ఆ సంక్షేమ రాజ్యంలో.. తీవ్ర పెట్రోల్ సంక్షోభం.. లీటరు రూ.500
అది కూడా ఏకంగా 500 శాతంపైగా పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రజలు షాక్ తిన్నారు. క్యూబాలో ఫిబ్రవరి 1 నుంచి పెట్రోల్ ధరల పెంపు అమల్లోకి రానుంది.
భారతీయులకు భావోద్వేగ పరంగా బాగా దగ్గరైన దేశం అది.. ఒకప్పుడు విద్య వైద్యంలో సంక్షేమ రాజ్యానికి చిరునామా.. వామపక్ష ప్రభుత్వానికి శాశ్వత వేదిక.. ద్వీప దేశమే అయినా.. చక్కటి ఆర్థిక వ్యవస్థ.. అగ్ర రాజ్యానికి ఎదురొడ్డి పోరాడిన మనుగడ సాగించిన చరిత్ర దానిది.. అలాంటి దేశంలో వస్తువుల ధరలపై నియంత్రణ ఉండేది. కానీ రానురాను పరిస్థితి మారింది. సంక్షేమ రాజ్యం కమ్యూనిస్టు దేశం కాస్త అవస్థలను ఎదుర్కొనాల్సి వస్తోంది.
క్యాస్ట్రో దేశంలో..
భారతీయులకు అత్యంత బాగా తెలిసిన పేరు క్యాస్ట్రో. ఫిడేల్ క్యాస్ట్రో అంటే క్యూబా.. క్యూబా అంటే ఫిడేల్ క్యాస్ట్రో.. రెండూ విడదీయరాని పేర్లుగా స్థిరపడిపోయాయి. క్యాస్ట్రో అధికారంలో ఉండగా ఓ దశలో అమెరికానూ ఎదిరించింది క్యూబా. ఆయనను హత్య చేసేందుకు అన్నంలో విషం కలపడం, ఆయన తాగే చుట్టలో బాంబు పెట్టడం సహా అనేక ప్రయత్నాలు జరిగాయి. 638 సార్లు ఇలాంటి హత్యా ప్రయత్నాల నుంచి క్యాస్ట్రో బయటపడ్డట్లు చెబుతారు. కానీ, వీటన్నిటినీ తట్టుకున్న క్యాస్ట్రో క్యూబాను నిలబెట్టారు. కాగా, ఆయన హయాంలో క్యూబా ప్రజా జీవనానికి సంబంధించిన అనేక సూచీల్లో మెరుగ్గా ఉండేది. క్యాస్ట్రో 2008లోనే అధ్యక్ష పదవి నుంచి దిగిపోయి తమ్ముడు రౌల్ క్యాస్ట్రోను కూర్చోబెట్టారు. ఇప్పుడు మిగుల్ డియాజ్ కనెల్ అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రస్తుతం క్యూబా ఆర్థిక సంక్షోభంలో ఉంది.
కరీబియన్ దీవుల్లో..
క్రికెటర్ లో వెస్టిండీస్ కారణంగా భారతీయులకు కరీబియన్ దీవులు పరిచయమే. ఆ కరీబియన్ దీవులకు దగ్గర్లోనే ఉంటుంది క్యూబా. తీవ్ర ద్యవ్య లోటుతో కొట్టుమిట్టాడుతూ వస్తోంది. దానిని తగ్గించేందుకు పెట్రోల్ ధరల పెంపును అస్త్రంగా చేసుకుంది ప్రభుత్వం. అది కూడా ఏకంగా 500 శాతంపైగా పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రజలు షాక్ తిన్నారు. క్యూబాలో ఫిబ్రవరి 1 నుంచి పెట్రోల్ ధరల పెంపు అమల్లోకి రానుంది. ఇక్కడ ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర 25 క్యూబన్ పెసోలు (కరెన్సీ పేరు)గా ఉంది. ఇకపై అది 132 పెసోలకు (రూ.450 పైమాటే) చేరనుంది. ప్రీమియం పెట్రోల్ ధర 30 పెసోల నుంచి 156 పెసోలకు పెరగనుంది. మున్ముందు డీజిల్, ఇతర ఇంధన ధరలు కూడా పెరగనున్నాయని క్యూబా ఆర్థిక మంత్రి రెగ్యురో తెలిపారు. ఇళ్లకు విద్యుత్ ఛార్జీలను కూడా 25 శాతం పెంచబోతున్నట్లు చెప్పారు.
విదేశీ నిల్వలను పెంచుకుని..
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి చమురు కొనేందుకు.. విదేశీ కరెన్సీని పెంచుకోవాలని క్యూబా చూస్తోంది. ఇందుకోసం, కొన్ని పెట్రోల్ బంకుల్లో అమెరికా డాలర్లతో మాత్రమే లావాదేవీలు సాగేలా నిర్ణయం తీసుకుంది. కాగా, క్యూబా గతంలో సంక్షేమ రాజ్యమని చెప్పుకొన్నాం కదా.. అప్పట్లో పెట్రోల్, డీజిల్ ను సబ్సిడీపై అమ్మేవారు. కరోనాతో అన్ని దేశాల్లోలాగే క్యూబా ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలైంది. ఇటీవల అమెరికా ఆంక్షలు కఠినం చేసింది. ఫలితంగా సంక్షోభం నెలకొంది. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి.