బాబోయ్ బెంగళూరు.. హైదరాబాదే ముద్దు!
తాను బెంగళూరు నుంచి హైదరాబాద్ కు ఫ్యామిలీని మార్చడం ద్వారా నెలకు రూ.40,000 ఆదా చేస్తున్నట్లు పృథ్వీరెడ్డి పేర్కొన్నాడు
సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన నగరం.. బెంగళూరు. దేశ ఐటీ హబ్ కూడా బెంగళూరే. ఆ నగరంలో ఎన్నో దేశీ, విదేశీ కంపెనీలు ఉన్నాయి. అలాగే ఐటీ ఔత్సాహికులు కూడా తమకు మంచి జీతాలు రావాలంటే మొదటగా చూస్తున్నది బెంగళూరు వైపే. ఇక్కడ హైదరాబాద్ లో కంటే ఎక్కువ జీతాలు దక్కుతాయనే అభిప్రాయమే ఇందుకు కారణం.
అయితే హైదరాబాద్ తో పోలిస్తే బెంగళూరులో నివాస వ్యయం (కాస్ట్ ఆఫ్ లివింగ్) చాలా ఎక్కువ. ముఖ్యంగా ఇంటి అద్దెలకే జీతంలో దాదాపు సగం పెట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. అద్దెకు కూడా అంత సులువుగా లభించవని.. చాలా షరతులు ఉంటాయని చెబుతున్నారు. కేవలం ఇంటి అద్దెల కాకుండా తినే వస్తువుల నుంచి ఉపయోగించే వస్తువుల వరకు అన్నిటి ధరలు ఎక్కువే అని అంటున్నారు.
ఈ నేపథ్యంలో పృథ్వీరెడ్డి అనే వ్యక్తి ట్విట్టర్ లో పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. బెంగళూరు నుంచి ఇటీవల హైదరాబాద్ కు మారాక తాను నెలకు రూ.40 వేలు ఆదా చేయగలుగుతున్నా అని పేర్కొన్నాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాకుండా ఈ అంశం నెటిజన్ల మధ్య చర్చకు దారితీసింది. కొందరు అతను చెప్పింది నిజమేనని అంగీకరిస్తే.. మరికొందరు వ్యతిరేకించారు.
తాను బెంగళూరు నుంచి హైదరాబాద్ కు ఫ్యామిలీని మార్చడం ద్వారా నెలకు రూ.40,000 ఆదా చేస్తున్నట్లు పృథ్వీరెడ్డి పేర్కొన్నాడు. ఆ రూ.40 వేలతో ఓ ఫ్యామిలీ హైదరాబాద్ లో ప్రశాంతంగా జీవించవచ్చునని అతను చెప్పడం నెటిజన్లను ఆకర్షించింది.
బెంగళూరులో ఓ మధ్యతరగతి వ్యక్తి జీవించడానికి కనీసం బ్యాచిలర్ కు అయితే నెలకు రూ.25,000, జంటలకు అయితే రూ.50,000, నలుగురు అంతకంటే ఎక్కువమంది ఉంటే రూ.70,000 అవుతోందని అంటున్నారు. దేశంలో ఏ ఇతర నగరాలతో పోల్చుకున్నా బెంగళూరులో ఈ మొత్తం ఎక్కువని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారు బెంగళూరులో అంత ఖర్చులను తట్టుకుని ఉండే పరిస్థితి లేదంటున్నారు. వారు ఉద్యోగ రీత్యా తామొక చోట.. తమ ఫ్యామిలీని మరో చోట ఉంచే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో ఖర్చులు తక్కువగా ఉన్నచోట, ఉద్యోగ రీత్యా తమకు అనువుగా ఉన్న చోటకు మారక తప్పదని చెబుతున్నారు.