మన్మోహన్ కోసం రేవంత్ రెడ్డి బిగ్ ప్లాన్.. హైదరాబాద్లో ఏం చేయనున్నారంటే..
దీంతో తెలంగాణలో మన్మోహన్ సేవలను నిరంతరం స్మరించుకునేలా ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం.
దేశానికి పదేళ్లు ప్రధానిగా పనిచేసిన దివంగత నేత మన్మోహన్ సింగ్ స్మృతి చిహ్నంగా హైదరాబాద్లో ఆయన విగ్రహం పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సమాచారం. మాజీ ప్రధాని మన్మోహన్ కు ఘన నివాళులర్పించేందుకు ప్రత్యేకంగా సమావేశం కానున్న తెలంగాణ అసెంబ్లీ పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు.
మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగుకు ఘన నివాళి అర్పించేందుకు సోమవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశం కానుంది. పదేళ్ల పాటు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ తెలంగాణ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ముఖ్యంగా తెలంగాణ వాసుల చిరకాల కోరిక అయిన ప్రత్యేక రాష్ట్రం మన్మోహన్ హయాంలోనే ఏర్పాటైంది. దీంతో తెలంగాణలో మన్మోహన్ సేవలను నిరంతరం స్మరించుకునేలా ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. మన్మోహన్ అంతిమ సంస్కారాలకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి సోమవారం అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరిచి మన్మోహన్ కు నివాళులర్పించడంతోపాటు ఆయన చిరస్థాయిగా గుర్తుండిపోయేలా హైదరాబాదులో మన్మోహన్ స్మృతి చిహ్నం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
రాజధాని నగరంలో ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు దివంగత మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలు ఉన్నాయి. అదే విధంగా మన్మోహన్ సింగ్ విగ్రహం కూడా హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. దివంగత ప్రధాని మన్మోహన్ విగ్రహం ఏర్పాటుచేయడానికి అనుకూలమైన స్థలాన్ని ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా కొన్ని స్థలాలను పరిశీలిస్తున్నారు. సచివాలయ పరిసరాల్లో మన్మోహన్ విగ్రహం ప్రతిష్ఠిస్తే బాగుంటుందని, అదేవిధంగా ఏదైనా రోడ్డుకు ఆయన పేరు పెట్టాలని కూడా ప్రతిపాదనలు వస్తున్నాయి. అంతేకాకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు మన్మోహన్ పేరు పెట్టాలని కాంగ్రెస్ నేతలు సూచిస్తున్నారు.
రిజర్వు బ్యాంకు గవర్నరుగా దేశ ఆర్థిక మంత్రిగా విశేష సేవలు అందించిన మన్మోహన్.. ప్రతిపాదించిన ఆర్థిక సంస్కరణలు మన దేశ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అదేవిధంగా హైదరాబాదులో అంతర్జాతీయ విమానాశ్రయం, ఓఆర్ఆర్, మైట్రో రైల్ ప్రాజెక్టు వంటివి మన్మోహన్ హయాంలోనే వచ్చాయి. హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడంలో మన్మోహన్ కృషి ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఆయనను చిరకాలం గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ హైకమాండ్ సైతం మన్మోహన్ ను స్మృతించుకునేలా ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లోనే ప్రస్తుతం సంతాప దినాలు పాటిస్తున్న ప్రభుత్వం అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరచి కీలక నిర్ణయాలు తీసుకుంటుందంటున్నారు.