ఇటు ముడా స్కామ్.. అటు కోవిడ్ స్కామ్!
దీంతో ప్రతిపక్ష బీజేపీ సహా ఇతర పార్టీలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని ఢిమాండ్ చేస్తున్నాయి.
కర్ణాటకలో వరుస కుంభకోణాలు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీలకు తీవ్ర చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన సతీమణి ఇచ్చిన భూములకు పరిహారంగా విలువైన ప్రాంతంలో భూములు కట్టబెట్టారని తీవ్ర విమర్శలు రేగుతున్నాయి. ఈ వ్యవహారంలో సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ అనుమతిచ్చారు.
దీంతో ప్రతిపక్ష బీజేపీ సహా ఇతర పార్టీలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని ఢిమాండ్ చేస్తున్నాయి. మైసూర్ నగరాభివృద్ధి సంస్థ (ముడా) గతంలో సిద్ధరామయ్య సతీమణి పార్వతమ్మ నుంచి నగరాభివృద్ధి కోసం భూములు తీసుకుంది. ఇందుకు పరిహారంగా ఆమెకు విలువైన ప్రాంతంలో భూములిచ్చారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ముడా స్కామ్ తో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త స్కామ్ ను బయటపెట్టింది. గత బీజేపీ ప్రభుత్వ హయాంలో ఈ స్కామ్ జరిగిందని ఆరోపిస్తోంది. బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కోవిడ్ సమయంలో కర్ణాటకలో ఈ స్కామ్ జరిగిందని విమర్శిస్తోంది. కోవిడ్ సమయంలో కోట్లాది రూపాయల అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు.
కోవిడ్ స్కామ్ పై రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ జాన్ మైఖెల్ కమిటీని కూడా నియమించింది. ఈ నివేదికను కమిటీ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ స్కామ్ కు సంబంధించి కొన్ని కీలక పత్రాలు లేనట్టు కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఈ నివేదికపై క్యాబినెట్‌లో చర్చించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ స్కామ్ పై విచారణకు నిర్ణయించినట్టు తెలుస్తోంది.
తాజాగా కేబినెట్ సమావేశంలో కోవిడ్ స్కామ్ కు సంబంధించిన నివేదికపై ఉన్నతాధికారులు, మంత్రులతో సిద్ధరామయ్య చర్చించారు. ఇందులో కొన్ని కీలక విషయాలను గుర్తించారని సమాచారం. వందల కోట్లు దుర్వినియోగం కావడంతోపాటు కొన్ని కీలక పత్రాలు కనిపించడం లేదని కమిటీ తన నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తోంది.
కోవిడ్ సమయంలో నాటి బీజేపీ ప్రభుత్వం రూ.13 వేల కోట్లు ఖర్చు పెట్టిందని.. సమాచారం. ఇందులో రూ.1000 కోట్లు స్వాహా అయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వంలో అక్రమాలపై జస్టిస్ జాన్ మైఖెల్ కమిటీని వేసింది. ఇప్పుడు అది ఇచ్చిన ప్రాథమిక నివేదికకు రానున్న ఆరు నెలల్లో తుదిరూపు ఇవ్వనున్నారు.
ఓవైపు ముడా స్కామ్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఊపిరి సలుపుకోనీయకుండా చేస్తుంటే మరోవైపు కోవిడ్ స్కామ్ గత ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత యుడియూరప్ప మెడకు చుట్టుకునేలా ఉంది.