ఇకపై క్రికెటర్ సిరాజ్... డిప్యూటీ సూపరిండెంటెంట్ ఆఫ్ పోలీస్!
టీమిండియా క్రికెటర్, హైదరాబాదీ.. మహ్మద్ సిరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
టీమిండియా క్రికెటర్, హైదరాబాదీ.. మహ్మద్ సిరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెస్ట్, వన్డే, టీ20, ఐపీఎల్ అనే తారతమ్యాలేమీ లేకుండా తనదైన బౌలింగ్, ఫీల్డింగ్ పెర్ఫార్మెన్స్ తో సిరాజ్ తనదైన ప్రతిభ కనబరుస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి తెలంగాణ ప్రభుత్వ అద్భుతమైన బహుమతులు ఇచ్చింది!
అవును... హైదరాబాదీ, టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ కు ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో... ఈ ఏడాది ఆగస్టు నెలలో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 78లో 600 చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వ్యులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తాజాగా సిరాజ్ కు డిప్యూటీ సూపరిండెంటెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) పోస్ట్ కేటాయించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్.. సిరాజ్ కు డీఎస్పీ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖకు మహ్మద్ సిరాజ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కాగా... ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ ను గెలిచిన అనంతరం హైదరాబాద్ కు చేరిన సిరాజ్.. సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సిరాజ్ ను సీఎం రేవంత్ ఘనంగా సన్మానించారు. సిరాజ్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో అద్భుతమైన ప్రతిభ ప్రదర్శించాడని.. అందుకే నేడు అత్యున్నత స్థాయి క్రికెటర్లలో ఒకడిగా ఉన్నాడని ప్రశంసించారు.