మీడియాను హోల్ సేల్ గా ఫూల్ చేసిన దానం

అయితే.. ఎప్పటికప్పుడు పార్టీ మారే ఉద్దేశం లేదన్న మాట దానం నోట వచ్చేది. కట్ చేస్తే.. నాలుగు రోజులుగా ఆయన తీరులో మార్పు వచ్చేసింది.

Update: 2024-03-17 13:30 GMT

యావత్ మీడియా మొత్తాన్ని మాజీ మంత్రి దానం నాగేందర్ ఫూల్ చేశారా? ఆయనపై మీడియా వర్గాలు ఇప్పుడు కారాలు మిరియాలు నూరుతున్నాయా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. దానం తీరును జీర్ణించుకోలేని పరిస్థితి. గడిచిన మూడు..నాలుగు రోజుల్లో చోటు చేసుకున్న పరిణామాల గురించి తెలిసిందే. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించటం.. రేవంత్ సర్కారు కొలువు తీరిన రోజు నుంచి దానం నాగేందర్ పార్టీ మారటం ఖాయమన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ ఉంది.

అయితే.. ఎప్పటికప్పుడు పార్టీ మారే ఉద్దేశం లేదన్న మాట దానం నోట వచ్చేది. కట్ చేస్తే.. నాలుగు రోజులుగా ఆయన తీరులో మార్పు వచ్చేసింది. ఉన్నట్లుండి.. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ ను కలిశారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలున్న సందర్భాన్ని ఎంచుకున్నారు. ఆయన పార్టీలో చేరటం ఖాయమని తేలినా.. ఆయన కేవలం ముఖ్యమంత్రిని కలిశారే తప్పించి.. మరేమీ లేదన్నట్లుగా వ్యవహరించారు.

అయినప్పటికీ ఆయన కాంగ్రెస్ లో చేరనున్నట్లుగా ప్రచారం జరిగింది. ఇదే విషయాన్ని ఆయన నోటి నుంచి స్వయంగా వినేందుకు ఆయనతో నిత్యం టచ్ లో ఉన్న పలువురు విలేకరులు ఆయనకు ఫోన్ చేశారు. అయితే.. శుక్రవారం మొత్తం ఆయన ఫోన్లు స్విచ్చాఫ్ లో ఉన్నాయి. ఆయన సహాయకులకు ఫోన్ చేసినా ఫలితం లేకపోయింది. ఎవరూ అందుబాటులోకి రాని పరిస్థితి. కట్ చేస్తే.. శనివారం సాయంత్రం మాత్రం ప్రముఖ మీడియా సంస్థలకు సంబంధించిన విలేకరులకు దానం స్వయంగా ఫోన్ చేశారు.

తనను మీడియా వాళ్లు బద్నాం చేస్తున్నారని.. తాను పార్టీ మారటం లేదని వ్యాఖ్యానించారు. ‘అన్నా.. మీరు పర్సనల్ గా తీసుకోవాలె. నేను పార్టీ మారటం లేదు. ఈ విషయం మీ మీడియాలో ప్రముఖంగా రావాలె. పార్టీ మారుతున్నట్లు ఉత్తినే ప్రచారం చేస్తున్నారు. మిస్ కాకుండా మీ పత్రికల్లో ఈ న్యూస్ రావాలె’’ అంటూ దానం చెప్పిన మాటలతో.. వెంటనే తమ బాస్ లతో మాట్లాడి ఆ వార్తను రాసిన పరిస్థితి.

దానం చెప్పిన మాటలకు విలువనిచ్చిన మీడియా సంస్థలు ఆయన వ్యాఖ్యల్ని ప్రచురించాయి.కట్ చేస్తే.. ఆదివారం ఉదయం ఆయన రేవంత్ సమక్షంలో రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ పార్టీ తీర్థంపుచ్చుకోవటంతో షాక్ తిన్న పరిస్థితి. దానం పార్టీ మారటం లేదన్న వార్తను రాసిన విలేకరులంతా ఆఫీసుల్లో సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. కొందరు అత్యుత్సాహపు బాస్ లు అయితే.. మీతో దానం మాట్లాడారా? ఒక్కసారి కాల్ డేటా పంపమని చెప్పటంతో దానం వార్త రాసిన విలేకరులంతా షాక్ తిన్న పరిస్థితి. తమను ఇంతలా ఇబ్బంది పెట్టిన దానం మీద కారాలు మిరియాలు నూరుతూ.. అన్నా.. అన్నా.. అంటూ భలే ఇరికించాడే అంటూ వాపోతున్నారట.

Tags:    

Similar News