అప్పుడు నల్లగడ్డం...ఇపుడు తెల్లగడ్డం !

ఏపీలో అభివృద్ధి మీద ఎవరూ దృష్టి సారించడం లేదు అని ఆయన విమర్శించారు. మద్యం వ్యాపారాన్ని హోల్ సేల్ మాఫియాగా చేసి జగన్ నాడు దోచుకుంటే ఇపుడు కూటమి ప్రభుత్వం సిండికేట్ల పరం చేస్తోందని అన్నారు.

Update: 2024-10-12 03:34 GMT

ఇది సినిమా టైటిల్ అనుకుంటున్నారా కానే కాదు, పక్కా పొలిటికల్ సెటైర్. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడితే పంచులు అలాగే పడతాయి. ఆయన విమర్శలు అలా ఉంటాయి. ఆయన జోకులు పేలుస్తూ ప్రత్యర్ధుల మీద చాలా ఈజీగా విమర్శల బాణాలు వేస్తూంటారు.

ఇపుడు అదే ఒరవడిలో ఆయన ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ కూటమి మీదనే తమ బాణాలను ఎక్కుపెట్టారు. ఏపీలో అధికారం మారింది. ఏమున్నది గర్వకారణం, ప్రజలకు ఏమి మేలు జరిగిందని అని నిట్టూర్పులు విడిచారు ఈ కమ్యూనిస్టు నాయకుడు. బుర్రలు మారాయి. వారు వెళ్ళారు, వీరు వచ్చారు. అపుడు నల్ల గడ్డం, ఇపుడు తెల్ల గడ్డం అంతే తేడా అని చాలా సింపుల్ గా తేల్చి పారేశారు.

ఏపీలో అభివృద్ధి మీద ఎవరూ దృష్టి సారించడం లేదు అని ఆయన విమర్శించారు. మద్యం వ్యాపారాన్ని హోల్ సేల్ మాఫియాగా చేసి జగన్ నాడు దోచుకుంటే ఇపుడు కూటమి ప్రభుత్వం సిండికేట్ల పరం చేస్తోందని అన్నారు. మద్యాన్ని ఆదాయ వనరుగా చూడడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీలో ఉచిత ఇసుక అని బిల్డప్ ఇస్తున్నారు తప్ప ఎక్కడా ఉచిత ఇసుక దొరకడం లేదని ఆయన కూటమి పెద్దలకు గట్టిగానే వేసుకున్నారు. మూడు నెలలలో ఎంతో చేశామని ఎందుకు హడావుడి చేస్తున్నారని కసురుకున్న్నారు.

ప్రత్యేక హోదా కేంద్రాన్ని అడగడానికి బాబుకు ఉన్న అభ్యంతరం ఏమిటని ఆయన నిలదీశారు. దీని మీద సన్నాయి నొక్కులు మాత్రం నొక్కుతున్నారని ఎద్దేవా చేశారు. ఇక జగన్ మీద కోపంతోనే చంద్రబాబు శ్రీవారి లడ్డూ ఇష్యూని తెచ్చారని అన్నారు. అయితే అది రాజకీయంగా ఆరెస్సెస్ కి బాగా ఉపయోగపడిందని టీడీపీకి మాత్రం ఏమీ లేదని అన్నారు.

సనాతన ధర్మం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. సనాతన ధర్మం అన్నది రాజ్యానికి విరుద్ధమైన డిమాండ్ అని దానిని అమలు చేయమనడమేంటని గుస్సా అయ్యారు.

చంద్రబాబు ఏపీలో అద్భుతాలు చేస్తామని ప్రకటించడం కరెక్ట్ కాదని ఆయన వద్ద ఏమైనా మాయలు మంత్రాలు ఉన్నాయా అని నారాయణ ప్రశ్నించారు. ఏపీ పరిస్థితి అందరికీ తెలిసిందే అని ఆయన అన్నారు. మొత్తానికి చూస్తే నిన్న సీపీఎం నేడు సీపీఐ నేతలు కూటమి మీద పెద్ద ఎత్తున ఆడిపోసుకుంటున్నారు.

వారికి ఎందుకో కూటమి పాలన మూడు నెలలకే నచ్చడం లేదు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అయితే అపుడే జనంలో వ్యతిరేకత వచ్చిందని అంటే నారాయణ ఏపీలో ప్రభుత్వం మాత్రమే మారిందని ఏమీ మార్పు జరగలేదని ఘాటు విమర్శలు చేశారు. ఎర్రన్నలు ఈ తీరుగా విమర్శలు చేస్తూంటే కూటమికి ఇరకాటంగానే ఉంటోంది. వైసీపీ విమర్శలను తిప్పికొడుతున్న కూటమి పెద్దలు కామ్రేడ్స్ ని ఏమీ అనలేకపోతున్నాయి. చూడాలి మరి రానున్న రోజులలో ఎర్రన్న స్వరం మరింత బిగ్గరగా మారితే అపుడు ఏమైనా కూటమి వైపు నుంచి కౌంటర్లు వస్తాయేమో.

Tags:    

Similar News