ఇలా అయితే.. కాంగ్రెస్‌ ఎలా పోటీ చేస్తుంది?

కాంగ్రెస్‌ పార్టీ బ్యాంకు ఖాతాలను ఆదాయ పన్ను (ఐటీ) శాఖ స్తంభింపజేసిన సంగతి తెలిసిందే.

Update: 2024-03-23 05:30 GMT

కాంగ్రెస్‌ పార్టీ బ్యాంకు ఖాతాలను ఆదాయ పన్ను (ఐటీ) శాఖ స్తంభింపజేసిన సంగతి తెలిసిందే. దీంతో రూ.105 కోట్లు బ్యాంకు ఖాతాల్లోనే ఉండిపోయాయి. దీంతో తమ నేతలు ప్రచారానికి వెళ్లడానికి విమాన టికెట్లు కూడా బుక్‌ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నామని, రైలు టికెట్లు బుక్‌ చేసుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నామని, రూ.2 చెల్లించడానికి కూడా తమ వద్ద డబ్బుల్లేవని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టులోనూ కాంగ్రెస్‌ పార్టీకి ఊరట దక్కలేదు. తమ పార్టీ ఆదాయపు పన్ను చెల్లింపుపై ఐటీ విభాగం చేపట్టిన పునఃపరిశీలనను కొట్టివేయాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ ను జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ, జస్టిస్‌ పురుషేంద్ర కుమార్‌ కౌరవ్‌ లతో కూడిన ధర్మాసనం విచారించింది. అనంతరం తీర్పు వెలువరిస్తూ ఆ పిటిషన్‌ ను తోసిపుచ్చింది.

ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ కు సంబంధించి మార్చి 20న ఢిల్లీ హైకోర్టు వాదోపవాదనలు విని తీర్పును రిజర్వు చేసింది. తాజాగా ఆ తీర్పును ప్రకటించింది. 2014–15, 2015–16, 2016–17 సంవత్సరాలకు సంబంధించిన కాంగ్రెస్‌ ఆదాయంపై ఐటీశాఖ పునఃపరిశీలన చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిని ఆపాలని ఆ పార్టీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

ఈ నేపథ్యంలో తాము నిబంధనలు ఉల్లంఘించలేదని ఐటీశాఖ కోర్టుకు నివేదించింది. తాము స్వాధీనం చేసుకొన్న ఆధారాలను బట్టి రూ.520 కోట్ల మేరకు తేడాలు వస్తున్నట్లు తెలిపింది.

కాగా కాంగ్రెస్‌.. మొత్తం రూ.100 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించాలని ఐటీ విభాగం ఇటీవలే నోటీసులు ఇచ్చింది. దీనిపై ఆ పార్టీ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ ను ఆశ్రయించింది. అయితే.. అక్కడ కూడా కాంగ్రెస్‌ అభ్యర్థనను ట్రైబ్యునల్‌ తిరస్కరించింది. ఈ ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని ఇటీవలే ఢిల్లీ హైకోర్టు కాంగ్రెస్‌ పార్టీకి తెలిపింది. తాజాగా పునఃపరిశీలన ఆపే అంశాన్ని కూడా తోసిపుచ్చింది.

తమ ఖాతాలను ఫ్రీజ్‌ చేయడం ప్రజాస్వామ్య వ్యతిరేకమని కాంగ్రెస్‌ అగ్రనేతలు మండిపడుతున్నారు. ఖచ్చితంగా లోక్‌ సభ ఎన్నికల ముందు ఇలా చేయడం ఖచ్చితంగా కుట్రేనంటున్నారు. దేశంలో ప్రజాస్వామ్యం అబద్దంగా మారిందని విమర్శిస్తున్నారు. ఎన్నికల్లో పోరాడకుంటా తమను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News