పాచిపోయిన హామీలతో కాంగ్రెస్...విభజన పాపాలు గుర్తుకు రావా....!?
కాంగ్రెస్ ఏపీకి చేసిన అన్యాయం ప్రపంచంలో ఏ ప్రాంతానికి ఏ ప్రభుత్వమూ చేయలేదని చెప్పాల్సి ఉంటుంది.
కాంగ్రెస్ ఏపీకి చేసిన అన్యాయం ప్రపంచంలో ఏ ప్రాంతానికి ఏ ప్రభుత్వమూ చేయలేదని చెప్పాల్సి ఉంటుంది. అరవై ఏళ్ళ సీమాంధ్రుల రెక్కల కష్టంతో హైదరాబాద్ అభివృద్ధి చెందితే దాన్ని కేవలం తన రాజకీయ లబ్ది కోసం అడ్డగోలు విభజనతో తెలంగాణాకు దారాదత్తం చేసి పారేసింది. అలా కాంగ్రెస్ సీమాంధ్రులను నడిరొడ్డున నిలబెట్టిన దుర్బర క్షణాలు 2014లో జరిగాయి. అవి ఇంకా కళ్ళ ముందే ఉన్నాయి.
బహుశా చరిత్రలో ఎవరూ కూడా మరచిపోలేరు కూడా అని అంటారు. ఇక తెలంగాణా ఇచ్చామన్న చోటనే రెండు ఎన్నికల్లో ఘోరంగా జనాలు ఓడించారు. మూడవసారి అంటూ 2023 డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కి బొటాబొటీగానే సీట్లు అప్పగించారు. అందులోనూ హైదరాబాద్ పరిసరాలలో ఎక్కడా కాంగ్రెస్ బోణీ కొట్టలేదు.
అంటే రాష్ట్రం ఇచ్చిన చోటనే కాంగ్రెస్ గెలుపు ఇంత సుందరంగా ఉంది అని అర్ధం చేసుకోవాలి. ఆ గెలుపు కోసమే పదేళ్లు నిరీక్షణ జరిగింది. ఇపుడు ఏపీ విషయానికి వస్తే విభజనతో ఏపీని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ అన్న గట్టి అభిప్రాయం ఏపీ జనాలలో ఉంది. అయిదు కోట్ల మంది ప్రజలు ఈ విషయంలో ఏకాభిప్రాయంతో కాంగ్రెస్ ని దూరంగానే పెడతారు అని అంటున్నారు.
కాంగ్రెస్ మాత్రం దీనిని సాధారణంగా తీసుకోవాలని చూస్తోంది. రెండు ఎన్నికల్లో ఓడించారు కాబట్టి ఏపీ ప్రజలకు కోపం తీరిపోయింది అని తనను తాను సర్దుబాటు చేసుకుంటూ మళ్లీ ఏపీలోకి కాంగ్రెస్ నాయకులు అడుగుపెడుతూ గంభీరమైన ప్రకటనలు చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా తాము అధికారంలోకి వస్తే ఇస్తామని అలాగే విభజన సమస్యలను పరిష్కరిస్తామని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్ చెబుతున్నారు.
ఏపీలో కాంగ్రెస్ ని ప్రజలు ఆదరిస్తారు అని ఆయన కడు నమ్మకంగా చెబుతున్నారు. అంతే కాదు కాంగ్రెస్ లో వలసలు పెద్ద ఎత్తున వస్తాయని, మంచి నాయకులు అంతా తమ వైపు చేరుతారు అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే ఆయన వైసీపీని బీజేపీకి బీ టీం అని విమర్శించారు. మోడీ ప్రధానిగా ఉన్నంతవరకూ ఏపీకి ప్రత్యేక హోదా రాదు అని ఆయన అంటున్నారు.
కేంద్రంలో ఇండియా కూటమి వస్తుందని భరోసా ఇస్తున్నారు. కాసేపు మాణిక్కం ఠాగూర్ మాటలే నిజం అనుకున్నా కూడా ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదాను తానే స్వయంగా ఎలా ప్రకటించగలదు అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. కాంగ్రెస్ నాయకత్వం వహించే ఇండియా కూటమిలో అనేక పార్టీలు ఉంటాయి.
ముఖ్యంగా బీహార్ నుంచి నితీష్ కుమార్ పార్టీ లాలూ పార్టీ ఉంటాయి. ఈ రెండు పార్టీలు బీహార్ కి ప్రత్యేక హోదాను ఏనాటి నుంచో కోరుతున్నారు. వారితో పాటు ఇతర రాష్ట్రలలో కూడా ప్రత్యేక హోదా నినాదం ఉంది. మరి వారిని కాదని ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే చిత్తశుద్ధి ఉదారత్వం కాంగ్రెస్ కి ఉంటాయా అన్నది పెద్ద ప్రశ్న ఏది ఏమైనా కాంగ్రెస్ మాత్రం పాచిపోయిన ప్రత్యేక హోదా హామీతో 2024 ఎన్నికలను ఈదాలని చూస్తోంది. అయితే ఏపీ జనాలు ఆ పార్టీని ఎంతవరకూ ఆదరిస్తారు అన్నది కాలమే చెబుతుంది.