తినకపోయినా ఏం పర్లేదు... పెరిగిన ధరలపై మంత్రి వ్యాఖ్యలు!
కొనే స్తోమత లేని వారికి నాలుగు నెలల పాటు ఉల్లిపాయలను తినకున్నా పెద్దగా నష్టమేమీ ఉండదని మహారాష్ట్ర మంత్రి దాదా భూసే (షిండే వర్గం) వ్యాఖ్యానించారు.
ఈ మధ్యకాలంలో ప్రజాసేవకులు, రాజకీయ నాయకులు అనే పదాలకు అర్ధం పూర్తిగా మారిపోయేలా ప్రవర్తిస్తున్నారు కొంతమంది నేతలు! రోజు రోజుకీ శృతిమించుతున్నారు.. గతితప్పిన మాటలు మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర మంత్రులు వరుసగా అవివేకంతో కూడిన బాధ్యతారాహిత్యపు మాటలు మాట్లాడుతున్నారనే కామెంట్లు సొంతం చేసుకుంటున్నారు.
అవును... గతకొంతకాలంగా దేశ వ్యాప్తంగా టమాటా ధర సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. ఆకాశాన్నంటిన ఆ ధర కొంతమంది రైతులులను కోటీశ్వరలను చేస్తే... కోట్ల మంది సామాన్యులకు కన్నీటిని మిగిల్చింది. ఈ సమయంలో అనధికారికంగా లాభపడినవారి సంగతి కాసేపు పక్కనపెడితే... తాజాగా ఉల్లిపాయలపై ఇలాంటి చర్చ మొదలైంది!
వివరాళ్లోకి వెళ్తే... కొనే స్తోమత లేని వారికి నాలుగు నెలల పాటు ఉల్లిపాయలను తినకున్నా పెద్దగా నష్టమేమీ ఉండదని మహారాష్ట్ర మంత్రి దాదా భూసే (షిండే వర్గం) వ్యాఖ్యానించారు. ఉల్లిపాయలపై 40 శాతం ఎగుమతి సుంకం విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు, వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో ఈయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
2023, డిసెంబర్ 31 వరకు ఉల్లిపాయలపై ఎగుమతిసుంకాన్ని విధిస్తున్నట్లు ఈ నెల 19న విడుదల చేసిన ప్రకటనలో ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఎగుమతి సుంకం ప్రకటనపై మంత్రి దాదా భూసే స్పందించారు. ఈ సందర్భంగా... పెరిగిన ధరల ప్రకారం కాయగూరలు కొనలేని వారు కొంతకాలం వాటిని తినకపోయినా పర్లేదు అన్నట్లుగా వ్యాఖ్యానించారు!
"మీరు రూ.10 లక్షల విలువైన వాహనాన్ని వినియోగిస్తున్నప్పుడు.. రిటైల్ ధరకంటే రూ. 10 లేదా రూ. 20 ఎక్కువైనా ఉల్లి పాయలను కొనుగోలు చేయవచ్చు. ఉల్లిని కొనుగోలు చేసే స్తోమత లేని వారు రెండు నుండి నాలుగు నెలల పాటు తినకున్నా పెద్ద తేడా ఉండదు" అని అన్నారు మహారాష్ట్ర మంత్రి దాదా భూసే వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇవి వివాదాస్పదమవుతున్నాయి.
కాగా... ఉల్లి ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం 40 శాతం సుంకాన్ని విధించిన సంగతి తెలిసిందే. పెరుగుతున్న ఉల్లి ధరలను కట్టడి చేసి, దేశీయంగా సరఫరాను పెంచేందుకు ఈ చర్యలకు ఉపక్రమించినట్లు కేంద్రం చెబుతోంది. మరోవైపు ఉల్లి ఎగుమతులపై కేంద్రం విధించిన 40 శాతం సుంకం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదే సమయంలో కేంద్రం తీరుకు నిరసనగా దేశంలో పెద్ద ఉల్లి మార్కెట్ అయిన మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉల్లి వ్యాపారులు వేలాన్ని నిలిపివేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈ విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఆ సంగతి అలా ఉంటే... ఇదే మహారాష్ట్రకు చెందిన బీజేపీ మంత్రి... రోజు చేపలు తింటే హీరోయిన్ ఐశ్వర్యరాయ్ కళ్లు లాగా అందంగా ఉంటాయని పేర్కొంటూ నోరుజారిన సంగతి తెలిసిందే. నందుర్బార్ జిల్లాలో జరిగిన మత్య్సకారుల సమావేశంలో రాష్ట్ర గిరిజనశాఖ మంత్రి విజయ్ కుమార్ గవిత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆయనపై ఆన్ లైన్ వేదికగా అటు నెటిజన్లు, ఇటు విపక్షాలు ఉతికి ఆరేస్తుంటే... తాజాగా అదే కేబినెట్ కు చెందిన మరో మంత్రి పెరిగిన ధరలకు అనుగుణంగా కొనుగోలు చేసే శక్తి లేకపోతే.. తినకపోతేనే బెటర్ అంటూ వ్యాఖ్యానించారు!