ఒకే రోజు ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్ల ఆత్మహత్య.. అసలు కారణమిదే

ఈ నష్టాన్ని తీర్చలేని అతను.. భార్య.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తానూ తాగాడు. అయినా తనకు మరణం రాకపోవటంతో ఉరి వేసుకొని చచ్చిపోయాడు.

Update: 2024-12-30 04:28 GMT

న్యాయాన్ని పరిరక్షిస్తూ.. ప్రజల ఆస్తులకు.. ప్రాణాలకు రక్షకులుగా ఉండే పోలీసు జాబ్ లో ఉంటూ.. తమను తాము రక్షించుకోలేని దీనస్థితి ఎదురైతే? మోసం బారిన పడి.. మోసానికి గురై ఒకరు.. నిందారోపణల్ని తట్టుకోలేక మరొకరు.. ఒకే రోజున.. ఒకే జిల్లాకు చెందిన వేర్వేరు హెడ్ కానిస్టేబుళ్ల మరణం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. అసలేం జరిగింది? అన్నది చూసినప్పుడు ఒక పెద్ద ఉపద్రవాన్ని ప్రభుత్వాలు ఇప్పటివరకు చూసిచూడనట్లుగా వ్యవహరించటమే విషయం ఇక్కడి వరకు వచ్చిందని చెప్పాలి.

ఇప్పటివరకు సామాన్య ప్రజలు మాత్రమే ఆన్ మోసాలకు నష్టపోయారు. వాటిని ఆపేంత శక్తి సామర్థ్యాలు ప్రభుత్వాలకు ఉన్నప్పటికి.. ఉదాసీనతతో వ్యవహరిస్తూ.. వాటిని పెద్దగా పట్టించుకోకపోవటం అవిప్పుడు వ్యవస్థల్ని చెడుగుడు ఆడే పరిస్థితికి వచ్చేశాయి. వాటి బారిన పడేటోళ్లు అన్ని వర్గాలకు చెందిన వారు అవుతున్నారు. తెలంగాణలో తాజాగా చోటు చేసుకున్న విషాదం ఆ కోవకు చెందిందే. ఆన్ లైన్ మోసం బారిన పడిన ఒక హెడ్ కానిస్టేబుల్ నష్టపోయింది అక్షరాల పాతిక లక్షల రూపాయిలు.

ఈ నష్టాన్ని తీర్చలేని అతను.. భార్య.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తానూ తాగాడు. అయినా తనకు మరణం రాకపోవటంతో ఉరి వేసుకొని చచ్చిపోయాడు. అతడి భార్యా పిల్లల్ని స్థానికులు ఆసుపత్రికి చేర్చారు. మరో ఉదంతంలో వివాహేతర సంబంధమన్న నిందారోపణతో మరో హెడ్ కానిస్టేబుల్ తాను విధులు నిర్వహించే స్టేషన్ ఆవరణలోని చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న వైనం ఇప్పుడు షాక్ కు గురి చేస్తోంది. ఈ రెండు ఉదంతాలు ఆదివారం.. ఉమ్మడి మెదక్ జిల్లాలో చోటు చేసుకున్నాయి.

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన 34 ఏళ్ల బాలక్రిష్ణ అదే జిల్లాలోని టీజీఎస్పీ 17వ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు. అతడికి భార్య మానస.. ఇద్దరు కుమారులు యశ్వంత్.. ఆశ్రిత్ లు ఉన్నారు. వారిద్దరూ పదకొండేళ్ల లోపు వారు. అధిక లాభాల ఆశతో పదిహేను రోజుల క్రితం మహారాష్ట్రకు చెందిన గుర్తు తెలియని ఒక కంపెనీలో విడతల వారీగా రూ.25 లక్షలు పెట్టుబడిగా పెట్టారు. తర్వాత నుంచి కంపెనీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో తాను మోసపోయినట్లుగా గుర్తించాడు.

అప్పులు తీర్చే మార్గం లేదని.. అందరం చచ్చిపోతామని భార్యను ఒప్పించాడు. రాత్రి తాగే టీలో ఎలుకల మందు కలిపి పిల్లలకు తాగించి.. వారిద్దరూ తాగారు. అందరూఅపస్మారక స్థితికి వెళ్లిపోయారు. ఆదివారం తెల్లవారుజామున స్ప్రహలోకి వచ్చిన అతడు.. భార్య పిల్లలు ప్రాణాలతో ఉండటాన్ని గుర్తించాడు. దీంతో మరో గదిలోకి వెళ్లి తలుపేసుకొని ఉరి వేసుకొని తనువు చాలించాడు. కాసేపటికి స్ప్రహలోకి వచ్చిన బార్య దగ్గరి బంధువులకు ఫోన్ చేయగా.. వారు వచ్చి ఆమెను.. పిల్లల్ని హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఉదంతానికి సంబంధించిన ఫిర్యాదును మానస నుంచి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మరో ఉదంతంలోకి వెళితే.. కాల్చారం పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు 55 ఏళ్ల సాయి కుమార్. నర్సాపూర్ లో నివసిస్తున్న సాయికుమార్ కు అదే పట్టణానికి చెందిన ఒక మహిళతో పరిచయమైంది. వారిద్దరు తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారు. దీన్ని అసరాగా తీసుకొని ఆమెతో పాటు.. ఆమె భర్త.. అల్లుడు కలిసి వేధింపులకు గురి చేసేవారు. అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరించేవారు. దివ్యను వేధిస్తున్నాడంటూ ఇటీవల ఎస్పీకి కంప్లైంట్ ఇప్పించారు.

ఈ వ్యవహారంలో విషయం తీవ్రమైతే తన పరువు పోతుందని భావించిన సాయికుమార్.. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి స్టేషన్ ఆవరణలో వెనుకున్న క్వార్టర్ వద్ద ఉన్న చెట్టుకు ఉరి వేసుకొని ప్రాణాలు విడిచారు. సాయి కుమార్ కు భార్య.. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదును తీసుకున్న పోలీసులు కేసు కట్టి విచారణ చేపట్టారు. మూడు రోజుల క్రితం కామారెడ్డి జిల్లాలో మరణించిన ఎస్ఐ సాయికుమార్ ది కూడా కొల్చారం గ్రామం కావటం.. ఇదే ఊరికి చెందిన మరో పోలీసులు ఆత్మహత్య చేసుకోవటం షాకింగ్ గా మారింది.

Tags:    

Similar News