్ అయ్యర్ చెప్పడం విశేషం.

ఇండియా కూటమికి ఎవరు సారధ్యం వహించారు అన్నది ఇక్కడ ప్రశ్న కానే కాదని ఆయన అన్నారు. అదే టైం లో ఇండియా కూటమిలో కాంగ్రెస్ ప్రధాన పాత్ర ఎపుడూ పదిలంగానే ఉంటుందని ఆ విషయంలో ఏ రకమైన సందేహాలు లేవని కూడా క్లారిటీ ఇస్తున్నారు.

మణి శంకర్ అయ్యర్ ఎపుడూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. మరి ఆయన ఈసారి చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ అగ్ర నాయకత్వానికి రుచిస్తాయా ఇండియా కూటమి నుంచి తప్పుకునేందుకు కాంగ్రెస్ పెద్దలు సిద్ధంగా ఉన్నారా లేరా అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ఇన్నాళ్ళూ బయట పార్టీలే ఈ డిమాండ్ చేశాయి. ఇపుడు సొంత పార్టీ నాయకుడే సలహాల రూపంలో ఒక డిమాండ్ గా చెబుతున్నారు. కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఇండియా కూటమి బాధ్యతలు మమతా బెనర్జీకి అప్పగించే విషయంలో ఏమి ఆలోచిస్తుందో చూడాల్సిందే.

Tags:    

Similar News