ఫోన్‌ ట్యాపింగ్‌.. జీవిత ఖైదు తప్పదా?

ముఖ్యంగా ప్రస్తుత ముఖ్యమంత్రి, నాటి కాంగ్రెస్‌ ముఖ్య నేత రేవంత్‌ రెడ్డే లక్ష్యంగా ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం నడిచినట్టు ఆరోపణలు ఉన్నాయి.

Update: 2024-04-25 07:19 GMT

తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు ప్రకంపనలు రేకెత్తిస్తున్న సంగతి తెలిసిందే. కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారస్తులు, సినీ తారల ఫోన్లు ట్యాపింగ్‌ కు గురయ్యాయని వెల్లడైంది. ముఖ్యంగా ప్రస్తుత ముఖ్యమంత్రి, నాటి కాంగ్రెస్‌ ముఖ్య నేత రేవంత్‌ రెడ్డే లక్ష్యంగా ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం నడిచినట్టు ఆరోపణలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో ఇప్పటికే టాస్క్‌ఫోర్స్‌ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌ రావు, మాజీ డీఎస్పీ ప్రణీత్‌ రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలు అరెస్టు అయ్యారు. వీరంతా ప్రస్తుతం రిమాండ్‌ లో ఉన్నారు. వీరు ఇచ్చిన కీలక వాంగ్మూలాల ఆధారంగా బీఆర్‌ఎస్‌ పార్టీలో పెద్ద తలకాయలు అరెస్టు కావడం ఖాయమని అంటున్నారు.

కాగా ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో ఈ అధికారులకు జీవిత ఖైదు పడొచ్చని చర్చ జరుగుతోంది. ప్రస్తుతం జైల్లో ఉన్న అధికారులపై సైబర్‌ టెర్రరిజం సెక్షన్ల కింద ఐటీ యాక్ట్‌ 66 ఎఫ్‌ ను పెడుతున్నట్టు సమాచారం. ఈ మేరకు ఈ చట్టం కింద కేసు నమోదు చేస్తున్నట్టు విచారణ అధికారులు కోర్టులో మెమో కూడా దాఖలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇప్పటికే ఐటీ యాక్ట్‌ 70 కింద కేసు నమోదు చేశారు. దీని ప్రకారం పదేళ్ల జైలుశిక్ష పడుతుందని చెబుతున్నారు. ఇప్పుడు సైబర్‌ టెర్రరిజం కింద కూడా కేసు పెట్టడంతో జీవిత ఖైదు విధించే అవకాశాలున్నాయని అంటున్నారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో పెద్దలు చెప్పినట్టల్లా నడుచుకుని ఇప్పుడు అరెస్టు అయిన పోలీసు అధికారులు పీకల మీదకు తెచ్చుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు రాధాకిషన్‌ రావు తాను ఎల్‌ఎల్‌ఎం పరీక్షలు రాస్తున్నానని తనకు మధ్యంతర బెయిలు ఇవ్వాలని నాంపల్లి కోర్టులో వేసిన పిటిషన్‌ ను కోర్టు తిరస్కరించింది.

మరోవైపు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అరెస్టయి చంచల్‌ గూడ జైలులో రిమాండులో ఉన్న మాజీ డీఎస్పీ ప్రణీత్‌ రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న బెయిలు పిటిషన్లపై వాదనలు పూర్తయ్యాయి. నాంపల్లి కోర్టు తీర్పును వాయిదా వేసింది. తమకు బెయిల్‌ మంజూరు చేయాలని విన్నవిస్తూ వీరంతా కోర్టును ఆశ్రయించారు.

అయితే వీరి బెయిల్‌ పిటిషన్‌ పై ప్రభుత్వం తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణ కీలక దశలో ఉందన్నారు. ఈ సమయంలో నిందితులకు బెయిలు మంజూరు చేస్తే సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఇంకా పెద్దసంఖ్యలో బాధితులుండే వీలుందన్నారు. ఈ నేపథ్యంలో బెయిల్‌ పిటిషన్‌ ను తిరస్కరించాలన్నారు.

Tags:    

Similar News