బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్న కామ్రేడ్స్ !

ఆ పార్టీ పూర్తిగా సంప్రదాయవాదులకు నచ్చిన పార్టీ. వారి ఆలోచనలను నెగ్గించే పార్టీ. బీజేపీ పొడ గిట్టనిది వామపక్ష వాదం.

Update: 2024-05-20 03:43 GMT

దేశంలో కామ్రేడ్స్ ని వామపక్ష వాదులు అంటారు. అంటే కుడిపక్షం సంప్రదాయ వాదం అయితే దానికి భిన్నమైన వైఖరిని వారు తీసుకుంటున్నారు కాబట్టి అలా వామపక్షాలుగా పేరు స్థిరపరచుకున్నారు. కుడి వైపు భావజాలాన్ని పుష్కలంగా అందిపుచ్చుకున్న పార్టీ బీజేపీ.

ఆ పార్టీ పూర్తిగా సంప్రదాయవాదులకు నచ్చిన పార్టీ. వారి ఆలోచనలను నెగ్గించే పార్టీ. బీజేపీ పొడ గిట్టనిది వామపక్ష వాదం. బీజేపీ నీడ కూడా పడకూడదు అనుకుంటారు. అంతదాకా ఎందుకు దేశంలో బీజేపీ ఉండకూడదు అని వామపక్షాలు బలంగా కోరుకుంటున్నాయి.

కానీ చిత్రాతిచిత్రంగా ఏపీలో మాత్రం బీజేపీ భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాయి. నిజంగా ఇది వామపక్ష భావజాలానికి పూర్తిగా విరుద్ధమైన కోరిక. అయితే దానిని బహు చక్కగా కామ్రేడ్స్ సమర్ధించుకుంటున్నాయి. నిన్నటికి నిన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.

నేడు దానికి కొనసాగింపుగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ ఏపీలో ప్రభుత్వం మారుతుందని వైసీపీ ఓడిపోతుందని చెప్పారు. అంతవరకూ బాగానే ఉన్నా వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వం అనలేదు. కనీసం మాటవరసకి అయినా ఆ భావనను వ్యక్తం చేయలేదు. ఏపీలో వచ్చేది టీడీపీ ప్రభుత్వం అన్నారు.

అంటే అందులో బీజేపీ కూడా ఉంది. రేపటి రోజున టీడీపీ కూటమి అధికారం చేపడితే మంత్రి పదవులు బీజేపీకి కూడా ఇస్తారు. గతంలోనూ అదే జరిగింది. అలా బీజేపీతో అధికారం పంచుకునే ప్రభుత్వం ఏపీలో రావాలని నారాయణ కోరుకుంటున్నారా అన్న చర్చ సాగుతోంది.

అయితే దీనికి నారాయణ కూడా తనదైన శైలిలో లాజికల్ గా సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడానికి కారణం వైసీపీ తప్ప మరోటి కాదని అన్నారు. వైసీపీ మీద జనాలకు ఉన్న విపరీతమైన కోపంతోనే వారు టీడీపీ కూటమిని గెలిపిస్తున్నారు అన్నారు. అంతే తప్ప ఇందులో మోడీ గొప్పతనం ఏమీ లేదని అన్నారు.

మోడీకి క్రెడిట్ నారాయణ ఇచ్చినా ఇవ్వకపోయినా కూటమిలో బీజేపీని ఆయన కాదనలేరు కదా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం వస్తే కచ్చితంగా బీజేపీ పాత్ర కూడా రాజకీయంగా మరింతగా పెరుతుంది మరి ఆ భావజాలానికి పూర్తి వ్యతిరేకం అంటున్న నారాయణ ఈ విధంగా కోరుకోవడం ఏంటి అని అంటున్నారు.

ఆ కోరిక ఏదో తీరిన తీరకపోయినా ఏపీలోనూ ఇండియా కూటమే వస్తుందని చెబితే సిద్ధాంతాలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అని అంటున్నారు. ఏపీకి మోడీ చేసిన ద్రోహం ఎవరూ చేయలేదని ఆయనే అన్నింటికీ కారణం అని చెబుతూ అదే నోటితో బీజేపీ భాగస్వామ్య ప్రభుత్వం ఏపీలో రావాలని దీవిస్తున్న నారాయణ తీరుని ఏమనాలో అన్నదే మేధావులకు అంతు పట్టని ప్రశ్న అని అంటున్నారు.

Tags:    

Similar News