రాజధాని లేకుండా చేసిన పాపం ఆ ఇద్దరిదే !

చంద్రబాబు ఎపుడూ గొప్పగా చెప్పుకుంటూ ఉండేది అమరావతి రాజధాని గురించే.

Update: 2024-04-29 03:49 GMT

చంద్రబాబు ఎపుడూ గొప్పగా చెప్పుకుంటూ ఉండేది అమరావతి రాజధాని గురించే. మరోసారి టీడీపీ అధికారంలోకి వస్తే అమరావతి చుట్టూనే అంతా తిప్పుతారు అన్నది కూడా జనాలకు తెలిసిందే. అయితే బాబు లో ప్రొఫైల్ మెయిన్ టెయిన్ చేస్తున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో మాత్రమే ఆ విషయం గురించి మాట్లాడుతున్నారు. మిగిలిన చోట్ల ఆ ఊసు కనీసం ఎత్తడం లేదు.

ఇదంతా ఒక స్ట్రాటజీ ప్రకారమే అని అంటున్నారు. ఎందుకంటే రాయలసీమ ఉత్తరాంధ్రా ప్రజానీకానికి అమరావతి రాజధాని అంటే తమ ప్రాంతాల సంగతేంటని ప్రశ్నిస్తారు. పైగా వైసీపీ వికేంద్రీకరణ అంటూ దాడి చేయడానికి కాచుకుని కూర్చుంది. అందుకే అమరావతి ఇష్యూని పెద్దగా టీడీపీ అధినేత ఎత్తడం లేదు అని అంటున్నారు.

అయితే ఆయన ఎత్తకపోయినా విపక్షాలు మాత్రం దానిని ఎన్నికల అజెండా చేయడానికే చూస్తున్నాయి. మూడు రాజధానులకు కట్టుబడి ఉంటామని వైఎస్ జగన్ మరోసారి ఎన్నికల మ్యానిఫేస్టోలో పెట్టడంతో ఇపుడు ఈ ఇష్యూ మళ్లీ రాజుకుంటోంది. దీని మీద కామ్రేడ్స్ కన్నెర్ర చేస్తున్నారు. ఏపీకి రాజధాని రాకపోవడానికి లేకపోవడానికి కారణం చంద్రబాబు జగన్ ఇద్దరూ అని అంటున్నారు. వీరి వల్లనే రాష్ట్ర ప్రగతి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉందని వారు దుయ్యబెడుతున్నారు.

అమరావతి రాజధాని అంటూ భ్రమలు కల్పించడమే చంద్రబాబు చేసిన అతి తప్పు అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మండిపడ్డారు. తాము ఆనాడే అమరావతి రాజధానికి కేవలం అయిదారు వేల ఎకరాలు చాలు అని చెప్పామని ఆయన గుర్తు చేశారు. వాటిలో కనుక రాజధాని నిర్మించి ఉంటే ఎపుడో పూర్తి అయ్యేదని అన్నారు. అదే కనుక జరిగి ఉంటే అమరావతి రాజధాని మార్చే అవకాశం ఉండేది కాదన్నారు.

కానీ అలా కాకుండా ప్రజలను త్రిశంకు స్వర్గంలో టీడీపీ ఉంచితే అసలు రాజధాని లేకుండా వైసీపీ చేసిందని ఆయన విమర్శించారు. విశాఖపట్నం రాజధాని అంటున్న వైసీపీ రిషికొండకు బోడిగుండు కొట్టి 500 కోట్ల రూపాయలతో కోట్లతో గెస్ట్‌హౌస్‌ నిర్మించింది తప్ప ఎలాంటి అభివృద్ధి సాధించలేదన్నారు.

బాబు జగన్ ఇద్దరు కలిసి అమరావతి రాజధాని వాసులను నాశనం చేసి రైతులను వీధి పాలు చేసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారని చెప్పారు. ల్యాండ్‌ పూలింగ్‌తో చంద్రబాబు రైతులను అన్యాయం చేస్తున్నారని తాము ఆనాడే చెప్పామని తెలిపారు. ప్రస్తుతం రైతులు భూములు కోల్పోయారని, అక్కడ పంటలు లేవని, వారికి ప్లాట్లు రాలేదన్నారు. మొత్తం మీద చూస్తే ఏపీలో రాజధాని వివాదం మరోసారి ఎన్నికల్లో కీలక అంశంగా మారే అవకాశం ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News