లేఅవుట్ లో కాల్చిన శవం... తప్పుడు పనికి భార్యభర్తల పరిష్కారం!

తన తండ్రి కనిపించడం లేదని కుమారుడు చేసిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఓ లేఅవుట్ లో శవాన్ని కాల్చిన ఆనవాళ్లు కనిపించాయి.

Update: 2025-02-22 09:36 GMT

ఈ నెల తొమ్మిదో తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన అప్పన్నదొర అనే వ్యక్తి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో.. అతని కుమారుడు దుర్గాప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఈ నెల 19న ఓ లేఅవుట్ లో శవాన్ని కాల్చిన ఆనవాళ్లు కనిపించాయి. అది తన తండ్రిదేనని కుమారుడు గుర్తించాడు. ఈ సమయంలో ఓ షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది.

అవును... తన తండ్రి కనిపించడం లేదని కుమారుడు చేసిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఓ లేఅవుట్ లో శవాన్ని కాల్చిన ఆనవాళ్లు కనిపించాయి. అక్కడ లభించిన కొన్ని వస్తువుల ఆధారంగా అది తన తండ్రిదేనని కుమారుడు గుర్తించాడు. కూపీలాగితే ఓ షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది. ఆ వివరాలేమిటనేది ఇప్పుడు చూద్దామ్!

పెందుర్తి లోని బీసీ కాలనీకి చెందిన అప్పన్నదొర అనే వ్యక్తి ఊరూరా తిరుగుతూ పూజలు చేస్తుంటాడు. ఈ సమయంలో నేరెళ్లవలస ప్రాంతానికి చెందిన చిన్నారావు దంపతులు ఇటీవల ఎల్వీ పాలెంలో కొత్తగా అద్దెకు వచ్చారు. ఈ సమయంలో.. ఆ ఇంటి సమీపంలోని టీ షాపు యజమాని తిరుపతమ్మతో వారికి పరిచయం ఏర్పడింది.

అయితే.. ఆ టీ షాపుకు ప్రతీ మంగళ, ఆదివారాల్లో అప్పన్న దొర వెళ్తుండేవాడు. ఈ సమయంలో.. అతడు సమస్యల నుంచి ఉపశమనం కోసం పుజలు చేస్తుంటాడని తిరుపతమ్మ ద్వారా చిన్నారావు భార్య మౌనిక తెలుసుకుంది. అనంతరం అప్పన్న దొరను సంప్రదించింది. దీంతో.. మీకు నాగ దోషం ఉందని అప్పన్నదొర చెప్పాడు.

అనంతరం దాని విరుగుడుకు తాను పూజలు చేస్తానని చెప్పి చిన్నారావు ఇంటికి వెళ్లాడు. ఈ సమయంలో ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఆమెను బలవంతంగా లోబరుచుకున్నాడట అప్పన్న. అనంతరం.. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే.. తనకున్న శక్తులతో నాశనం చేస్తానని బెదిరించాడట.

దీంతో... తీవ్ర ఆందోళన చెందిన మౌనిక.. జరిగిన విషయాన్ని తన భర్త చిన్నారావుకు చెప్పింది. దీంతో... తీవ్ర కోపోద్రిక్తుడైన చిన్నారావు.. అప్పన్నను హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. దానికోసం ఓ బటన్ నైఫ్ కూడా సిద్ధం చేసుకున్నాడు. ఇక ప్లాన్ లో భాగంగా... తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని.. పూజ చేయాలని అప్పన్నకు కాల్ చేశాడు చిన్నారావు.

దీంతో... ఈ నెల 9న తన వద్దకు వచ్చిన అప్పన్నదొరను బైక్ పై ఎక్కించుకుని.. ఉప్పాడలో ఉన్న తన తల్లి వద్దకు అని చెప్పి బయలుదేరాడు చిన్నారావు. ఈ సమయంలో గ్రావెల్ దారిలో తీసుకెళ్తూ మార్గమధ్యలో గంభీరం గెడ్డ సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు లేఅవుట్ లోని షెడ్డు వద్దకు తీసుకెళ్లి అప్పన్నను కత్తితో పొడిచి హత్య చేశాడు చిన్నారావు.

ఈ విషయాన్ని పద్మనాభం సర్కిల్ ఇనిస్పెక్టర్ వాసు నాయుడు వెల్లడించారు. ఇలా అప్పన్నను హతమార్చే క్రమంలో చిన్నారావు వేలికి గాయమవ్వడంతో.. అతడు నేరుగా కేజీహెచ్ కు వెళ్లి చికిత్స పొందాడు. తిరిగి మంగళవారం తెల్లవారుజామున తన భార్యతో కలిసి పెట్రోల్ తీసుకుని అప్పన్న మృతదేహం వద్దకు వెళ్లాడు.

ఈ సమయంలో అప్పన్నదొర మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పటించారు చిన్నారావు దంపతులు. అనంతరం అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో.. దంపతులిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించే సరికి ఈ అసలు విషయం వెలుగులోకి వచ్చిందని సీఐ తెలిపారు. వీరిరువురినీ రిమాండ్ కు తరలించారు.

Tags:    

Similar News