షర్మిల ద్వారా ఎంత నష్టం ?
కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో కదలిక చేస్తోంది. 2014లో చచ్చుబడిపోయిన కాంగ్రెస్ 2019 నాటికి పోటీ చేయడానికి మళ్లీ ఉత్సాహం తెచ్చుకుంది.
కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో కదలిక చేస్తోంది. 2014లో చచ్చుబడిపోయిన కాంగ్రెస్ 2019 నాటికి పోటీ చేయడానికి మళ్లీ ఉత్సాహం తెచ్చుకుంది. ఈసారి అయితే పోటీ కాదు అసెంబ్లీకి మేము వెళ్తామని కూడా ధీమాగా చెబుతోంది. దానికి కారణం కాంగ్రెస్ కి 2004 టైం లో ఊపిరి పోసిన వైఎస్సార్ కుమార్తె షర్మిల ఏపీసీసీ చీఫ్ కావడమే.
ఆమెకు ఉన్న తండ్రి రాజకీయ వారసత్వంతో కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఏమైనా కొన్ని ఓట్లు సాధించవచ్చు అన్న వ్యూహంతో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు. షర్మిలను ఏకంగా కడప ఎంపీగా పోటీ చేయిస్తున్నారు అంటే షర్మిల మీద ఆ పార్టీ పెద్దలు ఆశలు భారీగా పెట్టుకున్నారా లేక రాజకీయ జూదం ఆడుతున్నారా అన్నది తొందరలో తేలనుంది.
అయితే ఒక్క మాట మాత్రం ఉంది. కాంగ్రెస్ కి ఈ ఎన్నికల్లో ఎంతో కొంత ఊపు అయితే రావచ్చు అని. అలాగే ఎన్నో కొన్ని ఓట్లు కూడా లభించవచ్చు. మరి కాంగ్రెస్ కి పెరిగే ఆ ఓట్లు ఎక్కడ నుంచి వస్తాయి. కాంగ్రెస్ కి వెళ్ళే ఆ ఓట్లు ఏ పార్టీని నష్టం పరుస్తాయి అన్నది ఇపుడు రాజకీయ వర్గాలలో చర్చగా ఉంది.
ఇక కడప అన్నది వైఎస్సార్ ఫ్యామిలీకి కంచుకోట. అక్కడ పార్టీలు కన్నా వైఎస్సార్ కుటుంబమే ఉంటుంది. ఆ కుటుంబాన్ని చూసే ఓట్లు వేస్తారు. అలా చూసుకుంటే కనుక కడప ఎంపీగా షర్మిల పోటీ చేయడం వల్ల ఎంత నష్టం ఏ పార్టీకి అన్నది కడప జిల్లా వ్యాప్తంగా చర్చగా సాగుతోంది.
ఇక వైసీపీని విమర్శించే ప్రతీ మాటను సోషల్ మీడియా ద్వారా టీడీపీ వారు ప్రచారం చేస్తున్నారు. వాటిని రీల్స్ ద్వారా జనంలో పెడుతున్నారు. కడపలో అయితే టీడీపీ నేతల మాటలు వారి స్పీచుల కంటే కూడా షర్మిల మాటలను ఆమె స్పీచులను అలాగే సునీత స్పీచులను పెద్ద ఎత్తున టీడీపీ నేతలు కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు.
ఒక విధంగా సొంత పార్టీ కంటే కూడా షర్మిలకే ఎక్కువ ప్రచారం తీసుకుని వస్తున్నారు. మరో వైపు అధికార వైసీపీ నుంచి కడప ఎంపీగా పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డి టీడీపీ కంటే కూడా షర్మిలనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. అలాగే సునీత మీద కూడా ఆయన విమర్శలు చేస్తున్నారు.
ఇప్పటిదాకా అయితే కడప జిల్లాలో కాంగ్రెస్ కి వన్ పర్సెంట్ ఓట్లు కూడా లేవు అని అంటున్నారు. కానీ ఈసారి చూస్తే కనుక అవి ఏకంగా ఆరేడు పర్సెంట్ గా పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా చర్చ సాగుతోంది. ఆ విధంగా కాంగ్రెస్ కనుక ఓట్లు చీలిస్తే అవి ఏ పార్టీ ఓట్లు చీలుస్తుంది అన్నది కూడా చర్చగా సాగుతోంది.
ఇలా షర్మిల కాంగ్రెస్ తరఫున చీల్చే ప్రతీ ఓటూ వైసీపీకే నష్టం అని అంటున్నారు. ఆ పార్టీ ఓట్లనే చీలుస్తుంది అని అంటున్నారు. కానీ టీడీపీకే నష్టం అని వైసీపీ నేతలు అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రభుత్వం బాగుంటే మరోసారి ఎవరైనా ఓటు వేస్తారు. బాగులేదు అనుకుంటే విపక్షం వైపు చూస్తారు. అలా విపక్షానికి వేసే ఓట్లు గుత్తమొత్తంగా టీడీపీ కూటమికి దక్కాలనే పొత్తులు పెట్టుకున్నారు.
కానీ ఇపుడు కాంగ్రెస్ కి కూడా కొన్ని ఓట్లు వెళ్తే కనుక కచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలుతాయని అది వైసీపీకే లాభం కూటమికి భారీ నష్టం అని వైసీపీ వైపు నుంచి వినిపిస్తున్న వాదనగా ఉంది. ఈ విధంగా చూసుకుంటే కనుక షర్మిల పోటీ చేయడం వల్ల కడపలో ఓట్లు ఎవరికి చీలుతాయి అన్నది మాత్రం ఊహకు అందడం లేదు. ఇక్కడ చూడాల్సింది కేవలం నేతలను వారి లెగసీని కాదు, పోల్ మేనేజ్మెంట్ ని. కాంగ్రెస్ కి పోల్ మేనేజ్మెంట్ అన్నది లేదు.కడప లాంటి చోట్ల టీడీపీకే పోల్ మేనేజ్మెంట్ ఇబ్బంది అవుతుంది. అక్కడ వైసీపీ మొత్తంగా మోహరిస్తుంది అని అంటారు.
పైగా అధికారంలో ఉన్న పార్టీ. దాంతో జగన్ సొంత జిల్లా. ఇన్ని లెక్కలు ఉన్నందువల్ల వైసీపీ మరింతగా పట్టు బిగిస్తోంది అని అంటున్నారు. దాంతో బూత్ లెవెల్ దాకా వెళ్ళి ఓట్లు వేయించుకోవడం అన్నది కాంగ్రెస్ కి కష్టసాధ్యమైన విషయం అవుతుంది అని అంటున్నారు. టీడీపీ హెల్ప్ చేసినా ఆ రెండు పార్టీల ఓట్లే అటూ ఇటూ టర్న్ అవుతాయని అంటున్నారు. ఇక వైసీపీ వద్దు అనుకున్న ఓట్లు ఈసారి కాంగ్రెస్ కి వెళ్లినా వెళ్లవచ్చు అంటున్నారు.
ఏది ఏమైనా అద్భుతాలు అయితే జరగకపోవచ్చు అంటున్నారు. షర్మిల చీల్చే ఓట్లు కూడా మరీ ఎక్కువగా ఉంటాయా అంటే అది కూడా చెప్పలేమనే అంటున్నారు. వాస్తవానికి ఆ చీల్చే ఓట్లు కూడా ఎంత అంటే కూడా ఎవరూ చెప్పలేని పరిస్థితి అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.