పుష్ప-2 ఘటన: బాలుడి బ్రెయిన్ డ్యామేజ్.. ఖర్చులపై సీపీ కీలక వ్యాఖ్యలు!

ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు సుమారు 13 రోజులుగా హాస్పటల్ లో చికిత్స పొందుతున్నాడు.

Update: 2024-12-17 15:58 GMT

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద ‘పుష్ప-2’ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన ఘటన తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు సుమారు 13 రోజులుగా హాస్పటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ సందర్భంగా ఆ బాలుడిని హైదరాబాద్ సీపీ పరామర్శించారు.

అవును... ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్ కు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. సుమారు 13 రోజులుగా బాలుడికి చికిత్స అందిస్తున్నారు. ఈ సమయంలో బాలుడు కోలుకోవడానికి మరింత సమయం పట్టొచ్చని అంటున్నారు.

ఈ నేపథ్యంలో మంగళవారం కిమ్స్ ఆస్పత్రికి వచ్చిన హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్.. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినాతో కలిసి బాలుడు శ్రీతేజ్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా బాలుడి పరిస్థితిని వెల్లడించారు. ఇందులో భాగంగా... శ్రీతేజ్ కోలుకునేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా స్పందించిన సీపీ... 13 రోజులుగా బాలుడికి చికిత్స కొనసాగుతోందని.. ప్రస్తుతం వెంటిలేటర్ సాయంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. డిసెంబర్ 4న జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ కు బ్రెయిన్ డ్యామేజ్ అయ్యిందని.. ప్రస్తుతం వెంటిలెటర్ సాయంతో ఆక్సిజన్ అందిస్తున్నారని తెలిపారు.

ఈ నేపథ్యంలోనే... వైద్య ఖర్చులను ఎవరు చెల్లిస్తారనే విషయాన్ని సీపీ వెల్లడించారు. ఈ సందర్భంగా... అల్లు అర్జున్ టీమ్ బాలుడి వైద్య ఖర్చులు భరిస్తోందా అనే ప్రశ్నకు సమాధానంగా స్పందించిన ఆయన... ప్రభుత్వమే మొత్తం వైద్య ఖర్చులు చెల్లిస్తుందని చెప్పడం గమనార్హం!

కాగా.. ఇటీవల అల్లు అర్జున్ విడుదల చేసిన వీడియోలో బాలుడి వైద్య ఖర్చులను తాము భరిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.

మరోపక్క... సంధ్య థియేటర్ కు సీపీ సీవీ ఆనంద్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 'పుష్ప-2' బెనిఫిట్ షో సందర్భంగా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల జరిగిన ఘటనపై లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలంటూ నోటీసులు జారీ చేశారు. దీనిపై పది రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో సిటీ పోలీస్ కమీషనర్ పేర్కొన్నారు!

Full View
Tags:    

Similar News