జమిలిపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు
రాజకీయాల్లో దుష్ట సంస్కృతిని ప్రధాని మోడీ తీసుకొచ్చారని అన్నారు.
జమిలి ఎన్నికలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అటు ప్రధాని మోడీపై విమర్శలు చేశారు. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి మోడీ కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఇటు తెలంగాణ ప్రభుత్వంపైనా విమర్శలు చేశారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మఖ్దూం భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో దుష్ట సంస్కృతిని ప్రధాని మోడీ తీసుకొచ్చారని అన్నారు. అందుకే.. మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలను ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని విమర్శించారు. ఆ రెండు రాష్ట్రాల్లో గెలిస్తే జమిలి ఎన్నికల దిశగా వెళ్లాలని మోడీ చూస్తున్నారని అన్నారు. జమిలి ఎన్నికలు ఫెడరల్ వ్యవస్థకు విరుద్ధమని అన్నారు.
కూటమి పొత్తులో భాగంగా మహారాష్ట్రలో ఒక స్థానంలో పోటీ చేస్తున్నామని, జార్ఖండ్‌లో ఒంటరిగా బరిలో నిలిచినట్లు నారాయణ చెప్పారు. వైసీపీ అధ్యక్షుడు 12 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్నారని, ఆయన కనీసం కోర్టులకు కూడా వెళ్లడం లేదని ఆక్షేపించారు. ప్రధాని మోడీ, అమిత్‌షా సహకారంతోనే జగన్ బయట ఉంటున్నారని ఆరోపించారు. మరోవైపు.. కులగణనపై నారాయణ స్పందించారు.
కులగణన ద్వారా రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడిన వారిని ప్రోత్సహించవచ్చని.. ప్రభుత్వ లక్ష్యం మంచిదే అయినప్పటికీ 75 ప్రశ్నలు అవసరమా అని ప్రశ్నించారు. యాప్ రూపొందిస్తే ఎవరి ఫామ్ వాళ్లే పూర్తి చేస్తారు కదా అని సూచించారు. వ్యక్తిగత ఆస్తలు, అప్పులు, బ్యాంకు లావాదేవీలు ప్రభుత్వానికి ఎందుకు అని ప్రశ్నించారు. వాటిని ప్రజలు కూడా ఎలా వెల్లడిస్తారని తెలిపారు. వివాదానికి పోకుండా కులగణన సులభతరం చేయాలని కోరారు. వికారాబాద్ జిల్లాలో కలెక్టర్, అధికారులపై గ్రామస్తులు ఆవేదనతో దాడి చేశారని పేర్కొన్నారు. తమ భూములు పోతాయే ఆవేదనతోనే అధికారులను అడ్డుకున్నారని పేర్కొన్నారు.