రంజిత్.. దానం చేరిపోయారు.. తర్వాత లిస్టులో ఉన్నదెవరు?
గడిచిన కొంతకాలంగా ముఖ్యమంత్రి రేవంత్ నోటి నుంచి వస్తున్న మాటలు ఈ రోజు వాస్తవంగా మారాయి.
గడిచిన కొంతకాలంగా ముఖ్యమంత్రి రేవంత్ నోటి నుంచి వస్తున్న మాటలు ఈ రోజు వాస్తవంగా మారాయి. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాటి నుంచి తమ సర్కారును కూల్చేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారంటూ తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ తీవ్ర ఆరోపణలు చేయటం తెలిసిందే. తమ ప్రభుత్వాన్ని కూల్చాలని భావిస్తే.. తానేమిటో చూపిస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారు. తమ ప్రభుత్వం కూలిపోవటం లేదని.. తాను గేట్లు తెరవాలే కానీ.. గులాబీ కారు మొత్తం ఖాళీ అయిపోవటానికి సిద్ధంగా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్..ఆయన కుటుంబ సభ్యులు.. ఒకరిద్దరు మినహా ఆ పార్టీలో మరెవరూ ఉండరంటూ వ్యాఖ్యలు చేస్తున్న రేవంత్ మాటలకు తగ్గట్లే.. పరిస్థితులు ఉన్నాయా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఇదిలా ఉంటే.. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాతి రోజునే మాజీ మంత్రి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్.. గులాబీ పార్టీకి చెందిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో.. కాంగ్రెస్ పార్టీలోకి గులాబీ దండు రాక మొదలైనట్లుగా చెబుతున్నారు.
లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ ను ఖాళీ చేయటమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతున్నట్లుగా అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్.. తాము గేట్లు ఎత్తేసినట్లుగా పేర్కొన్నారు. దీంతో.. భారీ ఎత్తున వలసలు షురూ అయినట్లేనని చెప్పక తప్పదు. గ్రేటర్ పరిధిలో ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ లో లేకపోవటం.. తాజాగా దానం కాంగ్రెస్ లో చేరటంతో గ్రేటర్ లో బోణీ కొట్టినట్లుగా చెబుతున్నారు.
విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. రానున్న కొద్ది రోజుల్లో గ్రేటర్ పరిధిలోని దాదాపు ఐదారుగురు వరకు గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరటం ఖాయమంటున్నారు. మొత్తంగా లోక్ సభ ఎన్నికల నాటికి.. గులాబీ పార్టీ నుంచి దాదాపు డజను నుంచి ఇరవై వరకు ఎమ్మెల్యేల రాక కాంగ్రెస్ లోకి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరేం జరుగుతుందో చూడాలి.