రాజ్యసభలో కరెన్సీ నోట్ల కలకలం.. ఆ కాంగ్రెస్ ఎంపీ ఇరుక్కున్నట్లేనా?
రాజ్యసభలో కరెన్సీ నోట్లు కలకలం రేపాయి. ఒక్కసారిగా కట్టలు బయట పడడంతో గందరగోళం నెలకొంది.
రాజ్యసభలో కరెన్సీ నోట్లు కలకలం రేపాయి. ఒక్కసారిగా కట్టలు బయట పడడంతో గందరగోళం నెలకొంది. అన్ని కూడా రూ.500 నోట్ల కట్టలే కావడంతో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ కడ్ విచారణకు ఆదేశించారు.
కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీ సీటు దగ్గర రూ.500 నోట్ల కట్టలు వెలుగుచూశాయి. వీటివిలువ రూ.50వేల వరకు ఉంటుంది. అయితే.. దొరికిన నగదు ఎవరిది..? ఎక్కడి నుంచి వచ్చింది..? అనే కోణంలో విచారణ చేపట్టినట్లు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ కడ్ తెలిపారు. కాగా.. అభిషేక్ మను సింఘ్వీ సీటు దగ్గర ఈ నోట్ల కట్టలు దొరకడంపై పెద్ద దుమారమే రేపుతోంది.
ఈ నగదును ఎవరు తీసుకొచ్చారు..? ఎందుకోసం తీసుకొచ్చారు..? అనే కోణంలో విచారణ చేపట్టారు. మరోవైపు.. ఈ నోట్ల కట్టలు నిన్న అభిషేక్ మను సింఘ్వీ సీటు సమీపంలో లభించినట్లు రాజ్యసభ చైర్మన్ తెలిపారు. అందుకే.. దీనిపై ఎంక్వయిరీ ప్రారంభించినట్లు రాజ్యసభ సెక్రటరీ సైతం వెల్లడించారు. అయితే.. డబ్బులు దొరకడంతో అభిషేక్‌పై సహచర ఎంపీలు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా.. ఈ డబ్బులు తనవి కావు అంటూ కాంగ్రెస్ ఎంపీ వాదనకు దిగారు.
ఇక.. అభిషేక్ మను సింఘ్వీ విషయానికొస్తే.. ఆయన ఇటీవలే తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ నేతగా ఉండి, రాజ్యసభ పక్షనేతగా కొనసాగిన కే.కేశవరావు రాజీనామా చేశారు. దాంతో ఈ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో అభిషేక్ పోటీపడ్డారు. దీంతో ఆయన తెలంగాణ నుంచి పెద్దల సభకు వెళ్లారు. గతంలో 2009 లోక్‌సభ ఎన్నికలకు ముందు మన్మోహన్ సింగ్ అవిశ్వాస తీర్మానంలో కొంతమంది బీజేపీ ఎంపీలు నోట్ల కట్టలతో లోక్‌సభలోకి వచ్చారు. దాంతో అప్పట్లో ఆ అంశం పెద్ద దుమారమే రేపింది. ఇప్పుడు కూడా నోట్ల కట్టలు బయటపడడంతో సభలో తీవ్ర చర్చనీయాంశమైంది.