మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు.. పీసీసీ చీఫ్ కీలక అప్‌డేట్!

తెలంగాణలో ఖాళీగా ఉన్న మంత్రి పదవులు భర్తీ ప్రక్రియకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మంత్రివర్గ విస్తరణపై పెద్ద ఎత్తున ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

Update: 2025-01-11 12:25 GMT

తెలంగాణలో ఖాళీగా ఉన్న మంత్రి పదవులు భర్తీ ప్రక్రియకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మంత్రివర్గ విస్తరణపై పెద్ద ఎత్తున ఊహాగానాలు చెలరేగుతున్నాయి. మంత్రివర్గ విస్తరణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి అనేకసార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లి హైకమాండ్‌ను కలిశారు.

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి మంత్రివర్గ విస్తరణపై పెద్ద ఎత్తున వార్తలు వస్తుంటాయి. అయితే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తాజాగా కీలక ప్రకటన చేశారు. మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. సంక్రాంతి పండుగ తర్వాత రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. బలమైన నాయకుడు ఉన్న నియోజకవర్గాల్లో చేరికలను ప్రోత్సహించబోమని ఆయన స్పష్టం చేశారు.

మంత్రివర్గ విస్తరణకు సంబంధించి స్పష్టమైన సమాచారం ఉందని పేర్కొన్న మహేష్ కుమార్ గౌడ్.. పండగ వెళ్లిన వెంటనే కొత్త మంత్రుల చేరిక ఉంటుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మారుస్తున్నారన్న వార్తలపై తనకు సమాచారం లేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నచోట్ల మాత్రం బలమైన నాయకులను పార్టీలో చేర్చుకుంటామని, అందుకు అనుగుణంగా చేరుకలను ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షలకు మద్దతు ఇస్తానని ఆయన ప్రకటించారు.

సంక్రాంతి పండుగ తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పిసిసి అధ్యక్షుడు ప్రకటించడంతో ఆశావాహుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. మంత్రివర్గ విస్తరణ జరిగితే అవకాశం దక్కుతుందని భావిస్తున్న నేతల సంఖ్య ఎక్కువగానే ఉంది. సుమారు 12 మంది వరకు నేతలు మంత్రివర్గ విస్తరణపై ఆశలు పెట్టుకుని ఉన్నారు. వీరంతా ఇప్పటికే తమ స్థాయిల్లో తీవ్ర ప్రయత్నాలను సాగిస్తున్నారు. తాజాగా పీసీసీ ప్రెసిడెంట్ విస్తరణకు సంబంధించిన అంశాలను బయటకు వెళ్లడంతో వారంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News