అవును.. అమెరికాలో విపక్ష నేత ఒకరు 25 గంటల స్పీచ్
డెమోక్రాట్ల నేత ఒకరు సెనెట్ లో అరుదైన ఫీట్ చేశారు.దేశాధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఎంత దారుణంగా ఉన్నాయన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు డెమోక్రాట్ల నేత (సెనెటర్) కోరీ బుకర్.;

ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. ట్రంప్ లాంటి మొరటు రాజకీయ నాయకుడి చేతిలో అగ్రరాజ్య పగ్గాలు ఉన్నప్పటికి.. ఆ ప్రజాస్వామ్య దేశంలో కొన్ని పరిణామాల్ని చూసినప్పుడు.. ప్రపంచ దేశాలకు అమెరికాకు ఉన్న తేడా స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణంగా చట్టసభల్లో అధికారపక్షానికి వ్యతిరేకంగా మాట్లాడే సభ్యుడికి ఎంత సమయం ఇస్తారు? వారి స్థాయిని అనుసరించి పరిమిత సమయం ఇస్తారు. ఘాటు విమర్శలు మొదలు పెడితే.. ఏ క్షణంలో అయినా మైక్ కట్ అవుతుంది. మొత్తంగా తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేందుకు అవకాశం లభించదు.
కానీ.. అగ్రరాజ్యం అమెరికా అందుకు భిన్నం. అక్కడి విపక్ష నేతలు తమ వాదనను వినిపించేందుకు వారికి లభించే సమయం గురించి తెలిస్తే నోట మాట రాదంతే. తమకున్న అవకాశాన్ని వినియోగించుకున్న డెమోక్రాట్ల నేత ఒకరు సెనెట్ లో అరుదైన ఫీట్ చేశారు.దేశాధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఎంత దారుణంగా ఉన్నాయన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు డెమోక్రాట్ల నేత (సెనెటర్) కోరీ బుకర్.
ఆయన సెనెట్ లో తన వాణిని సుదీర్ఘంగా వినిపించారు. అమెరికా చరిత్రలో ఇంత సుదీర్ఘమైన ప్రసంగం ఇప్పటివరకు లేదు. ఈ 55 ఏళ్ల నేత సోమవారం సాయంత్రం (అమెరికా కాలమానం ప్రకారం) సెనెట్ ఫ్లోర్ ఎక్కి స్పీచ్ షురూ చేశారు. ట్రంప్ సర్కారు తీరును తీవ్రంగా తప్పు పడుతూ.. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్ని ఉతికి ఆరేశారు. మొత్తంగా ఆయన స్పీచ్ 25 గంటల 5 నిమిషాల పాటు సాగింది. ఛాంబర్ చరిత్రలో ఇదే అత్యంత సుదీర్ఘమైన స్పీచ్ గాచెబుతున్నారు. రాత్రి వేళలోనూ ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. ఈ సందర్భంగా గతాన్ని గుర్తు చేసుకుంటున్న కొందరు 1957లో పౌరహక్కుల చట్టాన్ని వ్యతిరేకిస్తూ రిపబ్లికన్ నేత స్ట్రోమ్ థర్మోండ్ చేసిన సుదీర్ఘ స్పీచ్ ను తాజాగా బద్ధలు కొట్టారని చెబుతున్నారు. ఏమైనా.. విపక్షానికి చెందిన నాయకుడికి చట్టసభలో ఇంతసేపు మాట్లాడే అవకాశం ఉండటం గ్రేట్ కదా?