అఫీసుకు వెళ్లండి.. డేటింగ్ చేయండి.. డబ్బులు సంపాదించండి!
ఆఫీసుకు ఎవరైనా ఎందుకు వెళ్తారు? అని అడిగితే.. అదేమి పిచ్చి ప్రశ్న..? ఆఫీసుకు వెళ్లేది పని చేయడానికి అని సమాధానం వస్తుంది! కానీ... ఆఫీసుకు రండి, డేటింగ్ చేయండి, రివార్డులు కొట్టేయండి అని ప్రకటించింది ఓ కంపెనీ.
ఆఫీసుకు ఎవరైనా ఎందుకు వెళ్తారు? అని అడిగితే.. అదేమి పిచ్చి ప్రశ్న..? ఆఫీసుకు వెళ్లేది పని చేయడానికి అని సమాధానం వస్తుంది! కానీ... ఆఫీసుకు రండి, డేటింగ్ చేయండి, రివార్డులు కొట్టేయండి అని ప్రకటించింది ఓ కంపెనీ. ఈ సమయంలో ధరల పట్టిక కూడా అందుబాటులోకి తెచ్చింది. ఆ లెక్క ఏమిటి.. ఈ వ్యవహారం ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం..!
అవును... చైనాలోని ఓ టెక్ కంపెనీ తాజాగా ఓ ఆసక్తికర డేటింగ్ ప్రోగ్రాం ను ప్రకటించింది. ఇందులో భాగంగా... ఉద్యోగులు బయట నుంచి సింగిల్స్ ను సంస్థకూ చెందిన డేటింగ్ ఫ్లాట్ ఫాం లో రిజిస్టర్ చేయించాలి. అలా చేస్తే.. ఒక్కో సింగిల్ కు రూ.770 చొప్పున సంస్థ సదరు ఉద్యోగికి చెల్లిస్తుంది. దీనికి కొనసాగింపు ఆఫర్ కూడా ఉంది.
ఇందులో భాగంగా... డేటింగ్ ఫ్లాట్ ఫాం లో రిజిస్టర్ అయిన వారిలో ఎవరైనా ఉద్యోగులకు నచ్చి, కనీసం మూడు నెలల పాటు రిలేషన్ లో ఉంటే.. ఇటు సంస్థలోని ఉద్యోగికి, చేరిన సింగిల్ కు, తనను ఫ్లాట్ ఫాంలో చేర్పించిన ఉద్యొగికి ఒక్కొక్కరికీ రు.11,700 చొప్పున రివార్డు కూడా ఇస్తారంట. దీంతో ఈ ఆఫర్ ఒక్కసారిగా సంచలనంగా మారింది.
దీంతో.. ఆ కంపెనీలోని ఉద్యోగులు ఈ విషయంపై పూర్తి స్థాయిలో కాన్సంట్రేషన్ చేశారో ఏమో కానీ... కొద్ది రోజుల్లోనే సుమారు 500 వరకు సింగిల్స్ ని నమోదు చేయించారంట. ఈ విషయాన్ని గర్వంగా చెబుతున్న సంస్థ యజమానులు.. దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని వెల్లడించారని అంటున్నారు. ఇది దేశం సమస్యకు ఓ పరిష్కారం అని చెబుతున్నారు.
వాస్తవానికి చైనాలో జననాల రేటుతో పాటు పెళ్లిళ్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. ఒకప్పుడు ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో టాప్ లో ఉన్న చైనాకు ఇప్పుడు రివర్స్ సమస్య ఎదురైంది! ప్రధానంగా యువత పెళ్లి చేసుకునే విషయంపై ఆసక్తి చూపించడం లేదని.. ఇక పిల్లలకు సంబంధించిన ప్రస్థావనే తేవడం లేదని అంటున్నారు.
2024 మొదటి మూడు త్రైమాసికాల్లో 4.74 మిలిహ్యన్ల వివాహాలు నమోదు కాగా.. గత ఏడాది రిజిస్టర్ అయిన 5.69 మిలియన్లతో పోలిస్తే ఇది 16.6 శాతం తక్కువ. ఇక 2022లో ప్రతీ వెయ్యిమందికి సగటున 6.77 జననాలు నమోదైతే.. 2023లో ఆ సంఖ్య 6.39కి పడిపోయిందని గణాంకాలూ చెబుతున్నాయి.
ఇలా సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గిపోతుండగా.. మరోవైపు వృద్ధ జనాభా పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే 2030 నాటికి 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 30 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సమస్యను పరిష్కరించడానికి ఇప్పటికే చైనా ప్రభుత్వం తో పాటు పలు సంస్థలు నడు బిగించాయి.
ఇందులో భాగంగానే ఇప్పుడు చెప్పుకున్న ఒక ప్రయత్నం. ఏది ఏమైనా... ఈ టెక్ కంపెనీ చేసిన ప్రయత్నం బాగానే సక్సెస్ అవుతుంద్ని అంటున్నారు. మరి ముందు ముందు ఇంకా ఎలాంటి ఆఫర్లు వస్తాయనేది వేచి చూడాలి!