బీఆర్ఎస్ ట్రాప్లో పడిన రేవంత్ గవర్నమెంట్!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడి అధికార బీఆర్ఎస్ ను ఓడించి, కాంగ్రెస్ గద్దెనెక్కింది. కొత్త ప్రభుత్వం కదా కొన్ని రోజులు వేచి చూద్దామని బీఆర్ఎస్ కూడా అనుకుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడి అధికార బీఆర్ఎస్ ను ఓడించి, కాంగ్రెస్ గద్దెనెక్కింది. కొత్త ప్రభుత్వం కదా కొన్ని రోజులు వేచి చూద్దామని బీఆర్ఎస్ కూడా అనుకుంది. కానీ కాంగ్రెస్ చేజేతులారా తనకు తానే నష్టం చేసుకుంటుందనే చెప్పాలి. శ్వేతపత్రం అంటూ శాసనసభలో చర్చను నిర్వహించిన కాంగ్రెస్.. బీఆర్ఎస్ ఫేవర్ చేసిందనే టాక్ వినిపిస్తోంది. ఈ శ్వేతపత్రంతో బీఆర్ఎస్ కు కాంగ్రెసే ఆయుధం ఇచ్చినట్లు పరిస్థితి కనిపిస్తోంది. చివరకు సాగునీటి మీద కూడా శ్వేతపత్రం రిలీజ్ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ముందే సభను నిరవధిక వాయిదా వేయడంతో ఆ పార్టీ ప్రభుత్వం పారిపోయిందంటూ బీఆర్ఎస్ ఎద్దేవా చేస్తోంది.
సీఎంగా రేవంత్ రెడ్డి ఆలోచిస్తూ, ఆచితూచి సాగుతున్నారనే అభిప్రాయాలు కలిగాయి. కానీ ఇప్పుడు ఈ శ్వేతపత్రం ఐడియా ఎవరిదో కానీ రేవంత్ పై, కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద పడిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన గురించి వాస్తవాలను ప్రజలు ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే ఆ పదేళ్లలో అప్పులు, ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ, వివిధ రంగాల్లో తాజా పరిస్థితిని వెల్లడించాలని కాంగ్రెస్ చూసింది. ఇది మంచి ఆలోచనే. కానీ శ్వేతపత్రం అంటూ సభలో చర్చ పెట్టడం మాత్రం కాంగ్రెస్ కే ఎదురు దెబ్బ అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ చర్చలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దూకుడుగా వ్యవహరించారు. కాంగ్రెస్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇలా అనిపించుకునే అవకాశం ఇచ్చింది కాంగ్రెసే.
కొత్త ప్రభుత్వం తన పని తాను చేసుకోకుండా శ్వేతపత్రం అంటూ బీఆర్ఎస్ ట్రాప్లో పడిందని అంటున్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయడంలో చేతకానితనంతోనే ఇప్పుడు శ్వేతపత్రం అంటూ కాంగ్రెస్ నాటకాలు ఆడుతుందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. ఇప్పటికే రెండు హమీలను కాంగ్రెస్ అమలు చేస్తోంది. మిగతా వాటిని కూడా త్వరలోనే అమలు చేసేందుకు కసరత్తులు చేస్తోంది. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందని ఇప్పుడు లెక్కలు చూపి కాంగ్రెస్ దాటేసే ప్రయత్నం చేస్తోందని బీఆర్ఎస్ అంటోంది. అయితే కాంగ్రెస్ పై విమర్శలు చేసేలా, గ్యారెంటీల అమలు సందిగ్ధంలో పడేలా చేసుకుంది ముమ్మాటికి ఆ పార్టీ ప్రభుత్వమే అని చెప్పాలి. మరి రాబోయే రోజుల్లోనైనా ఇలాంటి బెడిసికొట్టే ఆలోచనలు చేయకుండా కాంగ్రెస్ ఉంటుందమో చూడాలి.