ఆక్స్ ఫర్డ్ లో కశ్మీర్ పై చర్చ.. రచ్చ లేపిన వేర్పాటువాది?
ప్రజలను రెచ్చగొట్టడమే లక్ష్యంగా ఆయూబ్ విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నాడని.. ఇలా తరచూ చేస్తున్నాడని మండిపడ్డారు. ఆయూబ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్దఎత్తున నిరసనలు తెలిపారు.
వేదిక ఏదైనా.. కశ్మీర్ ను లేవెనెత్తడం పాకిస్థాన్ కు ఉన్న అలవాటు.. దీనికి దీటుగా బదులివ్వడం భారత్ కు అలవాటు. అయితే.. తటస్థ దేశాల్లోనూ కొన్నిసార్లు కశ్మీర్ వివాదం రేగుతుంటుంది. మరీ ముఖ్యంగా ఇంగ్లండ్ వంటి దేశంలో. ఒకప్పుడు అఖండ భారతదేశాన్ని పాలించిన దేశం కావడంతో భారతీయులకు తగినట్లే పాకిస్థానీలూ ఇంగ్లండ్ లో అధికంగా ఉంటారు. పాక్ సంతతి వారు ఇప్పటికీ ఇంగ్లండ్ క్రికెట్ లో కీలకపాత్ర పోషిస్తుండడం గమనార్హం. ఇక రాజకీయ నాయకుల నుంచి వ్యాపారుల వరకు పాకిస్థానీలు అత్యధికంగా వెళ్లేది కూడా ఇంగ్లండ్ కే. ఇక్కడి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చదివేందుకు పాకిస్థానీ విద్యార్థులు ఆసక్తి చూపుతుంటారు. ఇలాంటి వాటిలో ఒకటి ఆక్స్ ఫర్డ్.
చదువుల కోవెలలో..
ఆక్స్ ఫర్డ్ అంటే శతాబ్దాల చరిత్ర ఉన్న విశ్వవిద్యాలయం. ప్రతిభావంతులైన విద్యార్థులు చదవాలని కలలు కనే వర్సిటీ. అలాంటి ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో ఓ చర్చా వేదిక తీవ్ర దుమారానికి తెరతీసింది. శుక్రవారం యూనివర్శిటీ డిబేటింగ్ సొసైటీ నిర్వహించిన చర్చలో జమ్మూ కశ్మీర్ స్వయం ప్రతిపత్తి ప్రస్తావనకు వచ్చింది. దీని గురించి కమిటీ సభ్యులు మాట్లాడడంతో భారత విద్యార్థులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
మొదలుపెట్టింది ఎవరు?
కశ్మీర్ పై ముజ్జామ్మిల్ ఆయూబ్ ఠాకూర్ అనే వ్యక్తి చర్చను లేపాడు. "వరల్డ్ కశ్మీర్ ఫ్రీడమ్ మూవ్‌మెంట్" అనే సంస్థ స్థాపకుడు ఇతడు. తండ్రితో కలిసి సంయుక్తంగా 'మెర్సీ యూనివర్సల్' అనే సంస్థను నెలకొల్పాడు. ఈ రెండింటికీ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలున్నాయి. అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐతో పాటు యూకే నిఘా సంస్థలు కూడా దీనిపై విచారణ జరిపాయి. అంతేగాక ముజ్జామ్మిల్ ఆయూబ్ ఠాకూర్, జఫార్ ఖాన్ లకు ఉగ్రవాద సంస్థలతోనూ సంబంధాలున్నాయని ఆక్స్ ఫర్డ్ లో చర్చను అడ్డుకున్న భారత విద్యార్థులు విమర్శించారు.
ప్రజలను రెచ్చగొట్టడమే లక్ష్యంగా ఆయూబ్ విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నాడని.. ఇలా తరచూ చేస్తున్నాడని మండిపడ్డారు. ఆయూబ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్దఎత్తున నిరసనలు తెలిపారు.
ఆక్స్ ఫర్డ్ ఉగ్రవాదుల వైపే?
ఆయూబ్ తీరుతో భారత విద్యార్థుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ‘ఆక్స్ ఫర్డ్ యూనియన్ ఎప్పుడూ ఉగ్రవాదుల వైపే ఉంటుందంటూ’ వారు మండిపడ్డారు. కశ్మీర్ అప్పుడు..ఇప్పుడు..ఎప్పుడూ భారత్ లో భాగమేనని పేర్కొన్నారు. 1984లో లండన్ లో జరిగిన భారత దౌత్యవేత్త రవీంద్ర మాత్రే కిడ్నాప్, హత్యు ప్రస్తావించారు. దీనివెనక జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ ఎఫ్) ఉందని ఆరోపించారు.