ఆప్ సర్కారు అక్రమాలపై వేట.. శీష్ మహల్ పై దర్యాప్తుతో షురూ

ఈ క్రమంలో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయనేది ప్రధాన ఆరోపణ. దీంతో విచారించి సమగ్ర నివేదిక తయారుచేయాలని కేంద్ర ప్రజాపనుల విభాగాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది

Update: 2025-02-15 09:30 GMT

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన సరిగ్గా వారం రోజులకు..

ఢిల్లీలో ఇంకా కొత్త ప్రభుత్వం ఏర్పడకముందే.. గత సర్కారు నిర్ణయాలపై దర్యాప్తు మొదలైంది. అది కూడా ఎన్నికల్లో ప్రధాన ప్రచార అంశంగా నిలిచిన అద్దాల మేడ (శీష్ మహల్) నుంచి షురూ అయింది.. కేజ్రీవాల్ సీఎంగా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలను తిరగదోడడం ప్రారంభించారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఉన్న సమయంలో చేపట్టినదే శీష్‌ మహల్‌ పునరుద్ధరణ. ఈ క్రమంలో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయనేది ప్రధాన ఆరోపణ. దీంతో విచారించి సమగ్ర నివేదిక తయారుచేయాలని కేంద్ర ప్రజాపనుల విభాగాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

ఆప్ అధినేత కేజ్రీ సీఎంగా ఉన్న సమయంలో ఆయన అధికారిక నివాసమే శీష్ మహల్. కేంద్ర ప్రజాపనుల విభాగం (సీపీడబ్ల్యూడీ) వాస్తవ నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఈ నెల 13నే విచారణకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 8 ఎకరాల విస్తీర్ణంలో 6 ఫ్లాగ్‌ స్టాఫ్ బంగ్లా పునరుద్ధరణలో ఆప్‌ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించింది అనే ఆరోపణల మీదవిచారించి సమగ్ర నివేదిక ఇవ్వాలని సీపీడబ్ల్యూడీకి కేంద్రం నిర్దేశించింది.

సీఎం అధికారిక నివాసానికి చుట్టుపక్కల ఉన్న నాలుగు ప్రభుత్వ ఆస్తులను చట్టవిరుద్ధంగా విలీనం చేసి అత్యంత విలాసంగా శీష్‌ మహల్‌ ను విస్తరించారని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌ దేవా మూడు రోజుల కిందట ఆరోపించారు. ఆ ఆస్తుల విలీనాన్ని రద్దు చేయాలని కోరుతూ లెఫ్టినెంట్ గవర్నర్‌ వీకే సక్సేనాకు లేఖ కూడా రాశారు. తమ ప్రభుత్వ ఏర్పాటయ్యాక సీఎం శీష్‌ మహల్‌లో ఉండబోరని పేర్కొన్నారు.

ఢిల్లీలోని 6 ఫ్లాగ్‌ స్టాఫ్‌ రోడ్‌ లో ఉన్న ప్రభుత్వ బంగ్లాను కేజ్రీ సీఎంగా ఉన్న సమయంలో అధికారిక నివాసంగా వినియోగించారు. అతి సాధారణ సీఎం అని చెప్పుకొనే కేజ్రీని ఉద్దేశించి ఎద్దేవా చేస్తూ దీనిని ‘శీష్‌ మహల్‌ (అద్దాల మేడ)’గా బీజేపీ ఎత్తిపొడిచింది. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి సెవెన్ స్టార్‌ రిసార్ట్‌ గా మార్చుకున్నారని ఆరోపించింది.

10 ఏళ్ల పాలనలో 4 కోట్ల మందికి ఇళ్లు కట్టించిన తాను.. అద్దాల మేడ కట్టుకోలేదంటూ ప్రధాని మోదీ కూడా ఎన్నికల ప్రచారంలో దుయ్యబట్టారు.

Tags:    

Similar News