దళితబంధు లబ్ధిదారుల్ని ఫైనల్ చేసేది వాళ్లేనా?
దేశంలో మరే రాష్ట్రంలో లేని దళితబంధు పథకం రెండో విడత లబ్థిదారుల్ని ఎంపిక చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే.
దేశంలో మరే రాష్ట్రంలో లేని దళితబంధు పథకం రెండో విడత లబ్థిదారుల్ని ఎంపిక చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. తొలివిడతలో లబ్థిదారుల్ని ఎమ్మెల్యేలు నేరుగా ఎంపిక చేయగా.. రెండో విడతలోనూ అదే విధానాన్ని అమలు చేస్తారని చెబుతున్నారు. దీనికి సంబంధించిన కీలక ఆదేశాలు.. కలెక్టర్లకు చేరినట్లుగా తెలుస్తోంది.
గ్రామాల వారీగా అర్హులైన లబ్థిదారుల్ని ఎంపిక చేయాలని.. ఎమ్మెల్యేల ఆమోదం తర్వాత ఆయా కుటుంబాల ఆర్థిక.. సామాజిక పరిస్థితిపై అధికారులు పరిశీలన చేసి.. అర్హులైన వారిని ఎంపిక చేసి యూనిట్లు అందజేయాలని చెబుతున్నారు. ఈ పథకంలో ఎంపికైన లబ్థిదారులకు రూ.10లక్షల భారీ మొత్తాన్ని అందించటం.. ఈ నగదుతో వ్యాపారం చేసేలా ప్రోత్సాహించటమే ప్రధాన లక్ష్యమన్న సంగతి తెలిసిందే.
ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 1100 మంది చొప్పున మొత్తం 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో లబ్థిదారుల్ని ఎంపిక చేయాలని కలెక్టర్ కు ఆదేశాలు జారీ అయ్యాయి. 119 నియోజకవర్గాలకు హుజూరాబాద్ నియోజకవర్గాన్ని మినహాయించటానికి కారణం.. ఉప ఎన్నికల వేళ ఆ నియోజకవర్గంలో లబ్థిదారుల్ని ఎంపిక చేయటం తెలిసిందే. అందుకు ఆ నియోజకవర్గాన్ని మినహాయించారు.
దళితబంధు మొదటి విడతలో పెద్ద ఎత్తున విమర్శలు.. ఆరోపణలు రావటం తెలిసిందే. లబ్థిదారుల్ని ఎంపిక చేసే వైనం.. లబ్థిదారుల నుంచి పలువురు ఎమ్మెల్యేలు (వారి సహాయకులు) 20 - 30 శాతం వరకు కమిషన్ తీసుకున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. కొన్నిచోట్ల ఎమ్మెల్యేకు సన్నిహితంగా ఉండేవారిని.. వారి అనుయాయులను లబ్థిదారులుగా ఎంపిక చేసినట్లుగా విమర్శలు వెల్లువెత్తాయి. కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు మరో నాలుగు నెలల్లో ఉన్న వేళ.. దళితబంధు లబ్థిదారుల ఎంపిక ఎమ్మెల్యే చేతికి అప్పజెప్పటం ద్వారా కేసీఆర్ సర్కారు తప్పు చేస్తున్నట్లు చెబుతున్నారు.
నియోజకవర్గానికి 1100 మందిని లబ్థిదారులుగా ఎంపిక చేస్తే.. ఈ పథకం రాని వారు వేలాది మంది ఉంటారు. వారంతా ప్రభుత్వ తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసే ప్రమాదం పొంచి ఉంది. అదే జరిగితే మొదటికే మోసం ఖాయం. ఎమ్మెల్యేలు చెప్పిన వారికే ప్రాధాన్యం ఇవ్వాలన్న నిర్ణయం కూడా రానున్న రోజుల్లో మరిన్ని తలనొప్పుల్ని తెచ్చి పెడతాయని చెబుతున్నారు. దళితబంధు లబ్థిదారుల ఎంపికతో మేలు కంటే కీడే జరుగుతుందని.. ఎన్నికల వేళ.. ఈ పథకం వరం కాదు శాపమవుతుందన్న విశ్లేషణలు గులాబీ వర్గాల్లోనే వినిపిస్తుండటం గమనార్హం.