పోలీసులపై బన్నీ అసహనం వార్తలు... డీసీపీ క్లారిటీ!
అవును... అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో హైడ్రామా.. పోలీసులపై అల్లు అర్జున్ అసహనం... అంటూ వచ్చిన వార్తలపై సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ స్పందించారు.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో శుక్రవారం మధ్యాహ్నం అల్లు అర్జున్ ను ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం అక్కడ నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. విచారణ, స్టేట్ మెంట్ రికార్డ్ అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
వైద్య పరీక్షల అనంతరం అక్కడ నుంచి నేరుగా నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ సమయంలో నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో.. అల్లు అర్జున్ ని చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ సమయంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఇందులో భాగంగా.. అల్లు అర్జున్ కు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ఆ సంగతి అలా ఉంటే.. "బట్టలు మార్చుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు.. సర్ నన్ను తీసుకెళ్లడం తప్పు లేదు.. కానీ.. మరీ బెడ్ రూమ్ బయటకు వచ్చి, బెడ్ రూమ్ దగ్గర నుంచి తీసుకెళ్లడం కచ్చితంగా మంచి విషయం కాదు.. టుమచ్.." అంటూ అరెస్ట్ సమయంలో అల్లు అర్జున్ పోలీసుల వద్ద అసహనం వ్యక్తం చేసినట్లు వార్తలొచ్చాయి.
దీంతో... పోలీసులు అల్లు అర్జున్ విషయంలో అంత దురుసుగా ప్రవర్తించారా.. దుస్తులు మార్చుకోవడాని కూడా అనుమతి ఇవ్వలేదా.. బెడ్ రూమ్ వద్దకు వెళ్లి మరీ అదుపులోకి తీసుకున్నారా అనే చర్చ మొదలైంది. దీంతో.. ఈ ఆరోపణలపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు.. వివరణ ఇచ్చారు.
అవును... అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో హైడ్రామా.. పోలీసులపై అల్లు అర్జున్ అసహనం... అంటూ వచ్చిన వార్తలపై సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ స్పందించారు. అరెస్టు సందర్భంగా నటుడు అల్లు అర్జున్ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించలేదని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈ సందర్భంగా... కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు సమయం ఇచ్చామని.. వారితో మాట్లాడుకునేందుకు అవకాశం ఇచ్చామని.. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాతే అదుపులోకి తీసుకున్నామని.. అల్లు అర్జున్ తానే స్వయంగా వచ్చి పోలీసు వాహనంలో కూర్చున్నారని సెంట్రల్ జోన్ డీసీపీ తెలిపారు.