Begin typing your search above and press return to search.

వీడెవడండీ బాబూ.. రెండేళ్ల పిల్లలపై ఎఫ్‌ఐఆర్‌!

సంచలనం సృష్టించిన ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలోని వరంగల్‌ జిల్లా హనుమకొండ రాంనగర్‌ లో ఒక సీఐడీ కానిస్టేబుల్‌ నివాసం ఉంటున్నాడు.

By:  Tupaki Desk   |   25 Sep 2024 1:30 PM GMT
వీడెవడండీ బాబూ.. రెండేళ్ల పిల్లలపై ఎఫ్‌ఐఆర్‌!
X

పదేళ్ల లోపు పిల్లలు ఏదైనా తప్పు చేస్తే ఎవరైనా ఏం అంటారు.. చిన్న పిల్లల్లే తెలియక తప్పు చేశారు.. ఏం అనకండి.. వదిలేయండనేగా. ఇంట్లో కుటుంబ సభ్యులే కాదు.. బయట వ్యక్తులయినా చిన్న పిల్లల విషయంలో ఉదారంగానే వ్యవహరిస్తారు. అది కూడా లోకం పోకడ తెలియని, మంచేదో, చెడేదో తెలుసుకోలేని పదేళ్ల లోపు పిల్లల విషయంలో ఎవరైనా ఇంకా ఉదారంగానే వ్యవహరిస్తారు.

అయితే ఒక కర్కశ కానిస్టేబుల్‌ మాత్రం దారుణంగా వ్యవహరించాడు. పసి పిల్లలని అని కూడా చూడకుండా 2 ఏళ్ల పిల్లలు మొదలుకుని 9 ఏళ్ల పిల్లల వరకు మొత్తం ఎనిమిది మందిపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు పెట్టించాడు. ఇంతకూ ఆ పిల్లలు చేసింది పెద్ద నేరమేమీ కాదు. కారుపైన గీతలు గీయడమే వారు చేసింది. దానికే కానిస్టేబుల్‌ రెచ్చిపోయాడు. చిన్నారులపైన ఏకంగా పోలీసు స్టేషన్‌ లో ఫిర్యాదు చేశాడు. ఆ కానిస్టేబుల్‌ కి సర్ది చెప్పి పంపాల్సిన పోలీసులు కూడా అతడిచ్చిన ఫిర్యాదుతో ముందూ వెనుకా చూసుకోకుండా ఎనిమిది మంది చిన్న పిల్లలపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు.

సంచలనం సృష్టించిన ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలోని వరంగల్‌ జిల్లా హనుమకొండ రాంనగర్‌ లో ఒక సీఐడీ కానిస్టేబుల్‌ నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో జూలై 7న అపార్టుమెంట్‌ పార్కింగ్‌ స్థలంలో చిన్న పిల్లలు ఆడుకుంటుండగా కానిస్టేబుల్‌ కారుపై గీతలుపడ్డాయి.

దీంతో తన కారుపై గీతలు గీశారని కానిస్టేబుల్‌ ఆ పిల్లలపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న ఆ ఎనిమిది పిల్లల తల్లిదండ్రులు కానిస్టేబుల్‌ వద్దకు వెళ్లి పిల్లలు తెలియక చేసినదానికి క్షమించాలని వేడుకున్నారు. ఆ కారు గీతలు పోయేలా మరమ్మతులు కూడా చేయిస్తామని చెప్పారు. అయినప్పటికీ ఆ కర్కశ కానిస్టేబుల్‌ వారిపై దయచూపలేదు.

కానిస్టేబుల్‌ ఫిర్యాదుతో ముందూ వెనుకా చూసుకోకుండా పోలీసులు ఎనిమిది చిన్న పిల్లలపై ఎఫ్‌ఐఆర్‌ కూడా దాఖలు చేశారు. వీరంతా 2 ఏళ్ల నుంచి 9 ఏళ్ల లోపు పిల్లలే కావడం గమనార్హం. పిల్లల తల్లిదండ్రులను పోలీసులు స్టేషన్‌ కు పిలవడంతో ఈ కేసు వ్యవహారం వెలుగు చూసింది. దీంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తే భవిష్యత్తులో వారి విద్య, ఉద్యోగాలకు ఇబ్బంది అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే కారుకు ఇన్సూరెన్సు రావాలంటే పోలీసు ఎఫ్‌ఆఐర్‌ ఉండాలని.. అందుకే పిల్లలపై కేసు పెట్టామని పోలీసులు చెబుతున్నారు. ఇదేమంత పెద్ద కేసు కాదని.. ప్రా«థమికంగా మాత్రమే నమోదు చేశామని అంటున్నారు.