పురందేశ్వరి వ్యూహాత్మక మౌనం.. మంచిదేనా ..!
బీజేపీ ఏపీ చీఫ్, సీనియర్ నాయకురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి.. చాలా వ్యూహాత్మకంగా వ్యవహరి స్తున్నారు.
బీజేపీ ఏపీ చీఫ్, సీనియర్ నాయకురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి.. చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అటు నియోజకవర్గంలోనే కాకుండా.. ఇటు కూటమి సర్కారు విషయంలోనూ చాలా ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. నిజానికి ఆమె ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. అనంతపురం నుంచి విశాఖ వరకు.. బీజేపీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధుల విషయం అనేక విమర్శలకు తావిస్తోంది. మరోవైపు.. పార్టీ పరంగా సభ్యత్వాల నమోదు కూడా.. ఆశించినట్టు జరగడం లేదు.
ఆదినారాయణ రెడ్డి నుంచి సీఎం రమేష్ వరకు.. సుజనా చౌదరి నుంచి కామినేని శ్రీనివాస్ దాకా.. ఎవరి దారిలో వారు ప్రయాణిస్తున్నారు. ఎవరూ కూడా పురందేశ్వరి మాట లెక్క చేయడం లేదన్న వాదన పార్టీ వర్గాల్లోనే వినిపిస్తుండడం గమనార్హం. ఇక, గతంలో చక్రం తిప్పిన సోము వీర్రాజు ఇప్పుడు అసలు ఎక్కడ ఉన్నారో.. ఏం చేస్తున్నారో కూడా కనిపించడం లేదు. అలాగే.. వైసీపీ హయాంలో తరచుగా మీడియా ముందుకు వచ్చిన విష్ణు వర్ధన్‌రెడ్డి కూడా.. ఇప్పుడు కనిపించకపోవడం గమనార్హం.
ఇక, విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు బీజేపీ కార్యక్రమాల కంటే కూడా.. టీడీపీ కార్యక్రమాల్లో నే ఎక్కువగా కనిపిస్తున్నారని కమల నాథులే చెప్పుకొంటున్నారు. ఇక, పార్టీ అధిష్టానం చెప్పినట్టుగా సభ్య త్వ నమోదు కూడా ముందుకు సాగడం లేదు. వెరసి ఏపీలో బీజేపీ పరిస్థితి అటు కాయాకాదు.. ఇటు పిందీ కాదు.. అన్న చందంగా తయారైంది. ఒకప్పుడు అంతర్వేది రథం ఘటన జరిగినా.. విజయనగరం జిల్లా రామతీర్థం ఘటన జరిగినా.. బీజేపీ స్పందించింది.
నాయకులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ, ఇప్పుడు తిరుపతి వంటి అతి పెద్ద ఘటన జరిగిన తర్వాత.. కేవలం నాలుగు ముక్కలు ఎక్స్‌లో పోస్టు చేయడం వరకే పురందేశ్వరి పరిమితం అయ్యారు. బాధిత కుటుంబాలను కానీ.. ఇబ్బందులు పడ్డ కుటుంబాలను కానీ.. ఆమె పరామ ర్శించలేక పోయారు. దీంతో పురందేశ్వరి వ్యవహారం ఇటు బీజేపీలోనే కాకుండా రాజకీయంగా కూడా చర్చకు వచ్చింది. మరి ఆమె వ్యూహాత్మకంగా పాటిస్తున్న ఈ మౌనం .. పార్టీకి మంచి చేస్తుందా? చెడు చేస్తుందా? అనేది చూడాలి.