చేవెళ్ల ఎంపీ ఎన్నికల్లో పొలిమేర నటి పోటీ

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఈ రోజే (గురువారం) చివరి రోజు.

Update: 2024-04-25 05:26 GMT

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఈ రోజే (గురువారం) చివరి రోజు. నామినేషన్ దాఖలు చేయటానికి తుది ఇవాళే ఆఖరు అవకాశం. మొత్తం 17 ఎంపీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో అందరిని ఆకర్షిస్తున్న నియోజకవర్గం చేవెళ్ల. ఇక్కడ బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుంటే.. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఇక.. బీసీ నేతగా సుపరిచితుడు.. సీనియర్ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. దీంతో.. ఈ సీటు ఫలితం ఎలా ఉంటుందన్న ఆసక్తి ఎక్కువైంది.

ఇదిలా ఉంటే.. ఇదే నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి ఒక సినీ నటి దిగటం ఆసక్తికరంగా మారింది. పొలిమేర సిరీస్ చిత్రాలతో నటిగా గుర్తింపు పొందిన దాసరి సాహితి తాజాగా ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. నటిగా పేరున్న వేళ.. ప్రముఖ రాజకీయ పార్టీల నుంచి పోటీ చేస్తుంటారు. అందుకు భిన్నంగా ఇండిపెండెంట్ గా పోటీ పడటం ఆసక్తికరంగా మారింది.

పొలిమేర సిరీస్ లో మొదటి భాగంలో గెటప్ శ్రీనుకు భార్య రాములు పాత్రలో నటించిన ఆమె.. స్వీకెల్ లో రాజేశ్ తో కలిసి నటించారు. పవన్ కల్యాణ్ కు వీరాభిమానిగా చెప్పుకునే సాహితి.. ఇన్ స్టాలో తరచూ రీల్స్ పోస్టు చేస్తుంటారు. రాజకీయ ఉద్ధండులు పోటీ పడుతున్న నియోజకవర్గం నుంచి అందుకు భిన్నంగా సినీ గ్లామర్ మాత్రమే ఉన్న సాహితి.. స్వతంత్రంగా పోటీ చేయటం ఆసక్తికరంగా మారింది. తాను చేసే రీల్స్ కు రాజకీయాల్ని ముడిపెట్టొద్దని కోరుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచన ఉండి ఉంటే.. మరింత ముందుగా ప్రజల్లోకి వచ్చి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News