బాబు దగ్గరకే దగ్గుబాటి...అందుకోసమేనా ?

రాజకీయాల్లో ఎవరేమిటి అన్నది కాలం నిర్ణయిస్తుంది. కానీ ఎవరు ఎలా ఎదగాలి అన్నది వారి రాజకీయ వ్యూహాలను బట్టే ఉంటుంది. తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ పెట్టినపుడు పెద్దల్లుడు దగ్గుబాటి ఆయన వెంటే ఉన్నారు.;

Update: 2025-03-02 12:11 GMT

రాజకీయాల్లో ఎవరేమిటి అన్నది కాలం నిర్ణయిస్తుంది. కానీ ఎవరు ఎలా ఎదగాలి అన్నది వారి రాజకీయ వ్యూహాలను బట్టే ఉంటుంది. తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ పెట్టినపుడు పెద్దల్లుడు దగ్గుబాటి ఆయన వెంటే ఉన్నారు. పార్టీ ఊహల్లో నుంచి ఉన్న నాయకుడు ఆయన. మామ గారికి చేదోడు వాదోడుగా ఉంటూ టీడీపీ 1983లో అధికారంలోకి రావడానికి తన వంతు చేయూతను ఇచ్చిన వారుగా దగ్గుబాటిని చెప్పుకోవాలి.

ఆ సమయంలో చంద్రబాబు ఎక్కడ ఉన్నారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా. ఆయన రాజకీయంగా అప్పటికి చాలా అవగాహన ఉన్న వారుగా కనిపిస్తారు. అయితే సొంత మామ పార్టీ పెట్టినపుడు మాత్రం కాంగ్రెస్ ని వీడి రాలేదు. పైగా 1983లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హస్తం గుర్తు మీద పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చేతిలో చంద్రగిరిలో ఓటమి పాలు అయ్యారు.

కట్ చేస్తే ఓటమి తరువాత బాబు టీడీపీలోకి వచ్చారు. అలా మామ దగ్గర మంచి ప్రాపకమే సంపాదించారు. టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ సీఎం గా 1983 నుంచి 1989 దాకా పనిచేసిన కాలంలో పార్టీలో దగ్గుబాటి చంద్రబాబు అని రెండు వర్గాలుగా ఉండేవి. అలా బాబుతో సరిసమానంగా దగ్గుబాటి రాజకీయ హవా చలాయించారు.

ఇద్దరు మధ్య గ్యాప్ కూడా చాలా ఉండేదని ప్రచారం సాగింది. అయితే 1995 ఎపిసోడ్ లో మాత్రం ఇద్దరు కలసిపోయారు. ఎన్టీఆర్ ని గద్దె దించే సమయంలో బాబు వైపు వచ్చిన దగ్గుబాటి ఉప ముఖ్యమంత్రిని ఆశించారు. కానీ అది జరగలేదు దాంతో చాలా కొద్ది సమయంలోనే తిరిగి ఎన్టీఆర్ వైపు దగ్గుబాటి వచ్చారు. ఎన్టీఆర్ మరణం తరువాత ఆయన బీజేపీ కాంగ్రెస్ లలో చేరారు. ఇక 2019లో ఆయన వైసీపీలో చేరి పర్చూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు.

ఆ మీదట రాజకీయాలను వదిలేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో చంద్రబాబు టీడీపీకి ముప్పయ్యేళ్ళ అధ్యక్షుడిగా కొనసాగడమే కాకుండా నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు అలా బాబు తనదైన రాజకీయ వ్యూహంతో ముందుకు సాగితే దగ్గుబాటి మాత్రం రాజకీయంగా ఇబ్బంది పడి చివరికి రాజకీయాలే వద్దు అనుకున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే చంద్రబాబుతో దగ్గుబాటి పాత వైరాలను మరచి చెలిమి చేయడం ప్రారంభించారు. ముందుగా కుటుంబ కార్యక్రమాలలో కలుసుకుని మనసు విప్పి మాట్లాడుకున్న ఈ ఇద్దరూ ఇపుడు మరింత సన్నిహితం అయ్యారు. దగ్గుబాటి బాబు ఇద్దరూ ఇలా కలవడానికి కారణం ఏంటి అంటే దగ్గుబాటి కుమారుడు హితైష్ రాజకీయం కోసమే అని అంటున్నారు.

దగ్గుబాటి కుటుంబంలో వారసుడిగా ఆయనను చూడాలని అనుకుంటున్నారు. పురంధేశ్వరి బీజేపీలో ఉన్నారు. కానీ ఆమె ఈ టెర్మ్ తరువాత రాజకీయాల నుంచి తప్పుకుంటారు అన్న చర్చ సాగుతోంది. దాంతో కుమారుడి ఉజ్వల రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్ళ తాత పెట్టిన పార్టీలో చేర్పించి ఆయనను కూడా ఎమ్మెల్యేగా మంత్రిగా చూడాలని ఉందని అంటున్నారు.

దాంతోనే దగ్గుబాటి బాబుకు దగ్గర అయ్యారని అంటున్నారు. తెలుగుదేశంలో ఇపుడు యువతరం ప్రతినిధిగా నారా లోకేష్ ఉన్నారు. ఆయనతో పాటుగా హితైష్ కి కూడా చోటిస్తే ఏపీలో టీడీపీకి మరింత పట్టు దక్కుతుందని అంటున్నారు. చంద్రబాబు కూడా దగ్గుబాటి మీద సదభిప్రాయంతోనే ఉన్నారు. దాంతో 2029 నాటికి టీడీపీ టికెట్ ని హితైష్ కి ఇస్తారా ఆయన పోటీ చేస్తారా అన్నదే చర్చగా ఉంది. మొత్తానికి నారా నందమూరి కుటుంబాలతో పాటు దగ్గుబాటి కుటుంబం కూడా కలిసికట్టుగా ముందుకు సాగితే ఆ రాజకీయాలే వేరు అని అంటున్నారు.

Tags:    

Similar News