ఏపీతో జమిలి బంధం బహు గట్టిది !
జమిలి ఎన్నికల గొలుసులో ఏపీ బలమైన బంధం పెనవేసుకుని కొనసాగుతోంది.
ఏపీకి జమిలి ఎన్నికల గురించి చెబితే అవునా మాకు తెలీదు మరి అంటారు. ఎందుకంటే ఏపీలో జమిలి ఎన్నికలు ఎపుడూ జరుగుతూనే ఉన్నాయి. జమిలి ఎన్నికల గొలుసులో ఏపీ బలమైన బంధం పెనవేసుకుని కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే 1999 నుంచి చూస్తే ఏపీకి లోక్ సభకూ ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి.
ఇక 1999, 2004, 2009, 2014, 2019, 2024లలో లోక్ సభతో పాటు ఏపీకి ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అలా జమిలి అనుభవం ఏపీకి మహా పాతది తప్ప కొత్తది అయితే కానే కాదు. ఇక మరింత లోతులకు వెళ్తే కనుక తొలి సార్వత్రిక ఎన్నికల నుంచి ఇప్పటి దాకా చూస్తే కేంద్రంలోని లోక్ సభకు ఏపీ అసెంబ్లీకి జమిలి ఎన్నికలు మొత్తం తొమ్మిది సార్లు జరిగాయని చరిత్ర చెబుతోంది.
అంటే 2024 లో కలుపుకుని మొత్తం 17 సార్లు లోక్ సభకు ఎన్నికలు జరిగాయి. అలాగే ఏపీ అసెంబ్లీకి 15 సార్లు ఎన్నికలు నిర్వహించారు అయితే అందులో తొమ్మిది సార్లు ఏపీతో కలిపి జమిలి ఎన్నికలే నిర్వహించారు. ఆ మిగిలిన వాటిలో కూడా చూస్తే కేంద్రంలోని ప్రభుత్వాలు గట్టిగా రెండేళ్ళు లేకుండా కుప్ప కూలడం వల్ల మధ్యంతర ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఏపీ అసెంబ్లీ ఎన్నికలు వాటితో జరగలేదు. అలా చూస్తే 1971, 1977, 1980, 1984, 1991, 1996, 1998లలో లోక్ సభ పదవీ కాలంలో కాకుండా వేరేగా ఎన్నికలు తోసుకుని రావడం వల్లనే ఈ జమిలి గొలుసు కట్టు నుంచి ఏపీ విడిపోయినట్లుగా కనిపించింది.
ఇక మొదటి నుంచి చూసుకుంటే 1952 తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగితే లోక్ సభతో పాటు ఏపీకి జమిలి ఎన్నికలు నిర్వహించారు. అలాగే 1957, 1962, 1967లలో కూడా జమిలి ఎన్నికలు ఏపీ ప్లస్ లోక్ సభకు జరిగాయి. ఇక లోక్ సభ 1967 నుంది 1970 దాకా మూడేళ్ళు మాత్రమే కొనసాగితే ఏపీలో అసెంబ్లీ అయిదేళ్ళ పాటు 1972 దాకా కొనసాగింది.
అదే విధంగా చూస్తే 1971లో ఇందిరాగాంధీ ప్రధాని అయ్యాక ఆరేళ్ల పాటు లోక్ సభ పనిచేయడం కూడా ఒక చరిత్ర. అలా కూడా జమిలి గొలుసుకట్టు తప్పినట్లు అయింది. 1977లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్ళకే పడిపోయింది.అలా లోక్ సభకు 1980లో ఎన్నికలు వచ్చాయి.
ఇక ఉమ్మడి ఏపీలో 1978లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అయిదేళ్ళ పాటు కొనసాగింది. 1983లో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ రెండేళ్ళకే సర్కార్ ని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్ళింది. అలా 1985 మార్చిలో ఎన్నికలు వచ్చాయి. దాంతో 1984లో లోక్ సభ ఎన్నికలు వేరేగా జరిగాయి.
ఇంకో వైపు చూస్తే 1990 మార్చి వరకూ తన పదవీ కాలం ఉండగానే ఎన్టీఆర్ అసెంబ్లీని రద్దు చేసి 1989 డిసెంబర్ లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. దాంతో అపుడు లోక్ సభకు ఉమ్మడి ఏపీకి జమిలి ఎన్నికలు వచ్చాయి. అలా 1967లో తెగిన ఈ గొలుసుకట్టు తిరిగి అతుక్కుంది. అయితే ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం ఏణ్ణర్ధానికే కూలడంతో మళ్లీ గాడి తప్పింది. తిరిగి 1999లో వాజ్ పేయి ప్రధానిగా ఉండగా ఈ గొలుసు కట్టు బంధం బిగిసింది. అది ఇప్పటికీ ఏపీలో కంటిన్యూ అవుతోంది. ఇదీ ఏపీ లోక్ సభ ఎన్నికల మధ్య ఉన్న జమిలి బంధంగా చెప్పుకోవాలి.
ఇంకో విశేషం ఏంటి అంటే 1952 నుంచి 2024 వరకూ ఈ దేశంలో లోక్ సభకు మొత్తం అన్ని రాష్ట్రాలకు కలుపుకుని 430 సార్లు ఎన్నికలు జరిగాయి అని రికార్డులు చెబుతున్నాయి. అంటే సగటున ఏడాదికి ఆరు వంతున అలాగే ప్రతీ రెండు నెలలకు ఒకటి వంతున ఈ దేశంలో ఎన్నికలు ఏదో చోట జరుగుతూనే ఉన్నాయన్న మాట. ఈ విధంగా చూస్తే కనుక జమిలి ఎన్నికల అవసరం ఎంతో అర్ధం అవుతుంది. కానీ దానికి మంచి స్పూర్తి ఉండాలి. అందరూ దానిని విశ్వసించాలని కోరుకుంటున్నారు.