పవన్, కాపులుపై వైసీపీ నేత కీలక వ్యాఖ్యలు!
తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు
తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో తుని నుంచి ఓడిపోయిన ఈ కాపు నేత కాపులకు రిజర్వేషన్లు కల్పించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ పైనే ఉందన్నారు. ఇటీవల ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను చూసే కాపులు గంపగుత్తగా కూటమికి ఓట్లేశారని దాడిశెట్టి రాజా హాట్ కామెంట్స్ చేశారు.
ఈ నేపథ్యంలో కాపుల్ని బీసీల్లో చేర్పించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ పైనే ఉందన్నారు. రాష్ట్రంతోపాటు కేంద్రంలోనూ ఆయన మాట వినే ప్రభుత్వం ఉందని రాజా గుర్తు చేశారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా తునిలో వైఎస్సార్ విగ్రహానికి దాడిశెట్టి రాజా నివాళులర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన కాపులకు రిజర్వేషన్లు కల్పించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు, yì ప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కు ఉందన్నారు.
కాపులను బీసీల్లో చేర్చడానికి కేంద్రం సానుకూలంగా ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో కాపులను వెనుకబడిన తరగతుల్లో చేర్చాలా లేక ఎఫ్ కేటగిరీలో చేర్చాలా అనేదానిపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతుందని వివరించారు.
కాపులంతా మొన్నటి ఎన్నికల్లో కూటమికి ఓట్లేసిన నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కాపులకు న్యాయం చేయాలని కోరారు. రిజర్వేషన్లు ఇవ్వడానికి కేంద్రం అనుకూలంగా ఉంది కాబట్టి దానిపై ఒత్తిడి తేవాలని కోరారు. కేంద్రం రిజర్వేషన్లు కల్పిస్తే కాపులకు మేలు జరుగుతుందన్నారు. చంద్రబాబు, పవన్ రిజర్వేషన్ కల్పించలేకపోతే కాపులకు వెన్నుపోటు పొడిచినట్టేనని చెప్పారు. కాపుల ఓట్లు వేయించుకుంది వారిద్దరే కాబట్టి రిజర్వేషన్ కూడా వారి బాధ్యతేనన్నారు. ఎలా రిజర్వేషన్లు తెస్తారన్నది తమకు అనవసరమని.. కానీ రిజర్వేషన్లు కల్పించాల్సింది మాత్రం వారేనన్నారు.
ప్రతిపక్షంలో ఉండటం తమకు కొత్త కాదని.. విపక్షంలో ఉండటానికి తమకేమీ ఇబ్బంది లేదని దాడిశెట్టి రాజా తెలిపారు. 2014 నుంచి 2019 వరకు తాము ప్రతిపక్షంలోనే ఉన్నామని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో మరో ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండానికి తమకెలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో దాడిశెట్టి రాజా వ్యాఖ్యలపై కూటమి శ్రేణుల నుంచి సెటైర్లు పడుతున్నాయి. 2019–2024 వరకు అధికారంలో ఉండి వైసీపీ కాపుల రిజర్వేషన్ అంశాన్ని ఎందుకు పట్టించుకోలేదని నిలదీస్తున్నారు. కాపుల మద్దతు వల్లే 2019లో వైసీపీ 151 ఎమ్మెల్యేలను గెలుచుకోగలిగిందని గుర్తు చేస్తున్నారు. కాపుల మద్దతు లేకుండా ఇన్ని స్థానాలు వచ్చేవి కాదంటున్నారు.
మరి ఐదేళ్లు అధికారంలో ఉండి వైసీపీ కాపులకు రిజర్వేషన్లు ఎందుకు తేలేదని నిలదీస్తున్నారు.