మోదీది ఫాసిస్టు సర్కారు కాదు.. సీపీఎం వైఖరిలో చారిత్రక మార్పు
ఈ దేశంలో బద్ధ విరోధ పార్టీలు ఏవైనా రెండు ఉన్నాయంటే అవి బీజేపీ- లెఫ్ట పార్టీలు. బీజేపీ నాయకులతో కనీసం ఒకే వేదిక మీద ఉండేందుకు కూడా ఇష్టపడదు లెఫ్ట్ పార్టీ నాయకత్వం.
ఈ దేశంలో బద్ధ విరోధ పార్టీలు ఏవైనా రెండు ఉన్నాయంటే అవి బీజేపీ- లెఫ్ట పార్టీలు. బీజేపీ నాయకులతో కనీసం ఒకే వేదిక మీద ఉండేందుకు కూడా ఇష్టపడదు లెఫ్ట్ పార్టీ నాయకత్వం. వాస్తవానికి 1990కి ముందు ఈ రెండు పార్టీలు మిత్రపక్షాలు గానే ఉండేవి. కాంగ్రెస్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉండేవి. అంతెందుకు..? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1982లో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీకి కమ్యూనిస్టులు, బీజేపీ మద్దతు పలికాయి.
అయోధ్య రామమందిర ఉద్యమాన్ని బీజేపీ తలకెత్తుకోవడంతో వామపక్షాలు ఆ పార్టీకి దూరంగా జరిగాయి. మతతత్వ పార్టీ అంటూ బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించడం ప్రారంభించాయి. మరోవైపు దశాబ్దాలుగా వ్యతిరేకించిన కాంగ్రెస్ కు అప్పటినుంచి దగ్గరయ్యాయి. ఇప్పటికీ వామపక్ష మీడియాకు బీజేపీ వాసన కూడా గిట్టదు. మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా తీవ్రంగా నిరసిస్తుంటాయి.
వామపక్షాలు అంటే సీపీఎం, సీపీఐ, ఫార్వర్డ్ బ్లాక్ ఇంకా పలు పార్టీలు ఉన్నాయి. వీటిలో పెద్దన్న సీపీఎం. కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని తీవ్ర నిరంకుశ జాతీయవాద (ఫాసిస్టు) శక్తిగా పేర్కొంటూ విరుచుకుపడే ఆ పార్టీ ఇప్పుడు తన వైఖరి మార్చుకుందా? అనిపిస్తోంది. మోదీ సర్కారుపై ఫాసిస్టు ముద్ర వేసేందుకు నిరాకరిస్తోందని తెలుస్తోంది.
అయితే, ఫాసిస్టు అని కాకుండా మోదీ సర్కారుకు నయా-ఫాసిస్టు అని కొత్త భాష్యం చెబుతోంది సీపీఎం. ఈ మేరకు పార్టీ ముసాయిదా తీర్మానంలో పేర్కొంది. మోదీ సర్కారును ఫాసిస్టు అని అనకుండా సీపీఎం ఆగిపోవడంపై సోదర కమ్యూనిస్టు పక్షం సీపీఐ ఆగ్రహం వ్యక్తంచేస్తోంది.
తమిళనాడు మదురైలో ఏప్రిల్ లో సీపీఎం జాతీయ కాంగ్రెస్ జరుగనుంది. అందులో ఆమోదించే విశ్లేషణాత్మక రాజకీయ తీర్మానం ముసాయిదాను చర్చ కోసం సీపీఎం కేంద్ర కమిటీ ఇటీవల రాష్ట్ర కమిటీలకు పంపింది. మోదీ సర్కారును సీపీఐ ఫాసిస్టు ప్రభుత్వం అని అంటుంది. దేశంలోకి ఫాసిజం వచ్చేసిందని మరో వామపక్షం సీపీఐ-ఎంఎల్ అభివర్ణిస్తుంది.
అయితే, సీపీఐ, సీపీఐ-ఎంఎల్ లకు భిన్నంగా సీపీఎం తన రాజకీయ ముసాయిదాలో పేర్కొంది. ఇటలీ, జర్మనీ నియంతలు ముస్సోలినీ, హిట్లర్ నాటి ఫాసిజాన్ని క్లాసికల్ ఫాసిజంగా చెబుతూ.. ఆ తర్వాత వచ్చినవి అన్నీ ‘నియో-ఫాసిజం’గా వర్గీకరించింది. మోదీ సర్కారును ఇప్పుడు ఈ కేటగిరీలోనే చేర్చింది.
‘సామ్రాజ్యవాద అంతర్గత వైరుధ్యాల వల్ల క్లాసికల్ ఫాసిజం పుట్టగా.. నయా ఉదారవాద సంక్షోభం కారణంగా నయా-ఫాసిజం ఆవిర్భవించింది’ అని సీపీఎం కొత్తగా నిర్వచించింది. బీజేపీ సిద్ధాంతకర్త ఆర్‌ఎస్ఎస్‌ను ఫాసిస్టు లక్షణాలున్న సంస్థగా సీపీఎం నిందిస్తుంది. మోదీ ప్రభుత్వాన్ని మాత్రం ఆ కేటగిరీలో చేర్చలేమని.. భారత్ ను నయా ఫాసిస్టుగా చిత్రీకరించొద్దని తీర్మానంలో అభిప్రాయపడింది.
సీపీఎంలో ఈ అనూహ్య మార్పున సీపీఐ తీవ్రంగా తప్పుబడుతోంది. ఆ పార్టీ తీర్మానాన్ని సవరించుకోవాలని సీపీఐ కేరళ కార్యదర్శి వినయ్ విశ్వం అన్నారు. సీపీఎం ఆలస్యంగానైనా నిజాన్ని గ్రహించిందని.. ఇది మంచి మార్పు అని బీజేపీ పేర్కొంది.