చనిపోయాడనుకున్న హమాస్ కమాండర్ ప్రత్యక్షం... ఐడీఎఫ్ ఎక్కడ?
ఖతర్, అమెరికా జోక్యంతో హమాస్ – ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో.. అటు ఇటూ బందీల అప్పగింతలు జరుగుతున్నాయి.
కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ప్రస్తుతం గాజాను ఊపిరి తీసుకోనిస్తున్నాయి ఇజ్రాయెల్ దళాలు అని అంటున్నారు. ఖతర్, అమెరికా జోక్యంతో హమాస్ – ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో.. అటు ఇటూ బందీల అప్పగింతలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఓ షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది. చనిపోయాడని చెప్పిన హమాస్ కమాండర్ ప్రత్యక్షమయ్యాడు!
అవును... కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ప్రస్తుతం గాజాలో కాస్త ప్రశాంత వాతావరణం కనిపిస్తుంది. శిథిలాల మధ్య ఉన్నప్పటికీ ఆహారపానీయాలు అందుతున్న పరిస్థితి.. బాంబుల మోత, తుపాకీ చప్పుళ్లు ఆగిన స్థితి. పైగా ఇజ్రాయెల్ కొట్టిన దెబ్బకు ఇప్పట్లో హమాస్ తేరుకునే అవకాశం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్న నేపథ్యం.
ఈ సమయంలో చనిపోయాడనుకున్న హమాస్ కమాండర్ ఒకరు ప్రత్యక్షమయ్యారనే విషయం వైరల్ గా మారింది. ఇందులో భాగంగా.. గత మే నెలలో చనిపోయాడనుకున్న హమాస్ సీనియర్ నాయకుడు హుస్సేన్ ఫయాద్ తాజాగా గాజాలో ప్రత్యక్షమయ్యాడు. దీంతో.. ఒక్కసారిగా ఇజ్రాయెల్ షాక్ కి గురైందనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఐడీఎఫ్ రియాక్షన్ గురించి ప్రపంచం ఎదురు చూస్తుందని అంటున్నారు.
వాస్తవానికి గత మే నెలలో హమాస్ సీనియర్ కమాండర్ హుస్సేన్ ఫియాద్ చనిపోయినట్లుగా ఐడీఎఫ్ అధికారికంగా ప్రకటించింది. అయితే.. అతడు ఇంకా బ్రతికే ఉన్నాడని చెప్పేలా.. ఓ వీడియో ప్రత్యక్ష మయ్యింది. గాజాలో శిథిలాల ముందు నిల్చుని అతడు మాట్లాడుతున్నట్లుగా ఆ వీడియో ఉంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది!
అయితే.. ఆ వీడియో చిత్రీకరించిన, అప్ లోడ్ అయిన తేదీ లేదు కానీ.. అది తాజా వీడియోనే అనే విషయం అర్ధం అవుతుందని అంటున్నారు. ఏది ఏమైనా.. చనిపోయాడనుకున్న హుస్సేన్ ఫయాద్ సజీవంగా ఉన్నాడనే విషయం హమాస్ కు ఊపిరి పోసినట్లేనని.. ఇప్పుడు ఇతడు బ్రతికున్నాడనే విషయం ఆ సంస్థకు ఆయువుపట్టు లాంటిదని చెబుతున్నారు!
ఇదే సమయంలో.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ సామర్థ్యంపై ఈ వీడియో పలు సందేహాలు లేవనెత్తుతుందనే చర్చా మొదలైందని చెబుతున్నారు. మరి ఈ వీడియోపై ఇజ్రాయెల్ స్పందిస్తుందా.. హమాస్ అధికారికంగా రియాక్ట్ అవుతుందా.. ఈ వీడియో తాజా చిత్రీకరణనేనా అనేది తేలుతందా? ఏదైనా.. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఈ వీడియో తెరపైకి రావడం గమనార్హం.